22, జులై 2021, గురువారం

తల్లి దండ్రులు- పిల్లల భాద్యత

తల్లి దండ్రులు- పిల్లల భాద్యత 

తల్లిదండ్రులు ప్రతివారికి కనిపించే దేముళ్ళు.  ఆ దేముడికి అపకారం చేసినా దేముడు క్షమిస్తాడు కానీ తల్లిని కానీ, తండ్రిని కానీ లేక కుటుంబంలోని యితర పెద్ద వారిని అంటే తాతగారు, నయనమ్మగారు వున్న వారి పట్ల చులకన భావన కలిగి ఉండటం.  వారిని నిర్లక్షయం చేసిన పూర్వము రాజులు కఠినంగా శిక్షించే వారు.  ఇప్పుడు రాజులు లేరు.  ప్రజా నాయకులు వారే ధర్మాన్ని ఆచరించటం లేదు ఇక అటువంటి అధర్మ పరులకు శిక్షలు వేయటం లేదు.  కానీ భగవంతుని దృష్టిలో తల్లిదండ్రుల విషయంలో నిర్లక్షము చేసిన వారు ఈ లోకములో మాత్రమే కాక పరలోకములో కూడా అంటే నరకములో కూడా శిక్షింపబడతారు. 

మన హిందూ ధర్మంలో ముందుగా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అతిధి దెవొ భావ అనే మనకు మన పెద్దలను దైవస్వరూపులుగా భావిస్తూ వారిని సేవించాలని మన ధర్మం చెపుతున్నది. ఇప్పుడు పాశ్చాచ్య నాగరికతకు అలవడి తల్లిదండ్రుల సొమ్ము మీద మాత్రమే శ్రర్ధ చూపిస్తూ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం రోజు ఎన్నో వార్తలు చూస్తున్నాము.  విదేశీ వ్యామోహంతో తల్లిదండ్రులను వదిలి వారి యోగక్షేమం పట్టించుకోని వారు కొందరైతే, భార్యల మాటలకు తలవొగ్గి తల్లిదండ్రులను నిర్ధాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్లగొట్టె వారు కొందరు తయారౌతున్నారు. తల్లిదండ్రులు ఆస్తి పాస్తులు ఉంటే ఏ వృధాశ్రమంలోనో తలదాచుకుంటున్నారు. ఒకసారి ప్రముఖ  ప్రవచనకారులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తన ప్రవచనంలో చెప్పినదేమిటంటే తానూ ఒక పర్యాయము ఒక వృధాశ్రమాన్ని సందర్శించానని అక్కడ ఒక వృద్ధురాలు సంచి పట్టుకొని గేటు వద్ద తారట్లాడుతున్నదని.  ఆ విషయం తెలుసుకుంటే అక్కడి నిర్వాహకులు చెప్పింది విని తానూ నిస్చేస్తుడనయినానని ఎంతో బాధగా తెలిపారు ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ఆ తల్లి కుమారుడు కారులో ఆమెను అక్కడ దింపి ఇప్పుడే వస్తానని చెప్పి రెండు సంవత్సరాల క్రితం వెళ్ళాడట అప్పటినుండి ఆమె తన కన్నకొడుకు కోసం వేచి వున్నడట.  ఇటువంటి హృదయ విదారక సంఘటనలు మన సమాజంలో కో కోల్లలు.  తల్లి పెంషన్ తీసుకొని తల్లిని వెళ్లగొట్టె ప్రబుద్ధులు లేక పోలేదు. 

పెంపక లోపం:  తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూడటం కేవలం పిల్లలదే ఆ దోషం అనటానికి వీలులేదు.  చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, లాలనతో పెంచి చక్కటి క్రమశిక్షణ నేర్పితే  వారు తప్పకుండా తమ కన్నవారిపైన ప్రేమ, భక్తి కలిగి వుంటారు.  కొన్ని సందర్భాలలో ఇంటి అల్లుడు చూపే ఆదరణ కూడా కన్నకొడుకులు చూపటం లేదని మనం కొన్ని చోట్ల చూస్తున్నాము.  అయినా వృద్ధ తల్లిదండ్రులు కొడుకులమీద వ్యామోహం పెంచుకొంటూ వుండి అనేక కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఎంతో కాలం క్రితమే వేమన వ్రాసిన ఈ పద్యం చుడండి. 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమీ వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవ గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమా!

భావం : తల్లిదండ్రులపైన దయ తో ఉండాలి. వృద్ధాప్యం లో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్న లేనట్టే . అలంటి వాడు పుట్టలోని పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం

యోగి వేమన 17 వ శతాబ్దంకు చెందిన వాడు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం వేమన పద్యం ఇప్పటి సమాజానికి అద్దం పెట్టినట్లుగా ఉన్నదంటే మనం సామాజికంగా ఎంతగా అభివృద్ధి చెందామన్నది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న.

కుంచిత మనస్తత్వాలు:  సమాజంలో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఎందుకు కుంచిత మనస్కులై వర్తిస్తున్నారు.  మా అమ్మ తాను నవమాసాలు మోసి తన రక్త మాసాలు ఇచ్చి నాకు జన్మని ఇచ్చిందే అని  ప్రతి వక్కరు తెలుసుకోవాలి అప్పుడు వృధాశ్రమాల అవసరం మన సమాజానికి ఉండదు. తల్లిదండ్రులను వేదనకు గురిచేసి కొడుకులకు గరుడపురాణం ప్రకారం నరకంలో శిక్షలు వున్నాయి చుడండి.

 కాలసూత్ర నరకం: తల్లిదండ్రులకు, సద్బ్రాహ్మణులకు, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకలోకాన్ని పొందుతారు. రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరిగే సూర్యుడు వీరిని మాడ్చి వేస్తుంటాడు.

భూమి మీద వున్న జంతుకోటిలో మానవుడు ఒక్కడే బుద్దిజీవి.  కానీ వక్రబుద్ధితో సమాజాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తూ చివరకు తనుకూడా నాశనం అవుతున్నాడు. తన కన్నవారిని సరిగా చూడని వారి పిల్లలు రేపు వారిని ఎలా చూస్తారు అని ఆలోచించాలి.  ప్రతివారికి మనసాక్షి ఉంటుంది దానిని ఎవ్వరు కాదనలేరు. 

ఈ వ్యాసం ఒక్క కుమారుడినైనా మార్చి ఒక్క తల్లి జీవితానికి వెలుగు నిచ్చిన ఈ వ్యాస కర్త ప్రయత్నం ఫలించినట్లే.  

కామెంట్‌లు లేవు: