ఇద్దరమూ ధరఖాస్తు చేసుకుందాం
సాయింత్రం ఆరుగంటల సమయం. కంచిలోని శ్రీమఠంలో పరమాచార్య స్వామివారు ప్రశాంతంగా ఒక మూలన కూర్చున్నారు. స్వామివారి ముందు కొంతమంది భక్తులు నిలబడి ఉన్నారు. బహుశా అరవయ్యేళ్ళు పైబడ్డ ఒక ముసలావిడ స్వామివద్దకు వచ్చింది. శిరో ముండనం చేయించుకొని, కట్టుకున్న తెల్లచీర కొంగును తలమీదుగా వేసుకుని ఉంది. నేను కూడా అక్కడే ఉండి అంతా గమనిస్తున్నాను.
అప్పటి తమిళనాడు ప్రభుత్వం వృద్ధులకు జీవనభృతిగా నెలనెలా కొద్ది మొత్తం ఇవ్వాలని ఒక పథకం ప్రారంభించారు. అది అప్పుడే కొత్తగా అమలులోకి వస్తోంది. మహాస్వామివారు అక్కడ ఉన్న భక్తులతో సంభాషిస్తున్నారు. ఆ ముసలావిడ కూడా స్వామివారికి ఏదో విషయం చెప్పాలని ఆత్రుతగా ఉంది. ఆమె చాలా కాలంగా శ్రీమఠంలోనే ఉంటున్నది.
”స్వామి వారికి ఒక విజ్ఞాపన” అంటూ ఆమె మొదలుపెట్టింది.
”నీకు కూడా ఏమైనా సమస్యలున్నాయా?” అని అడిగారు స్వామివారు.
కొద్దిగా సంతోషంతో ఆవిడ “అవును. అంటే అది సమస్య ఏమి కాదు. ప్రభుత్వం వయసైనవారికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నది. అలాగే ఏ ఆధారము లేని ముసలివాళ్ళకు. . . ”
“అవును. . . అయితే ఏంటి?”
“అది ఎలాగంటే, మఠం తరుపున నా పేరు కూడా పంపితే, నాకు కూడా డబ్బు వస్తుంది”
“ఔను నిజమే నీకూ ఇస్తారు. అది సరే. కాని నీకు ఇక్కడ ఏమి తక్కువ? సమయానికి ఆహారం అందుతోంది. కట్టుకోవడానికి చీరలి అవి కూడా ఇస్తున్నారు. ఉండడానికి చోటు ఉంది. మరి డబ్బుతో నీకు అవసరం ఏమి ఉంది?”
“లేదు. అలా కాదు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది కదా. ఎందుకు వదులుకోవడం అని. . . ” కొద్దిగా నిరాశగా బదులిచ్చింది.
”సరే అలా అయితే! నేను కూడా ముందు వెనకా లేని వాణ్ణి. ఆ మఠంలో ఒక మూలన ఉంటాను. ఇద్దరమూ ఆ భృతికొరకు ధరకాస్తు చేసుకొందామా?” అని అడిగారు.
స్వామివారి మాటలను వినగానే ఆ ముసలావిడ సిగ్గుతో తలవంచుకుంది. ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని నిరుపయోగ పరచడం చాలా పాపం. స్వామివారు ఇది కేవలం ఆ ముసలావిడకు మాత్రమే కాదు, మనందరికి చెబుతున్నారు.
మహాస్వామివారు ఇంకా ఇలా చెప్పారు, “మనం బ్రతకడానికి మనకి కనీసం ఆహారం అయినా దొరుకుతోంది. ఎండ వానల నుండీ రక్షణ పొందడానికి ఒక గూడు ఉంది. మన అభిమానాన్ని కాపాడుకోవడానికి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఈ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది ఇవి కూడా లేని కదు బీదవారి కోసం. నేను నీకు ఈ భృతి ఇప్పిస్తే, నిజంగా అది అందాల్సిన ఒక ముసలావిడకో, ముసలాయనకో అందకుండా పోతుంది. అలాంటి వారు అర్హులు ఈ ఫించను పొందడానికి. కాదా?”
మహాస్వామివారి మహోన్నతమైన హృదయాన్ని కరుణని ఆ ముసలావిడతో సహా అక్కడున్నవారందరూ ప్రత్యక్షంగా దర్శించుకున్నారు.
--- ఏరాసు, చెన్నై - 61
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి