శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది
తూర్పు గోదావరి జిల్లా లో వున్న పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం.... పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు....
గోదావరీ నదికి ఇటువేపు ఉన్న "సఖినేటి పల్లి" మండలానికి చెందిన "అంతర్వేది" తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు
ఇక్కడి స్థలపురాణం: సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.
రక్తావలోచనుని కథ: హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.
త్రేతాయుగంలో... శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ఓం నమో వేంకటేశాయ
Share to your group
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి