2, డిసెంబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 98

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత - 98*

                                      *****

              *శ్లో:- కరా    వివ   శరీరస్య  ౹*

                     *నేత్రయో   రివ పక్ష్మణీ ౹*

                     *అవిచార్య ప్రియం కుర్యాత్౹*

                     *తన్మిత్రం    మిత్ర  ముచ్యతే ౹౹*

                                         *****

*భా:-  లోకంలో మనకు హితులన దగిన వారు ముగ్గురే అని పంచతంత్రం చెబుతున్నది.వారే*

*తల్లి-తండ్రి-మిత్రుడు.  మన జీవనపురోగమనంలో తల్లిదండ్రుల పాత్ర గురించి ప్రత్యేకించి వేరే చెప్పనక్కరలేదు. వారిది సమున్నతస్థానము. మిత్రులు చాల మంది ఉండవచ్చు. కాని "సన్మిత్రుడు"  మన శరీరానికి చేతులు, కంటికి రెప్పలు ఎలా ఉంటాయో అలా ఉండాలి.  చేతులు, రెప్పలు మన దైనందిన అవసరాల కనుగుణంగా, అసంకల్పిత ప్రతీకారచర్యలలో సమర్థవంతమైన క్రియాశీలక* *కార్యకర్తలుగా సమయస్ఫూర్తితో పనిచేస్తాయి. మనం   అడగకుండానే "చేతులు" వివిధ పనులలో వాటంతట అవే జోక్యం చేసుకుంటూ, చాకచక్యంగా సాయపడుతుంటాయి."రెప్పలు" కంటిలో ఒక్క నలక గాని, దుమ్ము- ధూళి గాని  *పడకుండా నిరంతర    అప్రమత్తతతో కాపాడుతుంటాయి. అలా మన ఇంగితాన్ని, హృదయాన్ని పసిగట్టి, కనిపెట్టి ఆపత్తు, విపత్తులలో  ఆదుకుంటూ,   సంపత్తులో రక్షగా  వెన్నంటి    కాపాడగలిగిన మిత్రుడే నిజమైన మిత్రుడు. అతనికి మనం కూడా అలాంటి సన్మిత్రునిగా ఉండాలి. మన జీవితం సార్థక మవడానికి అలాంటి మిత్రులు నలుగురు చాలని గ్రహించాలి. చరమాంకంలో కూడా ఆ నలుగురు కొండంత  అండగా ప్రక్కనే  ఉంటే నిశ్చింతగా, నిబ్బరంగా కన్ను మూయవచ్చు.  "మిత్ర" మనే అక్షరద్వయం భగవత్ ప్రసాదిత వరం అని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: