22, మే 2022, ఆదివారం

దేవతారధన

 దేవతారధన సందేహలకు సమాధానాలు.....*


1. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం...

ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన తరువాత అద్వైతం ఉంటుంది. కలగంటున్న వరకు అది కల అని తెలియదు. బాహ్యస్మృతి లోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలో ఉన్నా చివరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కనుక ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతంలోకి చేరుకోవలసినదే.

2. ఏకేశ్వరోపాసన, బహు దేవతారధనలలో ఏది మంచిది...

ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే.. భగవంతుడు ఒక్కడే కాని రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుడిని ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా ఉండదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తాడో, విష్ణువు అదే ఫలాన్ని ఇస్తాడు. ఇతర దేవతలు అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.

౩. హిందు మతంలో ఇందరు దేవుళ్ళు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి...

మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుడిని ఇలా ఏ పర్వదినానికి తగ్గట్లు ఆ దేవుడు, దేవత రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలని ఆరాధించినట్లు కాదు. ఓకే దేవుడిని నాలుగుసార్లు పూజించి నట్లు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపంలో వస్తాడని. అందుకనే ఇన్ని రూపాలు అని ఆదిశంకరులు చెబుతారు.

4. మన సనతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటే ఏమి చేయాలి...

ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటి నుండి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, మహాభారత, భాగవతాల కథలు తెలియజేయాలి. అందువలన ఆ కథల వలన వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. బాల్యం నుండి స్వధర్మాన్ని అలవరచాలి. పిల్లలు కూడా శ్రద్దగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా స్వధర్మాన్ని అలవారచాలి.

5. మాధవసేవ చేస్తే పుణ్యం వస్తుంది, మరి మానవసేవ వలన ప్రయోజనం ఏమిటి...

ఉపకార గుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి తాను మనిషి అనుపించుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. కష్టాలలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్దమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసింది ప్రపంచం మొత్తం తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. అయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు...

*|| ఓం నమః శివాయ ||*

Spiritual Seekers 🙏
https://www.facebook.com/groups/280040632911780

Spiritual Seekers 🙏
https://youtube.com/channel/UCeSnPJ2eiDGsYewU7R8tIOA 

కామెంట్‌లు లేవు: