15, మే 2021, శనివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..*


*(ఇరవై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగటం..శ్రీధరరావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగిన తరువాత..ప్రభావతి గారు మాత్రం..తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి..పరిష్కారం పొందాలని తహ తహ లాడారు.. శ్రీధరరావు గారు హుందాగా వారించారు..


కానీ..ఆ ప్రక్కరోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్లీ అదే మాట అడిగారు..ఆ సమయంలో శ్రీధరరావు గారి తల్లిగారు, శ్రీధరరావు దంపతులు మాత్రమే వున్నప్పుడు.."అమ్మా!..మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు..మీ మనసులో ఏదేని కోరిక వుంటే చెప్పండి.." అని..ప్రత్యేకంగా ప్రభావతి గారి నుద్దేశించి.."ఏమి కావాలో చెప్పు తల్లీ!.." అన్నారు..శ్రీధరరావు గారు కొద్దిగా అసహనంతో.."ప్రభావతీ పిచ్చి పిచ్చి కోరికలు కోరకు!..అనవసరంగా మాట్లాడకు!.." అన్నారు..


శ్రీ స్వామివారు.."అమ్మను కోప్పడకండి శ్రీధరరావు గారూ..నేను బిడ్డలాంటి వాడిని..నాతో చెప్పుకోనియ్యండి.." అన్నారు..


"నాయనా!..మేము గృహస్థులము..ఎన్నో సమస్యలుంటాయి..అన్ని అవసరాలూ ధనం తో ముడిపడినవే!..బాధ్యతలు నెరవేర్చాలన్నా ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పవు..ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరడం తప్పా?.." అన్నారు ప్రభావతి గారు..శ్రీధరరావు గారు వారిస్తున్నా ఆవిడ అడగదల్చుకున్నది అడిగేశారు..


శ్రీ స్వామివారు చిరునవ్వుతో.."అమ్మా!..నీ సందేహనివృత్తి చేస్తాను!..శ్రద్ధగా వినండి!.." అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి..


"గృహస్థులకు నిత్యమూ ధనంతో అవసరమే!..వారి వారి బాధ్యతలననుసరించి డబ్బుతో అవసరాలుంటాయి..అయితే అవసరం వేరు..ప్రలోభం వేరు..అత్యాశలు వేరు!..అయితే..అమ్మా..నీ యింటి ఆవరణలో నీవు పెంచిన పారిజాతాలు, మందారాలు..ఇతర పూలమొక్కలు..ఇంటికి ఆనుకొని ఉన్న అశ్వద్దవృక్షం..ఆ వృక్షం కొమ్మ కొమ్మకూ ఆవాసం ఏర్పరచుకొని కీలకిలారావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులూ..నిర్మలమైన గాలి..వెలుతురు..కమ్మని పాడి..నిత్యమూ ఇంటికొచ్చే అతిధులూ..ఇవన్నీ భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యాలు కదా తల్లీ..పూలు, పక్షులూ..అతిధులూ..ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా?..అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లీ!..అర్ధం చెప్పు!.." అన్నారు..


"ధనం..ధాన్యం..పాడి..పంట..వగైరాలు..నాయనా!.." అన్నారు ప్రభావతి గారు..


"ఆ 'వగైరా' అంటే ఏమిటమ్మా?..దాని అర్ధమేమిటో ఆలోచించావా ఎప్పుడైనా?.." అన్నారు శ్రీ స్వామివారు..


ఆమాటకు అర్ధమేమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు..


"నేను చెపుతాను శ్రద్ధగా విను తల్లీ!..అష్టైశ్వర్యాలు అనగానే..ధనము, పెద్ద మేడలు.. నగలు..హోదా..పదవి..ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్ధం చెప్పుకుంటారు..కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా..భగవంతుడి కరుణ!..ఈ సర్వసృష్టినీ క్షణమాత్రంలో సృష్టించి..క్షణంలో రక్షించి..మరుక్షణంలో లయింపచేసే ఆ దైవం యొక్క కరుణ కిరణం ఒక్కటి వుంటే..ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు!.."


"రాక్షసులు త్రిలోకవిజయం, అతి భోగలాలస కోసం తీవ్ర తపస్సు చేస్తారు..తపస్సు వలన దైవం కరుణ జూపి..వాళ్ళు కోరిన కోర్కెలు..లేదా వరాలు ఇస్తాడు దైవం..కానీ వాళ్ళు అధర్మప్రవర్తన తో అన్నీ పోగొట్టుకుంటారు..చివరికి వాళ్ళ ప్రాణాలతో సహా!..మనుషులూ అంతే.. దేవుణ్ణి పూజించడం అంటే..కోరిక తీర్చటం కోసమే..డబ్బు, నగలు..పదవి..హోదా..కార్లు..బంగళాలు.. ఇలా వెంపర్లాడటం కోసం పూజిస్తారు..నూటికో.. కోటికో..ఒక్కరు నిష్కామంగా దైవాన్ని పూజిస్తారు..వారికే ముక్తి దొరుకుతుంది..వారికి అష్టైశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి..కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి..ముక్తినే కోరుకుంటారు..వాళ్ళు ముక్తసంగులు..అవధూతలు..యోగులు..వారిని బాధిస్తే ఎలాంటివారికైనా చావుదెబ్బ దైవం చేతిలో తప్పదు.."


"ఇక మీ విషయం లోకి వస్తానమ్మా..నువ్వు చెప్పినట్లు గృహస్థులకు ఆర్ధిక బాధలు సహజం..ముందుగా నీ వద్ద ఉన్న ఐశ్వర్యాలు నీకు తెలుసా?.." అంటూ ఒక్కక్షణం ఆగారు..


అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..తరువాయి భాగం రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: