20, అక్టోబర్ 2022, గురువారం

ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 4

 ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 4


సదాశివేంద్రులకు పిచ్చి ఎక్కిందని మిగతా శిష్యులు వారి గురువులు పరమ దేవేంద్రుల వద్దకు పోయి చెప్పారట. గురువుతో “అయ్యో! అలాంటి పిచ్చి నాకు పట్టలేదే!” అని వెతనొందారట. శివాభినవ సచ్చిదానంద నృసింహ భారతీ స్వామివారి వంటి మహాత్రికాలజ్ఞాన సంపన్నులకు శుశ్రూష చేసిన మహా పండితులయిన శ్రీకంఠశాస్త్రిగారు స్వామివారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోందా? నోట్లో సమస్త బ్రహ్మాండాన్ని చూపిన కృష్ణుని, ఎంత తాడు తెచ్చినా పొట్ట చుట్టూ అయినా తిరగక పోయినా చెమటోడ్చి కష్టపడి రోటికి కట్టి వెయ్యడం ఆశ్చర్యంగా లేదూ!


వారి సంగతి అలా ఉంచండి. ఒక మహాపండితులు. రెండు పీఠాలకు శిష్యులైన వారు కంచిస్వామి వారి వద్దకు వచ్చి “ఆయన(శృంగేరీ స్వామి) పిచ్చివారయిపోయారని” చెప్పారట. అది విన్న స్వామివారు ‘శివశివ’ అంటూ మాన్పడిపోయి, పెద్దగా నిట్టూర్చి కోపంతో ఊగిపోతూ (అంత కోపం ఎప్పుడూ చూడలేదంటారు. స్వామివారికి బహుకాలం సేవ చేసిన మఠమేనేజర్ విశ్వనాథ అయ్యర్) “మీకు పిచ్చికి మంచికి తేడా తెలుసా? తమరు సర్వజ్ఞులో? అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం” అని పెద్దగా కేకలు పెట్టి “నీ ఈ అపరాధానికి నిష్కృతి ఈ ప్రపంచంలో ఎవరూ ప్రసాదించలేరు. పోయి చంద్రమౌళీశ్వరుని పాదాలు ఆశ్రయించు” అంటూ ముగించారట.


1935లో కంచిస్వామి కలకత్తాలో నవరాత్రి పూజలు చేస్తున్నారు. మంత్రేశ్వర శర్మగారు అనే శృంగేరీ స్వామివారి పరమ భక్తులొకాయన కమిటీలో ఉండి నిర్వాహక వర్గానికి ఎంతో అండదండలుగా ఉన్నారు. నాల్గవరోజు వరకూ ముఖ్య భూమిక నిర్వహించారు. నాల్గవ రోజు అనిపించింది. ఎంతయినా మా స్వామివారు చేసే పాటి అవుతుందా ఈ పూజ అని ఇక ఆగలేకపోయారు. సరాసరి శృంగేరీ చేరారు. శృంగేరీ స్వామి తమ మృదు ప్రవృత్తికి భిన్నంగా ఎంతో కఠినంగా మా ఇద్దరికీ వ్యత్యాసం ఉందని, అక్కడ పూజ వదిలి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చావా? ఇది చాలా తప్పు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు. శీఘ్రం తిరిగిపో అని త్రిప్పి పంపెవేశారట. రైళ్ళు కూడా సరిగా లేని ఆ కాలంలో విజయదశమి నాటికల్లా కలకత్తా చేరి కంచిస్వామికి విషయం విన్నవించి భేద భావం సమూలంగా నాశనం అయిందని మనవి చేశారట. వారు ఎంతో ఆదరంగా ప్రసాదాలననుగ్రహించారు. చివరగా “శంకర అండ్ షణ్మత’ అనే పుస్తకంలో అగ్నిహోత్రం తాతాచార్యుల వారు వ్రాసిన వ్యాసం నుండి ఒక ఉదంతం వివరించి ముగిస్తారు.


తాతాచార్యుల వారు ఒక నిపుణుల బృందంతో కంచిస్వామివారి పనుపున రాజ్యాంగ నిర్మాణ సంబంధమైన కార్యంలో వివిధ హిందూ మతాచార్యులను, పీఠాధిపతులనూ కలుసుకొంటూ శృంగేరీ చేరారు. అంతవరకూ బాహ్యస్మృతిలో లేని భారతీ స్వామివారు ఆ రోజునే దైనందిన కార్యక్రమాలలోనికి వచ్చారు. వీరిని చూసి ఎంతో ఆప్యాయంగా ‘కామకోటి ఆచార్యులు. ఇప్పుడు ఎక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు” అంటూ ప్రశ్నించారు. కంచిస్వామి వారి గురించి ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు.


తరువాత వీరు వచ్చిన కార్యం తెలుసుకొని ఎంతో ప్రసన్న చిత్తులయ్యారు. “దేశ పరిస్థితులను సుసూక్ష్మంగా గుర్తించి ప్రస్తుత పరిస్థితిలో మన కర్వవ్యమేమిటో గుర్తించగల్గిన వారు కంచిస్వామి వారొక్కరే. ఆ విషయంలో మేమందరమూ వారి కృషి పైనే ఆధారపడతాము. ఇందుకు వారికెంతో కృతజ్ఞులము. వర్తమాన కాలంలో కాన దేశంలోని హిందువులు ఈ మాత్రమైన స్వధర్మావలంబకులై ఉన్నారంటే దానికి కంచి స్వామివారే ప్రేరకులు” అని చెప్పి ఈ ప్రయత్నంలో సహాయకులుగా శ్రీసంగమేశ్వర శాస్త్రి అనే ఆయనను వీరి ప్రతినిధి వర్గంతో పాటు పంపారట. 


ఈ విషయం విన్న కంచిస్వామి వారు ఎంతో గౌరవంతో “వారెల్లప్పుడూ ఆత్మనిష్ఠలో ఉంటూ బహిః ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ, ఆ జ్ఞాని జ్ఞాన ప్రకాశం వల్లనే ఈ దేశం శ్రేయస్సును పొందుతోంది. ఇందుకు యావద్భారతం వారికే కృతజ్ఞతతో ఉండాలి” అన్నారట. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: