4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

గృహవైద్య రహస్యాలు -

 గృహవైద్య రహస్యాలు  - 


    ప్రియమితృలకు నమస్కారం , 


      ఇంటిలో మరియు ఇంటి చుట్టుపక్కల్లో ఉండే కొన్ని పదార్థాలు మరియు కొన్ని మూలికలతో అద్భుతంగా ఆరోగ్యసమస్యలని పరిష్కరించవచ్చు. వీటిగురించి ప్రతిఒక్కరు తెలుసుకొనవలెను అను సదుద్దేశంతో చాలా కష్టపడి అనేక గ్రంథాలు తిరగవేసి మరియు కొన్ని నేను ప్రయోగించిన మూలికల యొక్క సమాచారాన్ని మీకు వివరిస్తున్నాను. 


         ఈ పోస్టులో వివరించిన మూలికల సమాచారాన్ని జాగ్రత్తపరుచుకొని ఉంచుకోగలరు.


 * పిడకల బూడిద  - 


     చేతులు గాని , కాళ్లు గాని వాచినచో ఆ వాపు పైన పిడకల బూడిద మర్దన చేసినచో వాపులు తగ్గిపోవును . ఆవుపిడకల బూడిద చాలా శ్రేష్టం .


 * కట్టెలు కాల్చిన బొగ్గు  - 


     ప్రతినిత్యము బొగ్గు చూర్ణముతో పళ్లు తోముకొనుచుండిన యెడల పళ్లనొప్పులు , చిగుళ్ల వాపులు , చీముకారుట , దంతములు కదులుట మొదలైన దంతవ్యాధులు హరించి పళ్లు తెల్లగా ప్రకాశించును.


 * నిప్పు  - 


     వాతము వలన గాని , శ్లేష్మము వలన గాని తల లేక కడుపు మొదలయిన అవయవములు యందు నొప్పి వచ్చిన యెడల ఔషధ ప్రయోగముల కంటే ముందు నిప్పుసెగ చూపించి కాచినయెడల నొప్పులు వెంటనే శాంతించును.


 * ఇసుక - 


     శరీరములో యే భాగం అయినా వాచిన గాని , నొప్పిగా గాని ఉన్న యెడల ఇసుకని వేయించి గుడ్డలో మూటకట్టి ఆ ఇసుక మూటతో కాపడం పెట్టిన యెడల నొప్పులు వెంటనే శాంతించును. 


 * రాళ్లు  -


     కొత్తగా లేచిన సెగ గడ్డలు అణుగుట కొరకు రాళ్ళని వెచ్చచేసి కాపడం పెట్టవలెను . 


 * కాలిన పొగాకు మసి - 


     చుట్ట కాల్చిన తరువాత మిగిలిన మసితో ప్రతినిత్యం పళ్లు తోముకున్నచున్న యెడల దంతములు నందు క్రిములు హరించి పళ్లు ముత్యముల వలే తెల్లగా ప్రకాశించుచుండును . 


 * మన్ను - 


      తల, చేతులు కడుపు మంటలకు , గోరుచుట్టులకు నీటిలో నుంచి తీసిన ఒండ్రుమట్టి పట్టించిన యెడల మంటలు వెంటనే తగ్గిపోవును . 


 * వండుకొనే పొయ్యిలోని మట్టి - 


      కలరా మొదలయిన విషవ్యాదులు వలన శరీరం అతిగా చెమట బట్టి వళ్ళు చల్లబడుతున్న సమయంలో వండుకునే పొయ్యిలోని మట్టి తీసుకొచ్చి శరీరం పైన మర్దించవలెను . మరియు అదే మట్టిని రెండు చిటికెలు తీసుకుని నీటిలో కలిపి త్రాగించవలెను . 


 * ఆవుపేడ  - 


     నాటు ఆవుపేడ తాజాది తీసుకుని ఒక గుడ్డలో వేసి పిండి ఆ రసముని కండ్లలో వేయుచుండిన పదిరోజుల్లో రెజీకటి మానును 


 *  గోమూత్రము  - 


      నాటు ఆవు యొక్క గోమూత్రము ఉబ్బు వ్యాధి గలవారికి ప్రతినిత్యం 15ml త్రాగించుచూ అదే గోమూత్రంతో శరీరం మర్దన చేయుచుండవలెను . ఈ విధంగా 40 దినములు చేయుచున్నచో శరీరం ఆరోగ్యవంతంగా ఉండును. 


 * పాతపత్తి  - 


     నోటి నుంచి ఎక్కువుగా శ్లేష్మం పడుచూ రొమ్ము నొప్పిగా ఉన్నయెడల పాతదూది వెచ్చచేసి రొమ్ముపైన కట్టిన యెడల రొమ్ము నొప్పి కఫ వ్యాధి తగ్గిపోవును . 


 * గుర్రపు లద్దె  - 


     గుర్రపు లద్దె ఎండించి చూర్ణం కావించి ఆ చూర్ణంని ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీ యొక్క యోనికి ధూపంవేసిన యెడల వెంటనే సుఖంగా ప్రసవించును. 


 * తలవెంట్రుకలు - 


     తలవెంట్రుకలను కాల్చి భస్మం చేసి పన్నీరులో కలిపి ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీకి తలపైన మర్దన చేసిన యెడల ఆ స్త్రీ సుఖముగా ప్రసవించును. ఇంటి యందు ఉన్న ఎలుక కన్నముల యందు తలవెంట్రుకలు ను ఉంచిన ఆ కన్నముల గుండా ఇంట్లోకి పాములు రావు . 


 * నల్ల సిరా - 


      నిప్పుల వలన కాలిన స్థలము పైన నల్ల సిరా రాసినచో బొబ్బలు ఎక్కకుండా మంటలు తగ్గిపోవును . 


 *  ఇనుపముక్క  - 


     ఏ ఉపాయం చేత కూడా అతిదాహం అనగా విపరీతంగా నీరు తాగటం తగ్గనప్పుడు ఎర్రగా కాల్చిన ఇనుపముక్కని మంచినీటిలో మంచి ఆ నీటిని వడకట్టి త్రాగించిన యెడల బాధలేకుండా పండ్లు తొందరగా వచ్చును. 


 * రాగి - 


     సన్నటి రాగికడ్డిని కంటెము వలే చేసి చిన్నపిల్లల మెడలో వేసిన యెడల బాధ లేకుండా పండ్లు తొందరంగా వచ్చును.


 * గవ్వలు - 


    గవ్వలను బాగా కాల్చి నూరి వస్త్రగాలితం చేసి ఆ మెత్తటి చూర్ణంని చీము కారుచున్న చెవిలో కొంచం కొంచం రోజుకి నాలుగైదుసార్లు వేయుచుండిన యెడల మూడురోజుల్లో చీముకారుట తగ్గును .


  * ఆముదం - 


     చంటిపిల్లలకు విరేచనం కాక కడుపులో నొప్పి కలిగిన యెడల కడుపు పైన ఆముదం రాసి కాపడం పెట్టిన యెడల వెంటనే బాధ తగ్గి విరేచనం అగును.


        శిరస్సు పైన ఆముదం ని మర్దన చేసుకొన్న యెడల రెండుమూడు వారములలో రేచీకటి వ్యాధి తగ్గును. 


 * తాటాకు విసినికర్ర - 


      నీళ్లు చల్లిన విసినకర్ర తో విసిరిన యెడల మూర్చ వచ్చినవారు త్వరగా లేచి కూర్చుండెదరు . వడదెబ్బ తగిలినవారికి , వేసవితాపం భరించలేనివారికి , నీళ్లు చల్లిన తాటాకు విసినకర్రతో విసురుచుండిన యెడల సుఖకరంగా ఉండును.


 * దర్భలు - 


      దర్భలని నీళ్లతో నూరి వడకట్టి రసమును త్రాగించుచున్న యెడల వాంతులు తగ్గిపోవును .


 * బంగారము -


      నీళ్లతో నిండిన ఒక మట్టికుండ యందు ఏదైనా ఒక బంగారు వస్తువు వేసి రెండు గంటలు నిలువ యుంచి ఆ ఉదకము చేత స్నానము చేయుచున్న యెడల పిల్లలకు మరియు పెద్దలకు వచ్చు ఎండు జబ్బు అనగా బక్కగా అవుతూ కండరాలు క్షీణించే వ్యాధి నివారణ అగును. అదేవిధంగా ఆ నీటిని ప్రతిరోజు కొంచంకొంచం తాగుచుండవలెను.


 * గంగసింధురం -


       గాయములపైన  గంగసింధూరం అద్దిన యెడల రక్తము కారుట మాని గాయములు తొందరగా మానును .


 * మంచి గంధం - 


       సానపైన అరగదీసి మంచిగంధం శిరస్సు పైన పట్టువేసిన యెడల వేడివలన వచ్చు తలనొప్పి వెంటనే తగ్గిపోవును . 


 * దేవదారు చెక్క - 


       15 గ్రాముల దేవదారు చెక్క చూర్ణమును అర్ధసేరు నీళ్లలో వేసి కాచి అర్ధపావు మిగులునట్టు దించి చల్లారిన తరువాత అందు ఒక తులము తేనే కలిపి త్రాగుచుండిన స్త్రీల కుసుమ వ్యాదులు , శుక్లనష్టం , సూతికా జ్వరం హరించును .


 * తేనెమైనం  - 


      50 గ్రాముల తేనెమైనం కరిగించి అందు జేబురుమాలు తడిపి ఉంచవలెను అవసరం అయినపుడు ఆ రుమాలును కొంచం వెచ్చచేసి వాచిన అండకోశములు పైన వేసి కట్టిన బాధ తగ్గును. ఇట్లు కొన్ని దినములు కట్టుచున్న యెడల వరిబీజం నిర్మూలన అగును.


 * తులసి  - 


       జలుబు చేసిన వారికి రోజుకి ముప్పయి నుంచి నలభై తులసి దళములను తినిపించుచున్న యెడల మూడు రోజుల్లో పడిసం తగ్గును. జ్వరం రానియ్యదు. ఏడు మిరియపు గింజలను ,ఏడు తులసి దళములను కలిపి నమిలి మింగుచున్న యెడల మలేరియా జ్వరము మూడు రోజుల్లో తగ్గును.


       కృష్ణ తులసి లేక నల్లతులసి చెట్టు యెక్క వేరు ముక్కను తాంబూలము నందు ఉంచి భక్షించిన యెడల సంభోగం నందు ఆనందం కలుగును.


      తులసిచెట్టు యొక్క వేరు అరగదీసి ఆ గంధం తేలు కరిచినచోట అంటించిన యెడల విషము దిగిపోవును .


 * రుద్రాక్ష  - 


   రుద్రాక్షని పాలతో సాన పైన అరగదీసి గంధముని అరగదీసి ఆ గంధముని గర్భిణి స్త్రీ చేత తాగించు చున్న యెడల గర్భస్రావం జరగకుండా కాపాడును. 


* కుంకుడుపప్పు -


    కుంకుడుగింజలోని పప్పును నీళ్లతో నూరి త్రాగించున్న యెడల నీళ్ల విరేచనములు , కలరా విరేచనములు తగ్గును. తమలపాకులో కుంకుడుపప్పు పెట్టి మూడుపూటలా తినిపించిన సర్ఫవిషం హరించును .


 * సున్నము -


     సున్నపు తేట నీరుని 5ml నుంచి 10ml వరకు మోతాదు చొప్పున చిన్నపిల్లలకు ఇచ్చుచుండిన యెడల ఆకుపచ్చరంగు విరేచనాలు , కడుపులో బల్లలు హరించును 


       5 లీటర్ల నీటి యందు ఒక పావు కిలో సున్నముని కలపవలెను రాతి సున్నము మాత్రమే వాడవలెను. 5 గంటల తరువాత పైన తేరుకున్న నీరును, కిందకు దిగిన సున్నము ఏ మాత్రం రాకుండా వంచుకొని సీసాలో భద్రపరచుకొనవలెను. ఇదియే సున్నపు తేట తీయుక్రమము . 


 * కాచు -


   కాచు చిన్న ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మ్రింగుచుండిన యెడల మూడురోజుల్లో నోటిపూత తగ్గిపోవును . ప్రతిరోజు రెండున్నర గ్రాములు కాచు చూర్ణముని తినుచుండిన యెడల కొద్దిరోజుల్లొనే రక్తం శుద్ది అగును.


 * తమలపాకులు - 


    మానని మొండి వ్రణముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల త్వరగా పుళ్లు మానిపోవును. స్త్రీల స్థనముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల పాలు తగ్గిపోవును .


 * పోకచెక్కలు  - 


    పోకచెక్కలు కాల్చిన భస్మముని తామర పైన అంటించుచుండిన యెడల కొద్దిరోజుల్లో తామర వ్యాధి సమూలంగా పోవును .


 * తేనే  - 


     కాలినచోట తేనే రాసిన యెడల బొబ్బలు లేవకుండా బాధ తగ్గి త్వరగా మానును . కాలిన పుండు మానిన తరువాత మచ్చ గల ప్రదేశములో తేనెలో దూది వేసి తడిపి ఆ పత్తిని వేసి కట్టి దానిపైన మరలా దూది వేసి కట్టుచుండిన యెడల కొన్ని రోజుల్లోనే మచ్చపోయి శరీరం రంగులో కలిసిపోవును.


 *  నెయ్యి - 


      తెగుట వలన కాని , దెబ్బ వలన కాని వాతము వలన ఎదైనా అవయవం బలహీనం అయ్యి ఎండిపోవుచున్న యెడల నెయ్యితో ఆ అవయమును మర్దించుచున్న యెడల ఆ అవయవం బాగుపడును .


    40 గ్రాముల ఆవునెయ్యి లో 30 మిరియపు గింజల చూర్ణముని వేసుకొని కలిపి తినుచుండిన యెడల మెదడు కు బలం కలిగి కండ్లు యెక్క దృష్టి ఎక్కువ అగును.


 గమనిక  -


     నాటు ఆవు యెక్క స్వచ్ఛమైన నెయ్యి వాడినప్పుడు మాత్రమే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి.


 * వెన్న  - 


     ప్రతిరోజు ఉదయన్నే ముఖం కడుగుకున్న వెంటనే 40 గ్రాముల వెన్నని తినుచుండిన యెడల తలతిప్పుట , మలబద్దకం , గొంతు ఎండిపోవుట, ముక్కు వెంట రక్తం పడుట , మెదడు యెక్క బలహీనత పోవును . శిరస్సుకు కూడా కొంచం వెన్నని మర్దన చేయవలెను .


 * ఆవుపాలు  -


     ఆవుపాలని రాత్రిపూట ముఖమునకు మర్దన చేసుకొనుచూ ఉండిన యెడల ముఖం కాంతివంతముగా ప్రకాశించును. ప్రతిరోజు రాత్రి నిద్ర పొయే ముందు అరకప్పు ఆవుపాలు ని సేవించుచుండిన మంచి నిద్ర పట్టును . 


 *  ఆవుపెరుగు  - 


       ఆవుపెరుగు ని వంటికి మర్దించుకొని స్నానం చేయుచుండిన యెడల వళ్ళు దురదలు , చర్మం ఎండిపోవుట మొదలయిన చర్మ సమస్యలు హరించి చర్మం నిగనిగలాడును.


      ఆవుపెరుగు పైన ఉండు మీగడని గోరుచుట్టు పైన వేసి కట్టుకట్టుచుండిన యెడల బాధ తగ్గి గోరుచుట్టు పగిలి మానిపోవును . 


   చిన్నపిల్లలకు తిన్నది తిన్నట్టు విరేచనాలు అవుతున్న సమయంలో రోజుకి రెండుసార్లు మజ్జిగ తాగించుచుండిన యెడల జఠరకోశం బాగుపడి వ్యాధి తగ్గిపోవును .


    పెద్దవారికి నీళ్ల విరేచనములు అవుచుండిన యెడల మరియు కడుపునొప్పితో బాధపడుచున్న సమయంలో మజ్జిగలో సైన్ధవ లవణం కలిపి తాగించవలెను .


 * బెల్లం -


     అన్నం అతిగా తినుటవలన అయ్యే దాహంనకు బెల్లం పానకం చేసి ఇచ్చిన యెడల తగ్గిపోవును . ప్రసవించిన స్త్రీలకు మరియు ప్రసవించిన ఆవులకు బెల్లం ముక్కలు ప్రతిదినం పెట్టుట వలన తొందరగా శరీరపుష్టి చేకూరును.


 * నువ్వుల నూనె  - 


     అరికాళ్లకు , అరచేతులకు నువ్వులనూనె రాసుకొనుచుండిన యెడల కాళ్లు , చేతులు మంటలు తగ్గి నిద్రపట్టును. దంతధావనం అనంతరం నువ్వులనూనె ని పండ్లకు చిగుళ్లకు పట్టించుచుండిన యెడల పండ్ల నుంచి చీము కారుట , పండ్ల యందలి క్రిములు హరించి దంతములు గట్టిపడి అందముగా ఉండును.


 *  కొబ్బరినూనె  - 


      వళ్ళంతా విపరీతముగా దురదలు పెట్టుచున్న ప్రతినిత్యము కొబ్బరినూనెని ఒంటికి పట్టించుకొని స్నానం చేయుచున్న యెడల దురదలు తగ్గును. మరియు ఒళ్ళు మంటలు కూడా తగ్గును. 


 *  అన్నం -


      కళ్లు ఎర్రబడి , నొప్పిగా ఉన్నయెడల వేడిఅన్నము గుడ్డలో ఉంచి మూట కట్టి ఆ మూటతో పైన కాపడం పెట్టుచున్న యెడల మూడుపూటలలో తగ్గిపోవును . 


 *  బఠాణీలు - 


       బఠాణీలు పిండితో ముఖమునకు నలుగు పెట్టుకొనుచుండిన యెడల ముఖం మీద మంగు , శోభి మచ్చలు హరించిపోవును .


 *  నువ్వులు -


      నువ్వులను నీళ్లతో నూరి పుండ్లు పైన వేసి కట్టు కట్టుచుండిన యెడల పుండ్లు పరిశుభ్రపడి త్వరగా మానిపోవును .


 * శనగలు - 


     50 గ్రాముల శనగలు సాయంత్ర సమయంలో నీళ్లలో నానవేసి ఉదయం వడకట్టిన నీళ్లలో కొంచం పంచదార కలిపి పిచ్చి వ్యాధి గలవారి కి తాగించుచున్న యెడల 40 రోజుల్లో ఉన్మాద వ్యాధి హరించును . ఉన్మాదవ్యాధి అనగా పిచ్చి పట్టడం .


 *  ఉలవలు  - 


       ప్రసవానంతరం మైల రక్తం జారీ అగుటకు గర్భాశయం లోని పోటు తగ్గుటకు ఉలవలు కషాయం తాగించవలెను. 


      ప్రతినిత్యం ఉలవలు ఉడకబెట్టి ఆ నీరు తాగి గుగ్గిళ్ళు గా చేసుకుని తినుచుండిన శరీరంలో కొవ్వు కరుగును. 


 * జీలకర్ర  - 


      ఒక గుప్పెడు జీలకర్ర ని ప్రతినిత్యము నమిలి రసము మింగుచుండిన యెడల స్త్రీల యెక్క తెల్లబట్ట, ఎర్రబట్ట, బహిష్టు వ్యాదులు యోనిలో నొప్పి , యోనిలో దురద కొన్ని రోజుల్లొ హరించిపోవును . 


     జీలకర్ర ఒక స్పూన్ + వాము ఒక స్పూన్ కలిపి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుతూ చివరికి ఆ పిప్పిని మింగివేసి నీరు తాగవలెను . ఉదయం మరియు సాయంత్రం చేయవలెను . దీనివలన యోనిసమస్యలు తీరును . ఈ సిద్ద యోగాన్ని నేను చాలమంది పెషెంట్స్ కి చెప్పాను . చాలా తక్కువ సమయంలో అద్బుత ఫలితాలు వచ్చాయి. 


 * పసుపు - 


      రెండున్నర గ్రాముల పసుపును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు తేనెతో కలిపి తినుచుండిన యెడల కొన్ని రోజులలోనే మేహవ్యాథులు, రక్తదోషాలు నివారణ అగును. ఉప్పు ఎక్కువుగా తినటం వలన నోరు ఎండిపోయి అతిదాహాం వలన కలిగిన యెడల పసుపు కలిపిన నీళ్లను తాగించవలెను .


 * అల్లం  - 


      వాతవ్యాధుల వలన , మూర్చ వ్యాధుల వలన , సృహతప్పి పడిపోయి నోరు బిగదీసుకొని పోయిన యెడల 6 చుక్కలు అల్లం రసముని ముక్కు రంధ్రములలో వేసి తెలివి వచ్చి నోరు తెరుచుకొనును .అప్పుడు తులమున్నర గొరువెచ్చని అల్లపురసముని లొపలికి తాగించిన యెడల రోగి చక్కగా మాట్లాడును.


 * పెద్ద యాలక్కాయలు  - 


     రెండున్నర గ్రాములు యాలుక్కాయల గింజల చూర్ణమును వెన్నతో తినుచుండిన యెడల కడుపులో నొప్పి , మాటిమాటికి విరేచనం అగుట , జిగట విరేచనములు తగ్గిపోవును .


 * మెంతులు - 


      నిప్పు వలన కాలినచోట మెంతులు నూరి ముద్ద వలే చేసి ఆ ముద్దని కాలినచోట వేసి కట్టిన యెడల బాధ శాంతించి బొబ్బలెక్కకుండా మానిపోవును . 


 * ఆకుపత్రి ( బిర్యాని ఆకు ) - 


      ఆకుపత్రిని నీళ్లతో నూరి ఆ పేస్ట్ ని తలకి పట్టువేసిన అన్నిరకాల తలనొప్పులు హరించును . 


 * ధనియాలు -


      ధనియాల కషాయం ప్రతినిత్యం సేవించుచున్న ముక్కువెంట , నోటివెంట , మూత్రద్వారం నుంచి మరియు మలద్వారం నుంచి పడు రక్తం కట్టును . అతిగా దాహం అయ్యే వ్యాధి తగ్గును.


 *  ఇంగువ - 


      గోరువెచ్చని నీటితో బఠాణి గింజ అంత ఇంగువ మింగిన యెడల కడుపునొప్పి,నీళ్ళవిరేచనములు, ఎక్కిళ్లు , వాంతులు తగ్గిపోవును .


 * వాము  - 


     వాముని ఆవనూనెలో వేసి తైలమును తీసి శరీరముకి పట్టించి మర్దన చేసిన యెడల వళ్లునొప్పులు , దురదలు, వళ్ళు చల్లబడుట తగ్గి ఆరోగ్యముగా ఉండును.


 * సోంపు - 


     పది గ్రాములు పచ్చి సోంపు గింజలు , పది గ్రాములు వేయించిన సోంపు గింజలు ఈ రెండింటిని కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం మంచినీటితో కలిపి తాగవలెను. ఈ విధముగా సేవించుట వలన జిగట, రక్త విరేచనాలు కడుపుబ్బరం హరించిపోయి ఆరోగ్యముగా ఉండును. 


 * జాపత్రి  - 


     వేయించిన జాపత్రి చూర్ణము రెండున్నర గ్రాముల మోతాదుగా గొరువెచ్చటి నీటితో కలిపి గంటగంటకు లొపలికి ఇచ్చుచున్న కలరా వ్యాది హరించును .


 * లవంగములు  - 


     లవంగాల చూర్ణమును పిప్పిపన్ను పైన ఉంచిన యెడల పురుగులు పడిపోయి భాధ తగ్గును. నాలుగు లవంగాలు వేయించి మరియు నాలుగు పచ్చి లవంగాలు కలిపి నములుచూ రసం మింగుతున్న తీవ్రమైన దగ్గు , కంఠము నందు అడ్డుపడుచున్న శ్లేష్మము హరించిపోవును .


 * దాల్చిన చెక్క - 


     దాల్చిన చెక్క చూర్ణముని 5 గ్రాములు మంచినీటితొ కలుపుకుని తాగుచున్న యెడల జిగట విరేచనాలు , ప్రేగులయందలి క్రిములు , కడుపునొప్పులు హరించును . 


 గమనిక - 


    ఈ యోగాన్ని రాత్రిపూట మాత్రమే ఆచరించవలెను .


 * చింతకాయ  - 


     పండిన చింతకాయలు ను నీళ్లతో నూరి అందు పంచదార కలిపి త్రాగించుచున్న యెడల వడదెబ్బ తగిలిన వారి ప్రాణం నిలబడును. ఎండాకాలం చింతకాయ పానకం తాగుచున్న వారికి ఆరోగ్యం చెడకుండా ఉండును. 


 * బూడిద గుమ్మడి  - 


     బూడిద గుమ్మడికాయ రసము నందు పంచదార కలిపి తాగుచుండిన యెడల రక్తపైత్యము హరించును . బూడిద గుమ్మడికాయ గుజ్జుని తలకు పట్టించుచున్న శిరస్సులో వేడితగ్గి , ముక్కువెంట రక్తం పడుట తగ్గిపోవును .


 * కర్బూజ  - 


     కర్బూజ కాయ పై చెక్కులు ఎండబెట్టి కాల్చి ఆ భస్మముని పావు స్పూన్ తేనెతో కలిపి తినుచుండిన యెడల కడుపులో పెరిగే బల్ల ( spleen enlargement) వ్యాధులు ,నొప్పులు , కడుపునొప్పులు హరించిపోవును .


 * ముల్లంగి  - 


     ముల్లంగి దుంపల రసము నందు కొంచము ఉప్పు కలిపి తాగించుచుండిన  యెడల కడుపుబ్బరం, మూత్రబంధం అనగా మూత్రం బయటకి రాకుండా bladder ఉబ్బి నొప్పి రావటం తగ్గి తేపులు వచ్చును. 


         ముల్లంగి దుంపలను సన్నగా తరిగి ఎండించి కాల్చి ఆ భస్మమును పావుస్పూన్ ఒక చిన్న గ్లాసు నీటితో కలిపి తీసుకున్న బల్ల వ్యాదులు, కడుపునొప్పులు , కిడ్నీ లలో రాళ్లు హరించిపోవును . 


 * బెండచెట్టు - 


     పచ్ఛిబెండ కాయ తినుచుండిన గాని , బెండచెట్టు వేరు పైన బెరడుచూర్ణముని రెండున్నర గ్రాముల మోతాదుగా ప్రాతఃకాలం నందు మంచినీటి అనుపానంతో సేవించుచున్న యెడల స్త్రీలలో కలిగే ఎర్రబట్ట, తెల్లబట్ట వ్యాధులు హరించును . 


 * చిక్కుడు  - 


     చిక్కుడు తీగ, ఆకుల రసమును ముఖమునకు మర్దన చేయుచున్న యెడల ముఖం పైన ఉండు అన్నిరకాల మచ్చలు హరించిపోవును . 


       చిక్కుడు కూర తినుటవలన శరీరంలో జీవశక్తి అధికం అయ్యి ఒంటికి పుష్టి చేకూరును .


  * తెల్ల గలిజేరు  - 


     తెల్ల గలిజేరు కూరను వండుకుని తినుచుండిన యెడల ఉబ్బువ్యాధి తగ్గిపోవును . 


      ఈ గలిజేరు ఆకు గ్రామాల్లో పొలాల వెంట విపరీతంగా పెరుగును . గ్రామస్తులందరికి దీనిపైన అవగాహన ఉంటుంది. 


 * వేప  - 


      5 నుంచి 10 చుక్కల వరకు పరిశుద్ధమైన వేపనూనె ను తాంబూలంలో ఉంచి భక్షించుచున్న యెడల ఉబ్బసం మూడు వారాలలో హరించును .


 * రావిచెట్టు  - 


      రావిచెట్టు పైన బెరడు ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణం గాయాల పైన వేస్తూ ఉన్నచో ఆ గాయాలు మానిపోవును .


 * మర్రిచెట్టు  - 


      మర్రి ఊడలతో ప్రతినిత్యం పండ్లు తోముకున్నచో బుద్ది వృద్ది చెందును. ఆయుర్దాయం ఎక్కువ అగును.


 * పనస - 


       పనస ఆకులను ముద్దగా నూరి సెగగడ్డల పై కట్టుచున్న యెడల త్వరగా పగిలి మానిపోవును . పనస చెట్టు వేరు తొక్క కషాయం కాచి ఆ కషాయం 5 నుంచి 6 చుక్కలు ముక్కు రంధ్రములలో వేయుచున్న యెడల భయంకరమైన తలపోటు తగ్గిపోవును .


 * ములగ - 


      ములగవేరు చెక్క రసమును నాలుగు నుంచి అయిదు చుక్కల రసం ముక్కులో వేయుచుండిన మూర్చవ్యాధి హరించును .


          ములగచెట్టు ఆకులు కూరగా వండుకుని తినుచుండిన యెడల అగ్నిమాంద్యం హరించి అధికంగా ఆకలి అగును.


 * మారేడు  - 


      ఏ ఔషదాలు ఉపయోగించినను పుండ్లు మానకుండా ఉన్న యెడల మారెడు ఆకు కషాయం నందు తేనె కలిపి ఇస్తూ పుండ్ల పైన లేత మారేడు ఆకులను నూరి ముద్ద కట్టుచుండవలెను.


 * దానిమ్మ  - 


        దానిమ్మ చెట్టు బెరడు చూర్ణమును గాని , దానిమ్మ కాయ పై పెచ్చుల చూర్ణం కాని తీసుకుని అందు రెండు తులముల సైన్ధవ లవణం చూర్ణం కలిపి పూటకు రెండున్నర తులముల చూర్ణమును గోరువెచ్చటి నీటి అనుపానముగా తీసుకొన్న యెడల అన్నిరకములు అయిన దగ్గులు , నీళ్ల విరేచనములు హరించును .


 * నిమ్మచెట్టు -


      నిమ్మచెట్టు బెరడు చూర్ణమును ఇంట్లో ధూపం వేసిన యెడల ఆ ఇంట్లో ఉన్నవారికి కలరా వ్యాధి సోకదు. 


 * పెద్ద ఉసిరికాయలు - 


      15 గ్రాముల ఉసిరికాయలు యొక్క రసం నందు కొంచం తేనె కలిపి ప్రతినిత్యం సేవించుచున్న యెడల వాతగుల్మములు,  నీరసం , అతిదాహం , ముక్కు నుంచి నోటినుంచి రక్తం పడుట తగ్గును .


 * అరటిచెట్టు  - 


       అరటిచెట్టు వ్రేళ్ళు కషాయము తాగుచుండిన యెడల ప్రేగుల్లో క్రిములు హరించును . అరటిచెట్టు రసమును తాగుచుండిన యెడల ఆగిపోయిన బహిష్టు మరలా వచ్చును.


 * సంపెంగ చెట్టు - 


     సంపెంగచెట్టు పై బెరడు కషాయమును 30ml చొప్పున తాగించుచున్న యెడల పిల్లలు పక్కలో మూత్రము పోవు వ్యాధి తగ్గును. 


         సంపెంగచెట్టు బెరడు, మిరియాలు కలిపినూరి శనగల వలే మాత్రలు చేసి పూటకొక మాత్ర చొప్పున ఇచ్చుచుండిన యెడల మలేరియా జ్వరం మూడుపూటల్లో హరించును .


 * అవిసె చెట్టు -

 

     అవిశె పువ్వుల కూర కాని , అవిశె కాయల కూర కాని తినుచుండిన యెడల రేజీకటివ్యాధి మూడువారాలలో కుదురును.


 * బంతిచెట్టు  - 


     బంతి ఆకులను రసము పిండి కొంచం వెచ్చచేసి చెవులలో పోయుచున్న యెడల చెవిపోటు , చెవిలొ నుంచి చీము కారుట , చెవిలోని కురుపులు హరించిపోవును . 


        శరీరం తెగి రక్తము కారుచున్న యెడల గాయము పైన బంతిచెట్టు ఆకు రసమును పూసిన యెడల రక్తము కారుట వెంటనే నిలిచిపోవును. 


 * సన్నజాజి  - 


     సన్నజాజి ఆకులు ని నూరి ముద్ద చేసి తేనె కలిపి నాలుకకు పట్టించుచున్న యెడల నోటిపూత మూడురోజుల్లొ పోవును .


 * గులాబి - 


      గులాబి పువ్వుల కషాయంలో తేనె కలిపి తాగుచున్న మలబద్దకం హరించును . 


         ఈ కషాయాన్ని సేవించుట వలన కండ్లమంటలు , గొంతు , ముక్కు ఎండిపొవుట తగ్గును.


 * గానుగ చెట్టు  - 


      గానుగ గింజలలో పప్పు, మిరియాలు సమభాగాలుగా కలిపి నూరి మాత్రలుగా చేసి పూటకు ఒక మాత్ర చొప్పున ఇచ్చుచున్న యెడల మలేరియా జ్వరం హరించును . 


        గానుగ గింజల పప్పు నీళ్లతో నూరి తలకు రుద్దుకొనిన యెడల తలయందలి మురికి , తలలో పేలు , కురుపులు పోవును .


 * ఖర్జురము - 


      ఖర్జురపు గింజను పోకచెక్క మాదిరి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుచున్న కడుపు ఉబ్బరం , కడుపులో బంధించిన వాయువు హరించును .


 * మేడిచెట్టు - 


     మేడిపాలు గాయము పైన నాలుగైదు చుక్కలు వేసిన యెడల గాయములు మానిపోవును . 


       మేడిపండ్లు ఎండబెట్టి చూర్ణము గావించి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు అరతులం చూర్ణం ను తిని అరకప్పు మంచినీరు తాగుచున్న యెడల స్తీలకు కలుగు తెల్లబట్ట వ్యాధి మరియు యోని దోషాలు నివారణ అగును.


 * మోదుగచెట్టు - 


      నీళ్ల విరేచనాలు , జ్వరముతో వచ్చిన విరేచనాలు కట్టుటకు మోదుగాకుల రసం 15ml తాగించుచున్న యెడల మూడు రోజుల్లో పైన చెప్పిన సమస్యలు నివారణ అగును. 


 * బూరుగచెట్టు  - 


       బూరుగు పువ్వుల రసం 40ml , ఆవుపాలు లేక మేకపాలు 40ml , పంచదార 20 గ్రాములు కలుపుకుని ప్రతినిత్యం తాగుచున్న స్త్రీలయొక్క తెల్లబట్ట , ఎర్రబట్ట వ్యాధులు హరించును .


 * తిప్పతీగ - 


       తిప్పతీగ రసము , నువ్వులనూనె సమాన బాగాలుగా తీసుకుని కాచి ఆ తైలమును వెంట్రుకలకు పట్టిస్తున్న యెడల తెల్లవెంట్రుకలు నల్లబడును. 


         శిరస్సుకి చలువచేయును .ఈ నూనెని వొళ్ళంతా మర్దించుకున్న యెడల వొంటి దురదలు తగ్గును. 


 * కుసుమచెట్టు - 


      కుసుమచెట్టు పువ్వులను చూర్ణం గావించి పూటకు రెండున్నర గ్రాముల చూర్ణము చొప్పున మంచినీటి అనుపానంతో ఇచ్చుచుండిన యెడల కామెర్ల వ్యాధి మూడువారాల్లో కుదురును .


                          సమాప్తం 


    మరోక అద్భుతమైన పోస్టుతో మళ్ళీ కలుస్తాను ..


    

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల  - 350 రూపాయలు .


      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384    పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు  కొరియర్ చార్జీలు కలుపుకొని 


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: