19, ఆగస్టు 2021, గురువారం

*శ్రీ సూక్తము..* *(ఎనిమిదవ భాగము)*

 *శ్రీ సూక్తము..*  *(ఎనిమిదవ భాగము)*



లక్ష్మీదేవికి మొత్తం 18 మంది కుమారులు. ( ఆవిడకు సంతాన లక్ష్మి అన్న పేరు ఊరికే రాలేదు). వీళ్ళందరూ కూడా ఆమెకు మానసిక పుత్రులు. విష్ణుమూర్తి తో సంబంధం లేకుండా అచ్చంగా లక్ష్మీదేవికే పుట్టినవాళ్ళు. శివుడు గజాసురుని గర్భంలో ఉన్నప్పుడు పార్వతికి గణపతి పుట్టినట్లు అలాగే పార్వతి తో సంబంధం లేకుండా శివునికి కుమారస్వామి పుట్టినట్లుగా లక్ష్మీదేవికి ఈ పద్దెనిమిది కుమారులు మానసిక పుత్రులుగా పుట్టారు. వీళ్ళ పేర్లు  దేవసఖ, చిక్లీత (మన్మధుడు), ఆనంద, కర్దమ, శ్రీప్రద, జాతవేద, అనురాగ, సంవాద, విజయ, వల్లభ, మద, హర్ష, బల, తేజ, దమక, సలిల, గుగ్గుల, కురుంటక అని. వీళ్లకు సంబంధించిన వివరాలు పురాణాలలో అంత ప్రముఖంగా లేవు. లక్ష్మీ దేవి కి సంబంధించిన కొన్ని వ్రతాల లోనూ కొన్ని రకాల పూజల్లోనూ మాత్రమే వీళ్ళ పేర్లు వినిపిస్తాయి. వీళ్ళ పేర్లకు ముందు ఓం అని తరువాత యైనమః అని చేర్చి జేపిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషించి భక్తులను అనుగ్రహిస్తుంది అని నమ్మకం. ఓం దేవసఖాయై నమః ఓం చిక్లీతాయై నమః ఇలాగ అనమాట. శ్రీ సూక్తం లో  జాతవేద చిక్లీత, కర్దమ, ఆనంద, దేవసఖ అనే వాళ్ళ పేర్లు వినిపిస్తాయి. సూక్తంలో అమ్మవారి అనుగ్రహాన్ని మాకు సాధించి పెట్టు అమ్మవారిని మా వద్దకు ఆహ్వానించు అని వాళ్ళను ప్రార్ధించడం జరుగుతుంది. 


*ఏడవ ఋక్కు* :: 


*ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।*

*ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తి॒మృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥*


*దే॑వస॒ఖ*= లక్ష్మీదేవి పుత్రుల్లో ఒకడు. దే॑వస॒ఖుడు నాకు కోరికలు తీర్చుటకు చింతామణిని కీర్తి అనుపేరుగల లక్ష్మీదేవికి చెందిన శక్తిని నా కొరకు తెచ్చు గాక. దే॑వస॒ఖ అంటే దేవదేవుడైన శివునికి స్నేహితుడైన కుబేరుడు అని కూడా అర్థం చెప్తారు. కుబేరుడు దిక్పాలకుల లో ఒకడు. పైగా ఈశ్వరుడు ఇంద్రుడు కుబేరుడు మొదలైన వాళ్ళు ఐశ్వర్య ప్రదాత లయిన దేవతలు. యముడికి చిత్రగుప్తుడి లాగా కుబేరుడికి మణిభద్రుడు అని మంత్రి ఉన్నాడు. కుబేరుడి పనులన్నీ అతనే చేస్తుంటాడు. దేవుడు వరమిచ్చినా...  అన్నట్లుగా కాకుండా, మణి భద్రుడి తో సహా వచ్చి కుబేరుడు నాకు సంపదలను కీర్తిని ఇచ్చుగాక అనే ప్రార్ధన మణి నా సహా అన్న మాటలో ఉంది.


ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి పేరు డబ్బు సంపాదించుకుని జీవిస్తే మనిషికి సుఖం రాదు. ఆ వ్యక్తి యొక్క సొంత ఊర్లో పుట్టి పెరిగిన ప్రదేశం లో వీడి గొప్పతనం తెలిస్తేనే వాడికి తృప్తి సంతోషం వస్తాయి. ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ అంటే నేను పుట్టి పెరిగిన ప్రదేశం లో నాకు కీర్తి  కలగాలి అనేది ఇక్కడ కోరుకున్న కోరిక. 


*ఎనిమిదివ ఋక్కు* ::


*క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్షీం నా॑శయా॒మ్యహం ।*

*అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ స॒ర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహాత్ ॥*


ఈ ఋక్కులో ఏ పనికైనా పురుష ప్రయత్నము దైవసహాయము రెండూ ఉండాలి. ఏ ఒక్క దానినో నమ్ముకుంటే ఫలితం ఉండదు అనే విషయము సూచింప బడింది.  ఆకలి దప్పిక మురికి రూపంలో ఉన్న దరిద్రాన్ని నేను నాశనము చేయడానికి ప్రయత్నిస్తాను. లేమిని మా ఇంటి నుంచి పోగొట్టి సమృద్ధమైన సంపదలను నువ్వు నాకు ప్రసాదించాలి అనేది ఈ ఋక్కులో ఉన్న ప్రార్థన. 


*తొమ్మిదవ ఋక్కు* :: 


*గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీం᳚ ।*

*ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥*


శ్రియం, కరీ॒షిణీం, పదాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి. కానీ ఈ ఋక్కులో ప్రార్థన చేయబడే దేవత శ్రీదేవి కాదు. భూదేవి. భూదేవి నీళాదేవి లక్ష్మి దేవి వీళ్లలో తేడా లేదు అందరూ ఒకటే.  ఈశ్వరి అంటే ఐశ్వర్య ప్రదాయిని. భూదేవిని సంపదల కోసం నేను  ఆహ్వానిస్తున్నాను అనేది ఇందులో  భావము.


పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ప్రధానంగా చెప్పారు. ఆకాశానికి శబ్దము. వాయువుకు స్పర్శ. అగ్నికి రూపము. జలానికి రుచి. భూమికి గంధము. ఈ విషయాన్ని గంధద్వారాం అనే పదం సూచిస్తుంది. భూమి ని ఎవరు నాశనం చేయలేదు. భూమి మనకు ఆధారం కాబట్టి దాని సహాయంతోనే మనము జీవించగలము. దు॑రాధ॒ర్షాం॒ అనే పదానికి అది అర్థము. నిత్యపుష్టాం = ధాన్యాన్ని పంటలను వృక్ష సంబంధమైన అన్ని వస్తువులను మనకు ప్రసాదించేది.


*కరీ॒షిణీం*= ఆవు పేడ రూపము లో ఉన్నది. దీనికి ఓ చిన్న కథ ఉన్నది. గోవు అత్యంత పవిత్రమైన జంతువు. దాని శరీరం లో ఎక్కడైనా చోటు సంపాదిస్తే మనకు కూడా పవిత్రత గౌరవం లభిస్తాయని దేవతలందరూ నీ శరీరంలో మాకు చోటు కల్పించు అని గోవును ప్రార్థిస్తారు. గోవు అంగీకరిస్తుంది. లక్ష్మీదేవి ఆఖర్లో వెళుతుంది. అప్పటి గోవు శరీరంలో అన్ని ప్రదేశాలు మిగిలిన దేవతలు ఆక్రమించుకొని ఉంటారు. ఆవిడ బతిమాలు కోగా ఆవు పేడలో లక్ష్మి కి నివాస ఉండేటట్లు గోవు నిర్ణయిస్తుంది. అందువల్ల ఆవు పేడ లక్ష్మీప్రదము.


భూమికి సంబంధించిన వర్ణనకు ఆవు పేడ కు సంబంధం ఏమిటంటే, పంటలు వేసి పైరు కోసుకున్న తర్వాత భూమి కి మరలా పంటలను పండించే శక్తి రావాలంటే, ఎరువు వేయాలి. ఎరువు వల్ల భూమికి పంటలు పండించే శక్తి వస్తుంది. ఎరువు కూడా పృథ్వి తత్త్వమే. ఆవు పేడ ఎరువును సూచిస్తుంది. అందరికీ పుష్టి కలిగించే భూ దేవతకు పుష్టిని కలిగించేది ఆవు పేడ. 


 ఇది ప్రసిద్ధమైన శ్లోకము. పూజలలో గంధంతో అర్చన (ఉపచారము) చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తాము.



 ఇంకా ఉంది......


 *పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: