16, జనవరి 2026, శుక్రవారం

మహాభారతము

 


 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*622 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


అవిజాతుని సలహా

నహుషుడు " మంత్రులతో ఉన్న రాజ్యం అంతా ఇస్తానన్నాను కదా ! ఇంతకంటే నావద్ద ఇవ్వడానికి ఏముంది " అని దుఃఖించాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అవిజాతుడు అనే ముని జరుగుతున్న విషయము విని " మహారాజా ! చింతించకండి. ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను " అన్నాడు. నహుషుడు " మునీంద్రా ! అదేదో చెప్పి పుణ్యం కట్టుకుని నన్ను రక్షించండి " అని వేడుకున్నాడు నహుషుడు మంత్రులతో. అవిజాతుడు " మహారాజా ! గోవు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు రెండు జాతులుగా పుట్టించినా ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వలన పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగసంభారాలు సమకూడుతాయి. ఆ యాగము చేయతగిన వాడు బ్రాహ్మణుడు. కనుక వీరిరువురు సమానులే. సకల వేదాంగ విదుడైన బ్రాహ్మణుడికి విలువ నిర్ణయించడం ఈశ్వరుడికి కూడా శక్యము కాదు. సకలదేవతా స్వరూపమైన గోవు కూడా అంతే కనుక బ్రాహ్మణుడికి సమానంగా గోవును దానంగా ఇచ్చి చ్యవనుడిని విడిపించండి " అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి నహుషుడు " మహానుభావా ! నన్ను కరుణించండి . మీకు వెల నిర్ణయించ కలిగిన శక్తి నాకు ఉందా ! కనుక తమకు బదులుగా గోవును దానము ఇస్తాను " అని అన్నాడు. చ్యవనుడు నవ్వి " నీ నిర్ణయానికి సంతోషించాను. నహుషమహారాజా ! గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతము, యజ్ఞములో గోవు అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము దేవతలకు కూడా పూజనీయము. కనుక నాకు బదులుగా గోవును ఇవ్వండి " అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చ్యవనుడికి సమర్పించారు. చ్యవనుడు " జాలరులారా మీకు చేపలకు స్వర్గ ప్రాప్తి కలిగిస్తాను " అని వరం ప్రసాదించాడు. తరువాత చ్యవనుడు, అవిజాతుడు నహుషుడికి వరం ఇవ్వడానికి సంకల్పించి నహుషుడికి సతతము ధర్మపరత్వము, ఇంద్రుడితో సమానమైన సంపదలు ప్రసాదించారు. తరువాత నహుషుడు రాజధానికి వెళ్ళాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: