🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 119*
*****
*శ్లో:- పితృభి స్తాడితో పుత్రః ౹*
*శిష్య స్తు గురు శిక్షితః ౹*
*ఘనాహతం సువర్ణం చ ౹*
*జాయతే జనమండనమ్౹౹*
*****
*భా:-లోకంలో శిక్ష తోను,శిక్షణ తోను,రాపిడి తోను రాణించేవి మూడు అంశాలు పరిశీలిద్దాం. 1. "పుత్రుడు":-తల్లి దండ్రుల ఆలనా పాలనలో బాల్యము నుండి సామ దాన భేద దండో పాయాల నిబద్ధత, క్రమశిక్షణల తో క్రమంగా ఉన్నతంగా ఎదిగి, విద్యావినయ సంస్కార సుగుణగణ శోభితుడైన కుమారుడు; 2. "శిష్యుడు":- విద్యా, జ్ఞాన సంపత్తితో పాటు మానవీయ, సామాజిక, సాంస్కృతిక విలువలలో గురువు గారి శిష్యరికంలో సుశిక్షితుడై, కమనీయ శిల్పంగా మలచ బడిన శిష్య పరమాణువు; 3. "బంగారము":- ఎంత ఖరీదు గల, అపురూప లోహమైనా, అగ్నిలో సలసల కాల్చబడి, స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తినడం చేత మిరుమిట్లు కొలిపే కాంతు లీనుతూ, నగల రూపంలో రూపుదిద్దబడిన బంగారము; 4. పుత్రుడు, ఛాత్రుడు, పుత్తడి అనబడే యీ మూడును జనబాహుళ్యంలో నిరంతరం ప్రశంసాపాత్రమై, వేనోళ్ళ కొనియాడబడుతూ, చెక్కు చెదరని కీర్తి ప్రతిష్ఠలతో ఇనుమడిస్తాయి. విశ్వవ్యాప్తంగా అందరి హృదయాలలో శాశ్వత సుప్రతిష్ఠమై గారవింప బడతాయి. ఇలా "పుత్రుని" , "శిష్యుని", "పసిడి" ల యొక్క ఉజ్జ్వలమైన భవిత తల్లిదండ్రులు, గురువు, స్వర్ణకారుని చేతుల్లో ఉందని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి