15, జులై 2023, శనివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 117*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 117*


చాణక్యునికి దౌహిత్రుడు జన్మించాడు. 


చాణక్యుని ఏకైక పుత్రిక అన్నపూర్ణ గర్భవసాన జన్మించిన ఆ బాలునికి 'రాధాగుప్తుడు' అని నామకరణం చెయ్యబడింది. పుత్రసంతానములేని చాణక్యుడు దౌహిత్రుని జననంతో తమకి 'ఉత్తరగతులకు' లోపం జరగదనుకొని ఆనందించాడు. 


అర్థశాస్త్రము, కామసూత్రములు మౌర్య సామ్రాజ్యమంతటా ప్రచారం చెయ్యబడ్డాయి. ఆ సేతు హిమాచలము వరకూ విస్తరించిన మౌర్య సామ్రాజ్యములోని జనులందరూ ఆ రెండు శాస్త్రములనూ తమ తమ నిత్యజీవితాలలో పాటించి, సత్ఫలితాలు పొంది సుఖశాంతులతో వృద్ధి చెందసాగారు. 


చాణక్యునికి ఆముష్మిక జీవనం మీదకి మనసు మళ్లింది. తపోవనానికి చేరి శేషజీవితాన్ని తపస్సు చేసుకుంటూ గడిపి వెయ్యాలని ఆలోచించాడు. తన భార్య గౌతమిని సంప్రదించాడు. 


"మీతో తపోవనానికి రావడానికి, వానప్రస్థ జీవనం గడపడం నాకు ఇష్టమే.... కానీ నాదొక్క మనవి. మన వివాహమైన యిన్ని సంవత్సరాలలో నేను కోరుతున్న ఒకే ఒక కోరిక..." అన్నది గౌతమి. 


అర్ధాంగి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆర్యుడు. 


"దౌహిత్రుడు జన్మించి ఆరుమాసాలు మాత్రమే అయినది. మనకెటూ పుత్రసంతానం లేదు. కనీసం మనవడి అచ్చట్లు ముచ్చట్లు కొంతకాలం చూసి ఆనందించాలని ఉంది. ఆ తర్వాత మీ యిచ్ఛానుసారమే మనం వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుదాం" అని కోరింది గౌతమి. 


భార్య కోరికలోనూ ధర్మమున్నదనిపించి "సరే" అన్ని సమ్మతించాడు చాణక్యుడు. 


మనవడి ఊసులు చూస్తూ ఆనందిస్తున్న చాణక్యునికి బాలల కోసం ఏదైనా శాస్త్రం వ్రాయాలనిపించింది. "పిల్లలు స్వచ్ఛమైన సరస్సువంటి మనస్సు గలవారు. ఆ వయస్సులో వాళ్ళకి మంచి విషయాలు నేర్పితే, ఆ పసివయసు నుంచే వారి మనస్సులు ధర్మహితాలై, వారి భవిష్యత్తులు ఆదర్శవంతంగా ప్రకాశిస్తాయి. ఆ వయస్సు పిల్లలకి నేర్పడం సులభం." 


ఆ విధంగా ఆలోచించిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రాన్నించి ముఖ్యమైన సూత్రాలను తీసుకొని వాటిని సంక్షిప్తం చేస్తూ నీతిసూత్రాల రూపంలో చిన్న గ్రంథం తయారుచేశాడు. 


బాలలకోసం గ్రంధస్తం చేసిన ఈ శాస్త్రానికి "రాజనీతి సూత్రాణి" అని పేరు పెట్టాడు చాణక్యుడు. 


బాలలకి సులభంగా అర్థమయ్యేటట్లు చిన్నచిన్న వాక్యాలతో 8 అధ్యాయాలతో 562 సూత్రాలతో రచించబడిన ఈ చాణక్యనీతి సూత్రాలు తెలుగు వ్యాఖ్యానాలతో మీ ముందుకు ...

(ఇంకా ఉంది)...🙏l


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

కామెంట్‌లు లేవు: