11, ఏప్రిల్ 2023, మంగళవారం

సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం

 (ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_


ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు. *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు.

ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు..

“సుల్తాను వారికి ఒక విన్నపం, తమ సేనలు దక్షిణాపథ దండయాత్రలో సాధించిన విజయ పరంపరలలో దేవాలయాలలోని ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసికొనివచ్చాయి. మేల్కోట దేవళంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు ఇప్పించాలని మా వేడికోలు. నేడు మేల్కోటదేవళం ప్రాణరహితమైన శవప్రాయంగా పాడుపడి ఉంది,” అన్నారు రామానుజులు.

“సుల్తాను, యతిరాజుల వారి మాటలు సావధానంగా విని, అయ్యా, మీ చిరుకోరిక మన్నించటానికి మాకు అభ్యంతరం లేదు. అసలు ఆ విగ్రహం ఎలా వుంటుందో, మా వద్ద ఉన్నదో లేదో, కరిగించేసేమో నాకు తెలియదు.. అల్లా అనుగ్రహం వలన మీరు కోరిన విగ్రహం దొరకుతుందేమో చూద్దాం, దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరకు పోయి చూద్దాము,” అని అన్నాడు.

ఉభయులు నడచి వెళ్లుతూ వుండగా, సుల్తాను, *“స్వామీ, మీరు వేయి మైళ్ళు నడిచి వచ్చారు, వ్యయప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా?.. ఈ విగ్రహంలో విశేషం ఏమిటి?”* అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా రామానుజులు తాము గానీ, తమ శిష్యులు గానీ ఆ విగ్రహాన్ని ఇంతకు ముందు చూడలేదనీ, తమది తమిళనాడనీ, విధివిలాసం వల్ల కర్ణాటక దేశానికి పోయినపుడు ఈ విషయం విని వచ్చామని చెబుతారు..

సుల్తాను అచ్చెరువంది, “స్వామీజీ – అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎట్లా గుర్తించదలచారో దయచేసి చెప్పండి” అని అడిగాడు.

అప్పటికే ఉభయులూ పెద్ద దొడ్డిలోకి ప్రవేశించారు.. రామానుజులు అక్కడ పడివున్న విగ్రహాలవైపు చూస్తూ, “మేల్కోట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం, ఆయన విగ్రహం ఇక్కడే వుండి వుంటే తప్పకుండా వస్తాడు.. తండ్రీ *సంపత్కుమారా,* రా! నా తండ్రీరా” అని బిగ్గరగా పిలచారు.. ఒక్క విగ్రహం కదలలేదు.. సుల్తానుకు విగ్రహాలు కదలవు, మెదలవు, మాట్లాడవు అని మాత్రమే తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలుగలేదు.

రామానుజులు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహం కదలలేదు, మారు పలకలేదు, రామానుజుల వారు ఆశా భంగం కలిగింది.. సుల్తాను జాలితో, _*“స్వామీజి మీరు ఆశాభంగం చెందవద్దు, మీకు నచ్చిన మరో విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు”*_ అని అంటాడు.

_“మాకు కావాల్సిన విగ్రహం ఒక్క మేల్కోట సంపత్కుమార విగ్రహమే, తెచ్చిన అన్ని విగ్రహాలు ఇక్కడే వున్నాయా లేక ఒకటి రెండు వేరే చోట పెట్టారా దయచేసి సెలవిస్తారా?”_ అని రామానుజులు గంభీర స్వరంతో ప్రశ్నిస్తారు..

“అన్నీ ఇక్కడే వున్నాయి. కొన్నింటిని కరగించి వేశారు.. *అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం చాలా అందంగా వుందని మా అమ్మాయి ముచ్చటపడి ఆడుకోడానికి దాచుకున్నట్లు వుంది*..” అన్నాడు సుల్తాను.

రామానుజల మెదడులో ఒక మెరుపు తీగ మెరసినట్లని పించింది. _“ప్రభూ!ఆ విగ్రహాన్ని మేము చూడవచ్చా..”_ అన్నారు రామానుజలవారు.

“మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం, రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని చూపిస్తాను లెండి, సాధారణంగా మా అంతఃపురంలోకి పర పురుషులు ప్రవేశించరాదు, మీరు సన్యాసులు, మహానుభావులు కాబట్టి మా జనానాలోకి రానిస్తున్నాం.. ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్కుమారుడే అయితే మీరు పలిస్తే పలుకుతాడేమో చూడాలని కోరికగా వుంది.” అంటూ అంతఃపురం వైపు నడిచాడు సుల్తాను.

సుల్తాను వెంట భగవద్రామానుజుల వారు *విష్ణుసహస్ర నామ* పారాయణ చేస్తూ అంతఃపురములోకి వెళ్ళారు. పదునాలుగవ నామం దగ్గరకు వచ్చి *ॐ పురుషాయ నమః* అని జపిస్తూండగా రాజకుమారి గదికి చేరుకున్నారు.. శిష్యులందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండగా, _“తండ్రీ సంపత్కుమారా! నా దగ్గరకు రావా తండ్రీ, నీవు సంపత్ప్రదాతవు, స్వప్రదాతవు, ఓ పరమపురుషా, నీవే సంపత్కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తోంది,”_ అంటూ బిగ్గరగా భక్తి తన్మయత్వంతో పిలిచారు రామానుజులు.

*ఇక తన కన్నుల యెదుట జరిగిన అత్యద్భుత సన్నివేశం చూచి సుల్తాను మతి పోయింది.. మందమత్తేభ గమనంతో సంపత్కుమార విగ్రహం చకచకా ముందునకు నడచి రామానుజల వారి సన్నిధికి తరలి వచ్చింది..*

సుల్తానుకు అది కన్నుల పండుగ మాత్రమే కాదు. సంపత్కుమార దేవుని మొలత్రాడు చిరుగజ్జెల సవ్వడి సుల్తానుకు వీనుల విందు చేసినది.. *సంపత్కుమార దేవుడు రామానుజలవారికి తనను తాను దానం చేసుకున్నాడు..* రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కోట తీసికొనివచ్చి, సంప్రోక్షణతో తిరిగి కోవెలలో ప్రతిష్ఠించారు..

అయితే, సంపత్కుమారుని కనుగొల్కలనుండి *వేడి కన్నీటి* బిందువులు కారటం ఒక శిష్యుడు చూచాడు.. ఆ శిష్యునికి సంపత్కుమార దేవుడు అంతరంగికంగా చెప్పాడు.. _“భగవద్రామానుజులు సంపత్ప్రదాత అయిన పరమపురుషుడవని కీర్తించడంతో నేను భక్త పరాధీనుడనై లొంగి పోయి వచ్చాను.. కానీ సుల్తాను కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి.. ఆమె మహా భక్తురాలు.. ఆమెను విడిచిపెడితే నేను ఎట్లా భక్త పరాధీనుడను కాగలను?”_

ఆ విషయం భగవద్రామానుజుల వారికి తెలిసి సుల్తాను కూతురును మేల్కోటకు ఆహ్వనించారు.. రాకుమారి బీబీనాచ్చియారుగా మేల్కోటలో స్థిరపడింది.. ఈ నాటికి కూడా బీబీనాచ్చియారు విగ్రహం మేల్కోటలో వుంది. అందరూ చూడవచ్చు..

వైకుంఠనాథుడైన పరమపురుషుడు రామానుజులవారికి, ముస్లిము రాకుమారికి *స్వప్రదాత* అయినాడు. అట్లే ముక్తులైన భక్తులందరికీ అతడు వివశుడే.. అందుచేతనే శ్రీమన్నారాయణమూర్తిని *ॐ పురుషాయ నమః* అని విష్ణు సహస్రనామం అర్చిస్తుంది...

.

కామెంట్‌లు లేవు: