🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 114*
*****
*శ్లో:-త్యజ దుర్జన సంసర్గం ౹*
*భజ సాధు సమాగమం ౹*
*కురు పుణ్య మహోరాత్రం ౹*
*స్మర నిత్య మనిత్యతామ్ ౹౹*
*****
*భా:- మానవ జన్మ మహత్తర మైనది. పశుత్వము నుండి మానవత్వానికి, మానవత్వము నుండి మాధవత్వమునకు పయనించాలంటే ఆధ్యాత్మిక మార్గంలో నాలుగు సూత్రాలు అవలంబించాలి. 1."త్యజ":- దుర్జనులతో సాంగత్యం విడిచిపెట్టాలి అని అర్థము. వారి నుండి సంక్రమించిన దురాలోచన, పరుషవాక్కు, దుష్కర్మలు పూర్తిగా విడనాడాలి. మనోవాక్కాయిక పాపాలకు దూరంగా మెలగాలి. 2. "భజ":- సత్ పురుషులను ఆశ్రయించాలి. వారి ద్వారా సదాలోచన, సద్భాషణము, సదాచరణ అలవరచుకొని సన్మార్గంలో పయనించాలి. వారి శుశ్రూష ద్వారా ఆత్మవిద్యను ఆర్జించాలి. 3. "కురు":-"మన్ మే రామ్ - హాథ్ మే కామ్" అన్నారు పెద్దలు. దైవప్రీతితో పాటు తరువులు, గోవులు, నదులు, మేఘాల వలన స్ఫూర్తిని పొంది, రాత్రనక, పగలనక త్రికరణ శుద్ధితో పరోపకార పరాయణులం కావాలి. మానవసేవయే మాధవసేవ అని గుర్తించాలి. 4. "స్మర":- దేహము అనిత్యమని, ఆత్మ నిత్యమని, సత్యమని, స్థిరమని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. దేహాభిమానం వల్లనే కామాది వికారాలు, అహంకార మమకారాలు విజృంభిస్తాయి. వీటిని క్రమంగా నిగ్రహంతో నియంత్రిస్తూ, వైరాగ్యభావాన్ని పెంచుకొని, ఆత్మవిచారణలో నిమగ్నం కావాలి. జ్ఞాన సంపన్నతతో పరిణతి చెంది, ఆత్మ సాక్షాత్కారానికి సాధనా తత్పరత నలవరచుకోవాలని కావాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి