ముస్లిం - ముండనం
పరమాచార్య స్వామివారు అప్పుడు కాష్టమౌనంలో ఉన్న కాలం. అందరితోపాటు నేను, నా స్నేహితురాలు నాగలక్ష్మి వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నాము. మా వెనుక వచ్చినతను, “స్వామివారు ఆదేశించినట్టుగానే నేను ఇక్కడకు వచ్చాను” అని అన్నాడు. వెంటనే పరమాచార్య స్వామివారి వైపు చూసి చేతులు రెండూ జోడించి స్వామికి నమస్కరించాడు.
మహాస్వామివారు కూడా అక్కడున్నవారినెవ్వరినీ చూడక, అతనివైపు తీక్షణంగా చూసి చెయ్యెత్తి ఆశీర్వదించారు.
నేను అతని గురించి అడుగగా, తన పేరు సలీం అని, కుంభకోణం నుండి వచ్చానని తెలిపాడు. “నిన్న సామి నా కలలో వచ్చి, ‘రేపు నేను క్షవరం చేయించుకునే దినం. వచ్చి, నన్ను చూసి వెళ్ళిపో’ అని తెలిపారు. అందుకే వచ్చాను” అని తెలిపాడు.
ఆరోజు వపనం దినం - క్షవరం చేయించుకునే రోజు. సన్యాసులు రెండు నెలలకొకసారి పౌర్ణమి రోజు శిరస్సు ముండనం చేయించుకోవాలి. శ్రీమఠంలో దాన్ని సంస్కృత పదమైన ‘వపనం’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. దాన్ని చూడడానికి వెళ్ళడమే మా ఆనవాయితీ. కాని ఆ ముస్లిమ్ భక్తుణ్ణి ఆరోజు రమ్మని చెప్పడమెందుకో నాకు అర్థం కాలేదు.
నేను అతని గురించి నాగలక్ష్మికి చెప్పగా, “అతని పేరు చెల్లప్పన్ అయ్యుంటుంది. నీ చెవులకి అది సలీం అని వినబడి ఉంటుంది”. అని చెప్పింది. మేము మరలా ఆ ముస్లిం భక్తుణ్ణి కలిశాము. అతను మేడలో రుద్రాక్ష మాలను కూడా వేసుకున్నాడు. మరలా మేము అతణ్ణి అడిగాము, “నువ్వు రుద్రాక్షలు ధరించావు కదా! మసీదులోకి నువ్వు వెళ్ళడానికి వారు అనుమతించరు కదా?”
“అవును నేను ముస్లింనే; పేరు సలీం. ఇంతకుముందే స్వామివారిని నేను మూడు నలుగు సార్లు చూశాను. ఒకసారి స్వామివారు నాకు ఈ రుద్రాక్షలు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వీటిని ఏం చెయ్యాలని అడిగాను. అందుకు సామి, ‘అది మెడలో ధరించాలి, కాని నీవారు దాన్ని అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఒక డబ్బాలో ఉంచు’ అని చెప్పారు”
సామి వారు ఇచ్చినదాన్ని నేను మెడలోనే వేసుకోవాలని నిర్ణయించుకుని, అలాగే చేశాను. అయినా నేను ప్రార్థనలకోసం ఎప్పుడు మసీదుకు వెళ్ళినా, ఎవరూ నన్ను నిందించలేదు కనీసం ఆ మాలను తీసివేయమని కూడా చెప్పలేదు.
పరమాచార్య స్వామివారి దివ్యశక్తి ఎవరికి తెలుస్తుంది?
--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి