20, డిసెంబర్ 2020, ఆదివారం

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-100- శ్లోకము :


దేవః కిం బాంధవః స్యాత్ప్రియ సుహృదథవాచార్య ఆహోస్విదర్యో


రక్షా చక్షుర్ను దీపో గురురుత 

జనకో జీవితం బీజమోజః


ఏవం నిర్ణీయతే యః కిమితి న 

జగతాం సర్వథా సర్వదోఽసౌ


సర్వాకారోపకారీ దిశతు 

దశశతాభీషు రభ్యర్థితం వః ॥



-100- ఉత్పలమాల :


దేవుడొ , బంధువో , గురుడొ ,

దేశికుఁడో , సఖుఁడో , విభుండొ , వి


శ్వావనుఁడో , ప్రదీపమొకొ , యక్షియొ ,

తాతయొ , హేతువోజమో


జీవితమంచుఁ దీర్పిడగఁ జెల్లని

వేవెలుఁగెల్ల రూపులం


గావ సదా జగంబునుపకారి

యతండిడు మీకు భద్రముల్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలరూప

   లోకోపకారిగా చెప్పుచున్నారు..]


దేవుడొ , బంధువో , (విద్యలను నేర్పు ..) గురుడొ , దేశికుఁడో = ఉపదేశమిచ్చు జ్ఞాన బోధకుడో , సఖుఁడో , విభుండొ = అధిపతియో , < విశ్వ(..మును) , 

+ అవనుఁడో = రక్షించువాడో > = జగద్రక్షకుడో , ప్రదీపము + ఒకొ = విశిష్ట తేజోమయమైన దీపమో , 

(య)అక్షి యొ = జగములన్నిటినీ ౘూచు నేత్రమో , తాత యొ = తండ్రియో , 

హేతువు = కారణమో , + ఓజమో =

శక్తియో , జీవితమో ,  + అంచుఁ = అని , 

(దీ)తీర్పు + ఇడగఁ = తీర్మానించు / నిర్ణయించుటకు , (జె)చెల్లని = వీలు లేని ,  వే వెలుఁగు = వేయి(అనంతమైన) కిరణములవాడు - సూర్యుడు ,  

+ ఎల్ల రూపులం(న్‌) = అన్ని రూపములుగా , సదా , జగంబును , 

(గా)కావ = కాచుటకు , 

+ ఉపకారి(..యైన) , (య)అతండు , 

+ [ఇడు] మీకు , భద్రముల్‌ = శుభములు , ఇడు = ప్రసాదించును గాక ..✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలరూప

   లోకోపకారిగా చెప్పుచున్నారు..]


దేవుడో - బంధువో - విద్యలను నేర్పు గురుడో - దేశికుఁడో - సఖుఁడో - విభుడో - జగద్రక్షకుడో - ప్రదీపమో - జగములన్నిటినీ ౘూచు నేత్రమో - తండ్రియో - కారణమో - శక్తియో - 

జీవితమో .. అని నిర్ణయించుటకు 

వీలు లేని  వే వెలుగులవాడు - సూర్యుడు అన్ని రూపములుగా సదా జగంబును కాచుటకు ఉపకారియైన అతడు మీకు శుభములు 

ప్రసాదించును గాక ..✋️🤚

కామెంట్‌లు లేవు: