18, జులై 2022, సోమవారం

లక్ష్యం

 లక్ష్యం 

మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుండి ఊపిరి ఆగేదాకా ప్రతి క్షణం ఏదో ఒక లక్ష్యం కోసమే కర్మలు చేస్తుంటాడు. పుట్ట్టగానే శిశువుకు వున్న ఒకే ఒక లక్ష్యం తల్లి దగ్గర పాలు త్రాగటమే.  దానికోసం తనకు వున్న ఆయుధం ఏడుపు పిల్లడు ఏడవంగానే ఆ తల్లికి వెంటనే తెలుస్తుంది తన బిడ్డ ఆకలితో వున్నాడని అంతే వెంటనే కడుపునిండా పాలు త్రాగించి పాడుకోపెడుతుంది. ఇక శిశువు పెరుగుతున్నా కొద్దీ వాడి లక్ష్యాలు కూడా మారుతూవుంటాయి. ముందు బోర్లాపడటం, తరువాత పారాడటం, అటుపై నిలుచోటం ఆపై కిందపడకుండా నడవటం ఇలా సమయానుసారంగా లక్ష్యం మారుతూ ఉంటుంది.  సాదా లక్ష్యం వైపు పరుగులు తీయటం జరుగుతుంది. ఇంకా పెరిగితే తన తోటి స్నేహితులతో ఆటలలో గెలవటం. అంటే బొంగరం త్రిప్పటం, గోళీలు గురిచూసి కొట్టటం అటుపై సైకిలు త్రొక్కటం ఇలా ఇలా లక్ష్యాలు మారుతూ ఉంటాయి. 

చిన్నప్పుడుగా వున్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకు భగవంతుని గూర్చి చెప్పటం గుడులకు గోపురాలకు పుణ్యక్షేత్రాలకు తల్లిదండ్రులతో వెళ్ళటం వలన భగవంతుడు ఒకడు వున్నాడని మనం ఆయనను ప్రార్ధిస్తే మనకు ఆయన అనుగ్రహం కలుగుతుందని ఇలా పసి వయసులోనే సంస్కారవంతులైన తల్లిదండ్రుల ప్రేరేపణతో భగవంతుని గూర్చి పిల్లలు ఆలోచిస్తారు. (ఇప్పుడు దైవచింతనగూర్చి పెద్దలు పిల్లలకు సరిగా చెప్పటం లేదు అందుకే సమాజంలో పాపాలు పెరిగి అశాంతి వృద్ధి అవుతున్నది) చదువుకునే పిల్లకు వుండే లక్ష్యం ఎక్కువ మార్కులు సంపాదించి పరీక్షలలో ఉత్తిరున కావటమే.  కాబట్టి తనకు మంచి మార్కులు రావాలని భగవంతుని వేడుకొంటారు.  తరువాత మంచి ఉద్యోగం, పెళ్లి, మొదలైన లక్ష్యాలు నెరవేరటానికి భగవంతుని ప్రార్ధించడం సర్వ సాధారణం. 

భగవంతుని ప్రార్ధించడం, పూజించటం ఆరాధించటం ఇవ్వన్నీ భక్తి మార్గాలు భక్తితో భగవంతుని అనుగ్రహం పొందాలనుకోవడం కూడా మంచిదే కానీ మన కోరికలు అన్నీకూడా కేవలం ఐహికపరమైనవే కోరికలు ఉండటం మంచిది కాదని భార్గవ శర్మ అనటంలేదు కానీ కొంత వయస్సు వచ్చిన తరువాత మనిషి ఐహికమైన వాంఛలకు బానిస కాకుండా ఐహికం కానిది ఏమిటి అనే ఆలోచన చేయాలి. 

మనిషి తానూ ఈ మానవ జన్మ పొందటం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక చక్కటి అవకాశంగా భావించాలి. ఎందుకంటె ఈ భూమి మీద మనిషి కన్నా పెద్దవి క్రూరమైనవి అయిన జంతువులను కూడా మనిషి తన బుద్ది బలంతో లొంగదీసుకోగలుగు  తున్నాడు. అంటే శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని వేరే చెప్పనవసరం లేదు. 

అంతిమ లక్ష్యం: 

మనిషి తన జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ లక్ష్యం మాత్రము మోక్షసాధన మాత్రమే కావాలి.  ఎందుకంటె భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ఇచ్చిన కారణం మనం ఈ జన్మలోనే జన్మరాహిత్యానికి కృషి చేయాలి. కాబట్టి మిత్రమా లే మేలుకో నీ లక్ష్యాన్ని తెలుసుకో ఇప్పుడే దానికి తగిన సాధన మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 


కామెంట్‌లు లేవు: