3, మార్చి 2023, శుక్రవారం

*పరమాచార్య పరిపూర్ణ కటాక్షం!*

 *పరమాచార్య పరిపూర్ణ కటాక్షం!*

                    ➖➖➖


చాలా ఏళ్ళక్రితం ఒకరోజు మాకు పరమాత్మ కంచి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభించింది. 


ఒకసారి నేను, నా భార్యా,కూతురుతో కలిసి కాంచీపురం వెళ్ళాము. పరమాచార్య స్వామి, పుదు పెరియవ, బాల పెరియవ ముగ్గురిని దర్శించాము. రాత్రి చంద్రమౌళీశ్వర పూజ చూశాము. మరుసటి రోజు ఉదయం మహాస్వామివారి విశ్వరూప దర్శనం, మరియు గోపూజ తిలకించాము. 


అమ్మవారి దేవస్థానంలో అప్పుడే కొత్తగా విడుదల చేసిన ముగ్గురు ఆచార్యులూ కలిగి ఉన్న చిత్రపటాలను రెండింటిని తీసుకున్నాము. వాటిని పరమాచార్య స్వామివారికి ఇచ్చి వారి అనుగ్రహం పొందాలని శంకర మఠానికి వెళ్ళాము. 


స్వామివారిని దర్శించుకుని ఆ చిత్రపటాలను ఇచ్చి ఆశీస్సులు కోరాము. వాటిని తీసుకుని స్వామివారు, “వీటిని ఎక్కడ కొన్నారు?” అని అడిగారు. బహుశా వీటిని స్వామివారు మొదటిసారి చూస్తున్నారు కాబోలు. 


ఒక పరిచారకుణ్ణి పిలిచి, వాటికి ఫ్రేము కట్టి మఠంలో రెండు చోట్ల వాటిని పెట్టమని ఆదేశించారు. మేము ఇచ్చిన చిత్రపటాలు శ్రీమఠం గోడలపై ఉంటాయని మాకు ఎల్లలు లేని ఆనందం కలిగింది. ఏమి పరమాచార్య స్వామి కరుణ! మఠంలో వేయడానికి బంగారు ఫ్రేముకట్టి ఇచ్చే భక్తులు ఎంతమంది లేరు? అటువంటప్పుడు ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వడం మా పూర్వజన్మల అదృష్టం. 


శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని (కుచేలుడు)తో అడిగి మరీ అటుకులు తీసుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. 


రెండు పటాలకు ఫ్రేము కట్టించి, మాకోసం అని మరొక ఫోటో కొనుక్కొని మద్యాహ్నం ఒంటిగంటప్పుడు శ్రీమఠానికి వెళ్ళాము. మూడున్నరకు మహాస్వామి వారు వచ్చి కూర్చున్నారు. స్వామికి ఇవ్వమని మూడు చిత్రపటాలను అక్కడున్న శిష్యునికిచ్చాము. 


ఫ్రేము కట్టిన పటాలను మఠం గోడలకు వేలాడదీయమని స్వామివారు ఆదేశించారు. ఇంకొక చిత్రపటాన్ని స్వామివద్దనే ఉంచుకున్నారు. ఈ చర్యకు కారణం మాకు తరువాత తెలిసింది. ఇది కేవలం శంకారాచార్యులు నలుగురు శిష్యులతో కలిసి చేసే వేదాంత విచారణను మాకు చూపించాలనే స్వామివారు అలా చేశారు.


కొద్దిసేపట్లోనే మాకు ఆ పరమాద్భుతమైన దృశ్యం కనిపించింది. 


పరమాచార్య స్వామివారు వచ్చి ఆదిశంకరులు లాగా కూర్చున్నారు. వారిముందు బాల పెరియవ కూర్చున్నారు. ఇద్దరు వేద పండితులు చిన్నస్వామి పక్కనే కూర్చున్నారు. వేదాంత విచారం మొదలుపెట్టారు. 


ఆదిశంకరులు తమ శిష్యులకు ఉపదేశించే దృశ్యమే మాకు అగుపించింది. 


తైత్తరీయోపనిషత్తులోంచి బ్రహ్మాత్మానంద అనుభవం గురించిన ఒక శ్లోకాన్ని చిన్న స్వామివారు చెప్పారు. వాటికి పరమాచార్య స్వామివారు వ్యాఖ్యానం చేశారు. 


దక్షిణామూర్తి గురించి “గురోస్తు మౌనం వ్యాఖ్యానం” అని చెబుతాము కదా? కాని మాకు ఇక్కడ “గురోస్తు లలిత వ్యాఖ్యానం” లాగా తోచింది. అప్పుడు జరిగిన వేదాంత విచారంలో ఇప్పటికీ నాకు ఒక శ్లోకం గుర్తు ఉంది. “తద్ బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత” దీనికి చిన్నస్వామి వారి వ్యాఖ్యానం: “పరిమరీయతే ఇతి పరిమరః - వాయురిత్యర్థః” పరిమరం అంటే వాయువు అని చిన్నస్వామి వారు చెప్పారు. 


చిన్నస్వామి పక్కన కూర్చున్న ఇద్దరు పడితులు కూడా ఈ వేదాంత వాదనలో పాల్గొన్నారు. 


మేము ముగ్గురము ఈ బ్రహ్మానంద అనుభవాన్ని దాదాపు గంట పాటు అనుభవించాము. 


తరువాత మహాస్వామివారు చిన్నస్వామికి, ఆ ఇద్దరు పండితులకు పెరుగు నింపిన కొబ్బరి చెక్కలను ప్రసాదంగా ఇచ్చారు. 


కేవలం మాకు ఈ అనుభవం ఇవ్వడానికే పరమాచార్య స్వామివారు చిత్రపటముల ఫ్రేము వంకతో మమ్మల్ని ఇంతసేపు మఠంలో ఉంచుకున్నారని తెలుసుకుని మాకు అద్వితీయమైన ఆనందం కలిగింది. 


తరువాత ఆ మూడవ చిత్రపటాన్ని మంత్రాక్షతలతో పాటు స్వామి వారు మాకు అనుగ్రహించారు. 


ఈ సంఘటన వల్ల నాకు తెలిసినది ఏమంటే 

మమ్మల్ని కరుణించడానికే స్వామివారు మావద్ద అడిగిమరీ చిత్రపటాలను తీసుకున్నారు (బంగారు ఫ్రేము కట్టి ఇవ్వగలిగిన భక్తులు వున్నప్పటికి). 


పవిత్రమైన శంకర మఠంలో మేము ఇచ్చిన చిత్రపటాలను వేలాడతీయవలసిందిగా ఆజ్ఞాపించడం మాకు కలిగిన అదృష్టం. 


ఎక్కడా దొరకని బ్రహ్మానంద అనుభూతిని వేదాంత విచారం ద్వారా ప్రత్యక్షంగా మాకు ప్రసాదించడం. 


--- డా. యస్. రామకృష్ణన్, చెన్నై - 92. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥


#KanchiParamacharyaVaibhavam

# కంచి పరమాచర్య స్వామి వైభవం#

కామెంట్‌లు లేవు: