27, ఫిబ్రవరి 2021, శనివారం

మొగలిచెర్ల

 *దంపతుల పై దయ..*


"ఈరోజు బుధవారం కదండీ..ఈరోజు నుంచీ వచ్చే సోమవారం ఉదయం వరకూ స్వామివారి సన్నిధి లో ఉండాలని వచ్చామండీ..ఇద్దరమూ పెద్దవాళ్ళం..మా కొఱకు వసతి చూపించండి..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి నిద్ర చేసి వద్దాము..అని ఈవిడ ఐదారు నెలల నుంచీ నాతో చెపుతోంది..ఈరోజుకు మాకు కుదిరింది..ఇక్కడకు వచ్చాము..ఏదైనా ఒక రూమ్ ఇప్పించండి.." అని ఆ దంపతులు ప్రాధేయపూర్వకంగా మా సిబ్బందిని అడిగారు..మా సిబ్బంది కూడా వెంటనే వాళ్లకు ఒక గది కేటాయిస్తూ.."మీకు కేటాయించిన గది ని శనివారం నాటికి వేరేవాళ్లకోసం అట్టే పెట్టాము..ప్రస్తుతానికి మీరు అందులో వుండండి..శనివారం రోజు మీకు మరో చోట వసతి చూపిస్తాము.." అని చెప్పారు.."అలాగే..సర్దుకుంటాము.." అని చెప్పారు..


ఆరోజు సాయంత్రం నేను మందిరానికి వచ్చేసరికి..ఈ దంపతులు వచ్చిన వైనం మా వాళ్ళు నాకు తెలిపారు..ఈలోపల ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."మీరేనా ఈ మందిరానికి ధర్మకర్త? మీ పేరు ప్రసాద్ కదా? " అని అడిగారు..అవును అని సమాధానం ఇచ్చి.."మీరెక్కడినుండి వస్తున్నారు..?" అని అడిగాను.."మాది కడప జిల్లా..నాపేరు ఈశ్వర రావు..ఈమె సరస్వతి..గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాము..నేను రెవెన్యు లో ఈమె టీచర్ గా పనిచేసేవాళ్ళము..కొన్ని సమస్యలతో బాగా మనస్తాపం చెందాము..మా జీవనానికి ఏలోటూ లేదు..జరిగిపోతుంది..ఇద్దరికీ పెన్షన్ వస్తుంది..సమస్య ఆర్ధికంగా కాదు..మాకు ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ అబ్బాయిలే..పెద్దవాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్లు..రెండో వాడికి ఇరవై తొమ్మిది..రెండోవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో వాడికి ఉద్యోగం..మంచి జీతం వస్తుంది..మా దిగులంతా పెద్దవాడి గురించే..డిగ్రీ చదివే నాటి నుంచే చెడు అలవాట్లకు లోనయ్యాడు..సిగరెట్లు..తాగుడు..వాడితో నరకం పడుతున్నాము..చదువు అబ్బలేదు..నాకున్న పలుకుబడితో రెండు మూడు చోట్ల..ఏవో చిన్న ఉద్యోగాలలో చేర్పించాను..ఆరు నెలలు తిరక్కముందే..అక్కడి అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగం మానేసి వచ్చేవాడు..వీడి ప్రవర్తన తో విసిగి పోయాము..అందరి దేవుళ్లకూ మొక్కుకున్నాము..మేమూ రిటైర్మెంట్ అయిన తరువాత..చిన్నవాడి వద్ద కొన్నాళ్ళు ఉన్నాము..వాడికి వివాహం చేసుకోవాలని ఉన్నది..కానీ పెద్దవాడి పరిస్థితి చూస్తే..ఇలా ఉన్నది..పెద్దవాడి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వాడికి అమ్మాయిని ఇవ్వరు..రెండోవాడికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాము..ఈలోపల ఈ స్వామివారి గురించి విని ఒక్కసారి ఈ స్వామికి కూడా మొక్కుకొని వెళదామని వచ్చాము.." అన్నారు..అలా చెప్పేటప్పుడు ఆ దంపతుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..నిజమే..పెద్దకొడుకు ఎందుకూ పనికిరాని అప్రయోజకుడు అయితే..ఆ తల్లిదండ్రులకు మనస్తాపం సహజమే కదా..


ఆ దంపతులిద్దరూ మొత్తం ఐదు రోజులు వున్నారు..రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు..శనివారం పల్లకీసేవ లో తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..శని, ఆదివారాల్లో మందిరం వద్ద జరుగుతున్న కార్యక్రమాలు, అన్నదానం అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి వద్ద తమ సమస్యలు తీరిపోయిన కొందరు భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు..సోమవారం ఉదయం తిరిగి తమ ఊరు వెళ్ళిపోతూ.."ప్రసాద్ గారూ..ఇక్కడ చాలా ప్రశాంతంగా వుందండీ..మా అబ్బాయి సమస్య అంతా స్వామివారి మీదే పెట్టాము..ఇక నీటముంచినా..పాలముంచినా..ఆయనదే భారం..మా మనసులో ఏదో ఆశ పుట్టింది..చూద్దాం..మా ప్రాప్తం యెట్లున్నదో.." అని చెప్పారు..


ఆరేడు నెలల తరువాత..ఆ దంపతులు మళ్లీ వచ్చారు..ఈసారి వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు, కోడలు ను కూడా వెంటబెట్టుకు వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..వీడు మా రెండో అబ్బాయి..వీడికి రెండు నెలల క్రితం వివాహం చేసాము..మేము ఇక్కడినుంచి వెళ్లిన నెల తరువాత..మా పెద్దవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు..ఒక నెల వాడి జాడ తెలియలేదు..బాగా బాధపడ్డాము..ఒక రకంగా మేము పడుతున్న వేదనకు దేవుడు ఇలా పరిష్కారం చూపించాడేమో అని సమాధాన పడ్డాము..ఈలోపల వీడికి సంబంధాలు వచ్చాయి..ఇక ఆలస్యం చేయకుండా వివాహం చేసాము..చిత్రంగా మా పెద్దవాడు పోయిన నెలలో వచ్చాడు..ఎవరో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడట..తాగుడు మానేసాడట..ముందు మేము నమ్మలేదు..ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడించాడు..తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు..ప్రస్తుతం మాతో రోజు మార్చి రోజు మాట్లాడుతున్నాడు..వాడు బాగుపడ్డాడనే నమ్మకం కుదిరింది..స్వామిదయవల్ల వాడి బతుకు వాడు బతికితే అదే చాలు..మాకు పెద్ద కోరికలు లేవు..ఆరోజు స్వామిని వాడి గురించే మొక్కుకున్నాము..స్వామివారు దయ చూపారు..కాబట్టే..ఈనాడు వాడి స్థితి కి తగ్గ జీవనోపాధి దొరికింది..ముఖ్యంగా తాగుడు మానేశాడు..స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము.." అని చెప్పారు..చెప్పేటప్పుడు ఇద్దరి కళ్ళలో నీళ్లు ఉన్నాయి..కానీ అవి వేదనతో వచ్చినవి కాదు..సంతృప్తి తో వచ్చిన కన్నీళ్లు..


జీవిత చరమాంకం లో ఆ దంపతులకు మనోవేదన దూరం చేసి..తృప్తిని ఇచ్చారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: