6, ఏప్రిల్ 2022, బుధవారం

హోమం - క్షేమం

 హోమం - క్షేమం


అవి నేను రాణీపేటలోని ప్యారి & కొలో పనిచేస్తున్న రోజులు. జనవరి 1978లో పరమాచార్య స్వామివారి దర్శనం కోసం మాట్టుపొంగల్ (కనుమ) రోజు కాంచీపురం దగ్గర్లోని శివస్థానానికి వెళ్ళాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే దర్శనం కాకుండా నన్ను చూసిన వెంటనే, “మీ నాన్నగారి మరణం తరువాత ఆయన చేస్తున్న హోమాలను ఎవరూ చెయ్యడం లేదు. నువ్వు కార్యాలయానికి వెళ్ళడం రావడం అదే పెద్ద అనుష్టానంగా పెట్టుకున్నావు” అని అన్నారు. మహాస్వామివారు అలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు.


వైదిక క్రతువులు చెయ్యడానికి నాకు యోగ్యత లేనందుకు చింతిస్తూ, ఎదో సాకు చెప్పి తప్పించుకోవాలని, “పరమాచార్య స్వామివారి కోసం చాలామంది హోమం చేస్తున్నారు” అన్నాను. అందుకు స్వామివారు “ఎవరు ఏమైనా చెయ్యని. నువ్వు ఏమి చేస్తున్నావని అడుగుతున్నాను” అన్నారు. వెంటనే అక్కడున్న శిష్యుడొకరు నాతో, “ఇవి స్వామివారు నీకిస్తున్న ఆదేశాలు. ఇంకేమి మాట్లాడకుండా వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చెయ్యి” అన్నాడు.


నేను రాణిపేట తిరిగిరాగానే మా నాన్నగారు చేస్తున్న హోమాల గురించిన విషయాలన్నింటిని సేకరించి, శ్రీవిద్యా ఉపాసకులొకరి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా గురు పుష్యమి రోజు పరమాచార్య స్వామి క్షేమం కోరి మొదలుపెట్టాను. అలాగే కొనసాగించి ప్రతి నెలా స్వామి వారి జన్మ నక్షత్రమైన అనూష (అనూరాధ) నక్షత్రం రోజున చేసి వీలున్నప్పుడల్లా స్వామివారికి ప్రసాదం పట్టుకెళ్ళేవాణ్ణి.


1989-90లో ఒకసారి పరమాచార్య స్వామివారు శ్రీమఠంలో నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నారు. వారికి నన్ను చూపిస్తూ, “వీరి నాన్న, పనాంపట్టు దురైస్వామి ఇరవై ఏళ్ళపాటు నా క్షేమం కోసం హోమాలు చేసి వీలున్నప్పుడల్లా నాకు ప్రసాదం తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు చాలామంది నాకోసం హోమం చేస్తున్నారు. కాని అప్పుడు ఆయన చేసిన హోమాల యొక్క ఫలితాలు నేను ఇప్పటికి పొందుతున్నాను. వారు ఇప్పుడు శరీరంతో లేరు. కాని నా ఆయుష్షు మాత్రం పెరుగుతోంది. ఇతను కూడా పదేళ్ళుగా నాకోసం హోమం చేస్తున్నాడు” అని అన్నారు.


మా నాన్నగారు పనాంపట్టు దురైస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. వారు చాలా నియమ నిష్టలు కలవారు, సదాచార పరాయణులు. మహాస్వామివారి క్షేమం కోరి జన్మనక్షత్రం, పౌర్ణమి మొదలైన విశేష దినాలలో హోమాలు చేసి వారే స్వయంగా వెళ్ళి ప్రసాదం సమర్పించేవారు. 1950 - 70లలో ఇలా చేసేవారు.


స్వామివారి అపారమైన జ్ఞాపకశక్తిని, మా కుటుంబంపై స్వామివారి అవ్యాజ కరుణని తలచుకొని చాలా సంతోషించాను. మా భాగ్యవశమున గత ఇరవైమూడేళ్ళుగా ఏ అంతరాయమూ లేకుండా హోమాలు చెయ్యగలగుతున్నాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- పనాంపట్టు సుబ్బు, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 4


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: