🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.*
🌷🌷🌷
కొత్త అల్లుడు
*****
అల్లుడు తో ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్ చేశాకా ఒక్క క్షణం ఏమీ అర్థం కాక, నిశ్శబ్దంగా అక్కడున్న కుర్చీలో కూర్చుండి పోయారు ఆనందమూర్తి గారు నిశ్శబ్దంగా..
అంతలోకి అక్కడికే కూరలు, కత్తి పీట తెచ్చుకుని కింద కూర్చున్న విశాలాక్షి గారు అడిగారు ఆయన్ని..
ఏమన్నాడoడీ అల్లుడు...ఎప్పుడు వస్తారట అని..
'రారట.మనల్ని రమ్మంటున్నాడు' అల్లుడు..
అదేంటో..పెళ్లి అయ్యాకా వచ్చిన పెద్ద పండుగ ఈసంక్రాంతి..
మనింటికి వస్తే, ఉన్న ఊరు కాబట్టి ఏదో తంటాలు పడి అన్ని ముచ్చటలు తీరుద్దాం అనుకున్నా..
ఇక్కడైతే మన ఊరు, అందరూ తెలిసున్న వాళ్ళు..
మనకి అరువు దొరుకుతుంది అన్ని షాపుల్లో, బట్టలు కూడా వాళ్ళని తీసుకెళ్లి నచ్చినవి కొని పెట్టొచ్చు అనుకున్నా..
వాళ్ళ దగ్గరికి వెడితే అక్కడ ఆ సిటీ లో నేనెక్కడ కొనగలను..
పైగా పెద్ద అమ్మాయిని అల్లుడుని కూడా అక్కడికే రమ్మన్నాడట..
చాలా బతిమాలాను..
సంప్రదాయం బాబూ పండక్కి మా ఇంటికి రావడం అని. వినలేదు అతను..
పైగా పదకొండో తారీఖు కి మనిద్దరికీ రైలు టికెట్ లు కొన్నాడట..
బయలు దేరి వచ్చేయండి అంటాడు..
ఈ ప్రయాణ చార్జీలు అతనికి ఇవ్వాలి కదా..
ఏంటో ఎలాగో అని నిట్టూర్చారాయన..
ఆనందమూర్తి గారికి ఇద్దరు ఆడపిల్లలు..
పెద్దమ్మాయికి ఆయన సర్వీస్ లో ఉండగానే పెళ్లి చేశారు..
పెద్దమ్మాయి డిగ్రీ చదివించారు..
మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసేసారు..
రెండో అమ్మాయికి రిటైర్ అయ్యాకా వచ్చిన డబ్బుతో పెళ్లి చేశారు ..
రెండో అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది..
క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం కూడా వచ్చింది.
చేస్తూ ఉండగానే వాళ్ళ ఆఫీస్ లో పని చేసే అతనే
అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని
ఇంటికొచ్చి ఆయన్నే పద్ధతిగా అడగడం తో
నచ్చి, ఉన్నంతలో బాగానే పెళ్లి చేశారు..
పెళ్లి అయ్యాకా ఈ సంక్రాంతి మొదటి పండగ..
పిలిస్తే, మీరే రండి మా ఇంటికి అని మొండికేసాడు కొత్త అల్లుడు..అదీ సమస్య..
ఆయనకొచ్చే పెన్షన్ వాళ్ళకి ఆధారం..ఇల్లు గడవాలి, వాళ్ళ మందుల ఖర్చు..పెళ్ళైన ఆడపిల్లలకి పెట్టుపోతలు అన్నీ అందులోనే..
అయ్యో, మరి ఏం చేద్దాం అంది ఆవిడ...
ఇంకోసారి చెప్పి చూస్తాను..కాదంటే వెళ్లడమే..
నా దగ్గర అయిదు వేలున్నాయి, ఇంకో ఐదో పదో అప్పు చేయాలి..అన్నారాయన...
ఆయన అనుకున్నట్టే వాళ్ళకి వెళ్ళక తప్పలేదు
కూతురింటికి..
రైలు దిగగానే అల్లుడు స్టేషనికి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు..
అయ్యో..మీరెందుకొచ్చారండీ, మేమే వచ్చేవాళ్ళం కదా అన్నా,
అల్లుడు నవ్వుతూ ఆయన చేతిలో బాగ్ తీసుకుని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు..
ఇంటికెళ్లగానే కూతురు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్లింది...
కాఫీలు తాగాక, విశాలాక్షి గారు లేచి నేను స్నానం చేసి టిఫిన్ చేస్తాను అన్నారు...
వెంటనే అల్లుడు అన్నాడు..మీరు ఫ్రెష్ అవ్వండి అత్తయ్య గారూ కానీ టిఫిన్ మీరు చేయక్కరలేదు ఇంకో పది నిమిషాల్లో వంట మనిషి వస్తుంది...
ఆవిడే అన్నీ చేస్తుంది...
మీరున్న నాలుగు రోజులూ మాట్లాడాను..
మీరు మీ కూతురితో కబుర్లు చెప్పండి చాలు అన్నాడు అల్లుడు..
వెంటనే ఆవిడ ఆశ్చర్యంగా కూతురి వైపు చూస్తే, కూతురు ఆనందంగా 'అవునంటూ' తలూపింది...
వెంటనే ఆనందమూర్తి గారన్నారు.."అదేంటి అల్లుడూ..మీ అత్తయ్య చేస్తుంది కదా.. ఎందుకు అనవసర ఖర్చు అని'.
అత్తయ్యగారు చేయలేరు అని కాదు...
ఆవిడ వంట అద్భుతమనీ తెలుసు..
ఆవిడ అలా వంటింట్లో మగ్గిపోతూ మనందరికీ అన్నీ వండి వడ్డిస్తుంటే, మనం మాత్రం హాయిగా కూర్చుని తింటూ ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పండి..
మనం ఈ పండగకి అందరం కలిసి సరదాగా గడపాలని మా ఉద్దేశ్యం అంతే అన్నాడు..
ఈ లోపు వంటమనిషి వచ్జి పెసరపప్పు రుబ్బి పెసరట్లేసి, ఉప్మా తో అందరికీ వడ్డించింది...
భోజనాల టైం కి పెద్ద అల్లుడు కూతురు పిల్లలతో దిగారు...
ఇల్లంతా సందడి..సందడి...
ఈలోపు ఆనందమూర్తి గారు అల్లుళ్ళ చేతిలో చెరో ఐదువేలు పెట్టి, ఈరోజు వెళ్లి బట్టలు కొనుక్కోండి బాబూ అన్నారు..
వెంటనే, మీ దగ్గరుంచండి మామయ్యా..రేపు తీసుకుంటాం కదా అని వెనక్కి ఇచ్చేసారు ఇద్దరూ..
మర్నాడు భోగి..అంతా పొద్దున్నే లేచి స్నానాలు అవీ చేశాక, చిన్న అల్లుడు కూతురు అందరినీ కూర్చోపెట్టి అందరికీ బట్టలు పెట్టి కాళ్ళకి దణ్ణం పెట్టారు...
ఆనంద మూర్తి గారు విశాలాక్షి లబ లబ లాడారు...
అయ్యో ఇదేంటి బాబూ, మొదటి పండుగ..మీ అందరికీ మేము బట్టలు పెట్టాలి..
మీకు డబ్బులిచ్చి మిమ్మల్ని అందరినీ కొనుక్కోమని మేము చెప్తే మీరు మాకు బట్టలు పెట్టడం ఏంటి అని..
అత్తయ్య గారూ, మామయ్యగారూ...
ఈ సారి పద్ధతి మేము మారుద్దాం అనుకున్నాం..
మీకు బట్టలు పెట్టి మీ ఆశీర్వాదాలు తీసుకుందామని మా స్వార్ధం...
మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు నాకు తెలుసు మామయ్యా...
ఎందుకంటే నాకూ ఇద్దరు అక్కలు...
మా అమ్మా నాన్నగారూ వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఎన్ని అవస్థలు పడేవారో అన్ని విధాలా...
ఆడపిల్లల తల్లితండ్రుల బాధ్యత వాళ్ళకి పెళ్లిచేయడంతో తీరిపోదు..
వాళ్ళకి పురుళ్ళనీ పుణ్యాలనీ, బారసాలలనీ
పండగలనీ, పబ్బాలనీ...అన్నీ చేస్తూనే ఉండాలి..
వాటికి అంతముండదు..
ఎంతకాలం ఇలా అల్లుళ్ళకి అగ్గగ్గలాడుతూ, మర్యాదలు చేయడం...
ఎప్పటి ఆచారాలో అలా పాటిస్తూనే ఉండాలా..
అప్పులు చేసి, వడ్డీలు కట్టుకుంటూ..
మేమూ బాగానే సంపాదించుకుంటున్నాం...
నేను అలా ఉండకూడదు అని, నేను మా అత్తామామలకి భారం కాకూడదు అని, నాకు పెళ్లికానప్పుడే నిర్ణయించుకున్నాను..
"జామాతా దశమగ్రహ" అనే నానుడిని కనీసం నా విషయంలో పూర్తిగా తుడిచేయాలి అనేదే నా ధ్యేయం...
ఇలా ఆచరణలో పెట్టాను అంతే..
పండగ అనేది నలుగురూ కలిసి సంతోషంగా జరుపుకోవాలి..అంతేగానీ మీ లాంటి తల్లిదండ్రులని శారీరకంగా, ఆర్ధికంగా కష్ట పెట్టి కాదు.
మీ ఊరిలో జరిగే సంబరాలు, ముచ్చట్లు ఇక్కడ ఉండక పోవచ్చు..
కానీ మనం అందరూ ఇలా సంతోషంగా ఉంటే అదే సంబరం కాదా..
మా అమ్మా నాన్నగారు తీర్ధ యాత్రలకి వెళ్లారు..
వాళ్ళు లేని లోటు మీరు ఈ పండక్కి మా ఇంట్లో ఉండి తీర్చారు..
అనగానే పెద్ద వాళ్ళిద్దరి కళ్లు ఆనందంతో నీళ్ళ తో నిండిపోయాయి...
వెంటనే పెద్దల్లుడు ప్రశాంత్ అన్నాడు..మరి మాకెందుకు ఈ బట్టలు వంశీ అని..?
మిమ్మల్ని మేము పండగకి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం..
స్నేహ భావంతో ఇచ్చినవి ఇవి..కాదని అనొద్దు
అన్నాడు వంశీ.
.
"అవును మామయ్యా తమ్ముడు వంశీ చెప్పింది నిజం..
నేను ఆచరించలేకపోయాను...
అయినా పరవాలేదు..
తరువాత పండగకి మా ఇంట్లో కలుసుకుందాం"
నేను ఇంతకింత మర్యాదలు చేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు నవ్వుతూ..
అతను అన్న విధానానికి అందరూ హాయిగా నవ్వారు..
కనుమ రోజు మాత్రం విశాలాక్షి గారు ఊరుకోలేదు..ఈ రోజు గారెలు, ఆవడలు నేనే చేసి పెడతానని పట్టు బట్టి చేశారు..
వాళ్ళకీ కూతుళ్లు అల్లుళ్లు మనవలతో ఇంత
ఆహ్లాదంగా గడపడం ఎంతో సంతోషంగా అనిపించింది...
విశాలాక్షి గారి జీవితంలో వీసమెత్తు పని చేయకుండా ఖాళీగా కూర్చుని, ఎవరో రుచిగా వండి పెడితే తినడం ఇదే మొదటిసారి...
కోడలిగా, భార్యగా, తల్లిగా, అత్తగారిగా ఆవిడ ఇన్నేళ్లు
చాకిరీ చేసి చేసి అలసిపోయి ఉన్నారు..
ఇంత విశ్రాంతి ఆవిడ ఏనాడూ తీసుకోలేదు..
అసలు ఆవిడకి ఎంతో ఆశ్చర్యంగా ఉంది...
ఇలా కూడా ఉంటారా అల్లుళ్లు అని..
మర్నాడు పెద్దల్లుడు వాళ్ళు వెళ్లిపోయారు..
తరువాత రోజు రాత్రి విశాలాక్షి గారూ ఆనందమూర్తి గారూ బయలుదేరారు...
ఆనందమూర్తి గారు ప్రయాణ చార్జీలు ఇవ్వబోయినా అల్లుడు తీసుకోలేదు...
అల్లుడిని ఆలింగనం చేసుకుని, "బాబూ నీ ఆప్యాయత, సంస్కారానికి మాకు చాలా సంతోషం గా ఉంది...
ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం గా కూడా ఉంది..
నిన్ను భర్తగా పొందడం మా అమ్మాయి అదృష్టమే
కాదు..
నిన్ను అల్లుడుగా పొందడం మా అదృష్టం కూడా..
మాకూ కొడుకున్నాడు అని అనిపిస్తోంది బాబూ నిన్ను చూస్తే" అన్నారు..ఆనందమూర్తి గారు..
అనిపించడమేంటి మామయ్యా...నేను మీ కొడుకునే అన్నాడు వంశీ ఆప్యాయంగా...
*****
*ఉమాబాల చుండూరు*
రసజ్ఞభారతి సౌజన్యంతో-
🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి