12, జనవరి 2022, బుధవారం

అమ్మ గది🌷

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

           🌷అమ్మ గది🌷

                🌷🌷🌷

బంధుమిత్రులు, అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావిడి. మూడ్రోజుల కిందటే వాళ్ళీ కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు, అప్పుడు రాలేక, ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్ళతో ఆ కొత్తిల్లు కళకళలాడుతోంది. వామనరావు, ఆయన భార్య పరిమళ మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వచ్చిన వాళ్లందరికీ తమ ఇల్లు చూపిస్తూ వారిరువురూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 


"ఈ ప్లోరింగ్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సీల్డు కిచెన్. ఇది మాస్టర్ బెడ్ రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్ రూమ్, ఆ తరువాత గెస్ట్ రూమ్, అది పూజ గది, మూలగా ఉన్నది స్టోర్ రూమ్, పైన లెఫ్ట్ కార్నెర్లో జిమ్, రైట్ సైడ్ పెట్ కార్నివాల్, టాప్ లో పెంట్ హౌస్, ఇది సిటౌట్, లోపల కారిడార్, సైడ్ లో డ్రాయింగ్ రూమ్, ఇది చేపల ఎక్వైరియం ప్లేస్" ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారా భార్యా భర్తలు. 


వామనరావు చూపుల్లో విజయ దరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి. లిప్ట్, పనిమనిషికి ఔట్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్, విశాలమైన గార్డెనింగ్... వీటితో ఆ మూడంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఓ అద్బుత కళా ఖండంగా మెరిసిపోతోంది. 


వామనరావు ఆధాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం. గత పదిహేనేళ్ల నుంచీ అద్దిళ్ళల్లో ఉంటున్న వాళ్ళకీ యిల్లు కలల సౌధం.

వారం రోజులు గడిచాయి. హడావిడి సద్దుమణిగింది. 


"ఇక వెళ్ళొస్తాన్రా!" అంటూ తన చేతి సంచీ తీసుకుని బయలుదేరాడు వామనరావు మేనమామ, గంగయ్య. "ఇంకో రెండ్రోజులుండి వెళ్దువు గాని మామయ్యా!" అన్నాడు వామనరావు. "నేనిక్కడ ఉండి చేసే పనేముంది? ఇప్పటికే వారం రోజులయింది. నేనెళ్ళకపోతే అక్కడ చేనెండిపోతుంది" అన్నాడు మామయ్య. "మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్లడం కుదరదు, ససేమిరా!" అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. 


గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయానా అన్నయ్య. పేదవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం, మంచి మనస్సు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఉండే ఓ మోతుబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. 


వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడకొచ్చి చిన్నా, పెద్దా పనులు చక్కపెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించడం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు, దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం, వచ్చిన అతిథులకి ఏ లోటూ రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్య చిన్నప్పటి నుంచీ వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. 


అమ్మమ్మ ఇంటికెళ్లినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని పొలం తీసుకెళ్లి తియ్యటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ

తనకీ, చెల్లికీ మామయ్యంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం.


మధ్యాహ్నమైంది. భోజనం ముగిసింది. ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ, వెళ్తూ హాల్లో ఆగాడు, "బాబూ ఓ చిన్న మాట" వామనరావుని పిలిచాడు. "చెప్పు మామయ్యా!" అన్నాడు వామనరావు. "ఇల్లు చాలా బాగా కట్టేవు... అందరూ నీ యింటి గురించి చెప్పుకుంటుంటే... ఇది మా మేనల్లుడిల్లని చాలా పొంగిపోయాను... కాకపోతే..!?" అని ఆగి సందేహిస్తుండగా, "చెప్పు! మామయ్యా! ఫర్వాలేదు!" అన్నాడు వామనరావు. 


"అసలున్నాడో ? లేడో ? తెలియని దేవుడికి ఈ ఇంట్లో ఓ గదుంది. చిన్న పిల్లలకు, రాబోయే అతిథులకీ గదులున్నాయి. పనిమనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకీ, చేపల తొట్టికీ కూడా గదులున్నాయి... కానీ, నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఓ చిన్న గది కూడా కనిపించడం లేదయ్యా?" అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని వామనరావు మామయ్య మాటలకి షాకయ్యాడు. 


"లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకుని పడుకుంటోంది. మీ కోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనకాలో, దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటోంది. తనకంటూ స్థిరమైన గదిలేక అది 'గడీలాటలో మప్పీలా గడియకో చోటుకి మారుతోంది'. దాని అవస్థ చూస్తుంటే పూర్వమున్న తాటాకింట్లోనే  స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేది ఒక్క తల్లేరా ! నీ యంత చదువు, జ్ఞానం నాకు లేకపోయినా, వయసిచ్చిన అనుభవంతో చెబ్తున్నాను. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు", వామనరావు మస్తిష్కంలో ఆలోచనలు నింపి వెళ్ళిపోయాడు మామయ్య.


మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకుని, సోఫాలో చతికిల పడ్డాడు వామనరావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకుని, కిటికీలొంచి అమ్మకోసం చూశాడు. సందులోంచి ప్రహారీ అవతలున్న ఇరుగూ పొరుగుతో కొడుకు, కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తోంది. వామనరావుకి కన్నీళ్లాగలేదు. "ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకత్తేరా !", మామయ్య మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి, "మామయ్య చెప్పింది నిజమే కదా !". 


వామనరావుకు తన చిన్నతనం, అమ్మ తన కోసం జీవితమంతా పడిన కష్టం గుర్తుకొచ్చి కళ్ళవెంబడి నీళ్ళు బొటబొటా కారాయి. చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పై కప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు మైకా సంచి కప్పి, రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే తనను కూడా పంపించింది. తరువాత తెలిసిన నిజం... అందు కోసం తన పెళ్లినాటి జరీ పట్టు చీర అమ్మేసిందని. తన రక్తాన్ని మరిగించినా, కండలు కరిగించినా తమ కోసమే కదా... అనుకుంటూంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతమౌతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు.


వామనరావుకి ఆరేళ్ళు, చెల్లికి మూడేళ్ల వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికెళ్ళిన నాన్న మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబళించగా శవమై ఇంటికి వచ్చాడు. వేణమ్మ దుఃఖసాగరంలో మునిగిపోగా, ప్రపంచం తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తూండిపోయారు. 


ఆ హాఠాత్పరిణామం ఇంటిల్లిపాదినీ కృంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కొలుకోలేకపోతోంది. మొదట్నుంచీ భర్తా, పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు, సంపాదించడం రాదు. క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకుని, రోజు గడవడమే కష్టమైంది. ఇరుగూ పొరుగూ సాయం ఎంతకాలం ? కూర్చుని తింటుంటే కొండలాగుతాయా ? కరెంటు, పాలు కట్, బియ్యం డబ్బా ఖాళీ. అప్పు తీర్చక, కిరాణా కొట్టులో సామాను ఇవ్వక, రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి, పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి వాళ్ళు అనుకుంటుండగా విన్నాడు వామనరావు.


ఒకరోజు టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరున్న హోటల్ కి వెళ్ళిన పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్కమొహల్తో తిరిగి వచ్చినప్పుడు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చి, కార్యరంగంలోకి దిగి, వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ. కాలం కలిసి వచ్చి వేణమ్మకి డబ్బులు చేయి తిరగడంతో భర్త చేసిన పాత బాకీలన్నిటినీ తీర్చేయాలనుకొంది.


"నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడెవ్వరూ అడగట్లేదుగా? ఇక తీర్చడమెందుకు ?" అమ్మతో అన్నాడు వామనరావు. "రుణ శేషం, శత్రు శేషమన్నారు పెద్దలు. మనం బాకీలుండిపోతే వచ్చే జన్మల్లో తీర్చగలమో, లేమో" అంది అమ్మ. నాన్న చేసిన అప్పులన్నీ వడ్డేతో సహా తీర్చేసింది అమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు తామిద్దరూ కష్టపడి చదువుకుని ప్రయోజకులయ్యారు. 


వేణమ్మ మంచి పెంపకంలో పెరిగిన వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరికోరి మరీ వాళ్ళమ్మాయి పరిమళనిచ్చి వివాహం చేశాడు మామగారు. వామనరావు భార్యా పిల్లల్నేసుకుని చాలా ఊళ్లు తిరిగినా, వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు, తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్ధించినా... 


వామనరావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకుని, అక్కడే స్థిరపడాలని అనుకుంటే, ఇల్లు కట్టు కోవడానికి పరిమళ వాళ్ల నాన్నగారు కూడా ఆర్ధికంగా సాయపడ్డాడు. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగే సమయంలో మామయ్య తన బాధ్యతని గుర్తు చేయడంతో తన ఆలోచన్ని పరిమళ ముందుంచాడు. 


వెంటనే, ఓ గది ఖాళీ చేసి, అమ్మా, నాన్న తాలూకు ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించి, అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి, బేట్రీ లైటుతో సహా ఆ గదిలో సర్దేశారు.

 

పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చేరొక చేయి పట్టుకుని ఆమె గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన *అమ్మ గది* అని పెద్ద అక్షరాలతో రాసి వుంది. అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకూ వస్తువులను చూస్తూ పరవసించిపోయింది. కొంతసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. "ముసిలి దాన్ని... ఏ పడి మీద తల దాచుకున్నా రోజెళ్లిపోతుంది. ఇదంతా నాకెందుకురా బాబూ" అంది.


వామన రావుకి మామయ్య మాటలు మళ్ళా గుర్తోచ్చాయి, *లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒకత్తే !*. 


నాటినుంచీ వామనరావు అందరికీ చెప్తూనే వున్నాడు ఇంట్లో పూజగది కంటే ముందుగా ఉండాల్సింది *అమ్మ గది* అని...

కామెంట్‌లు లేవు: