12, అక్టోబర్ 2023, గురువారం

నవగ్రహ పురాణం - 79*_

 _*నవగ్రహ పురాణం - 79*_


*బుధగ్రహ చరిత్ర - 6*


*"నా పేరు అదే - ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు..."* *"సుద్యుమ్నుడా !! నారాయణ !"* నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఔను ! స్త్రీ రూపం రాగానే నా పేరు 'ఇల' అని అనిపించింది ఎందుకో ?"* ఇల దీనంగా అంది.


*“నారాయణ ! సుద్యుమ్నుడు...ఇది... అప్పుడు పురుషుడు... ఇప్పుడు స్త్రీ...అప్పుడు యువకుడు... ఇప్పుడు యువతి ! బాగుంది... "* నారదుడు స్వగతంలా అనుకుంటున్నాడు. 


*"మహర్షీ ! నాకు ఈ గతి ఎందుకు పట్టింది ?"* ఇల దయనీయంగా అడిగింది.


*"ఎందుకు ?"* నారదుడు సాలోచనగా అన్నాడు. *"నారాయణ ! నువ్వు... పొరపాటున ఆ 'కుమార వనం'లో అడుగుపెట్టలేదు కద ?"* 


*"కుమారవనం అని తెలీదు కానీ , ఒక వనంలోకి వెళ్ళాం నేనూ , భటులూ..."* అంటూ ప్రారంభించి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఇలా..


*"నారాయణ ! ఇంక నీ గతి ఇంతే ! ఈ ఇల మీద నువ్వు 'ఇల'గా జీవించాల్సిందే !”* నారదుడు నిష్కర్షగా అన్నాడు. *"ఎందుకు ఇలా జరిగిందని కదా నీ అనుమానం. ఆ కుమారవనంలోకి ఎవరు అడుగుపెట్టినా అంతే ! ఏ పురుష ప్రాణి అయినా సరే - కుమార వనంలో పాదం మోపగానే స్త్రీ ప్రాణిగా మారిపోవాల్సిందే ! స్త్రీ ప్రాణిగా జీవించాల్సిందే ! స్త్రీ ప్రాణిగా మరణించాల్సిందే !*


*"అలా జరగాలని పార్వతీ పరమేశ్వరులు తమ శాపంతో శాసించారు. కుమారవనం ఆ ఆదిదంపతుల ప్రత్యేక ప్రణయోద్యానం ! పార్వతీ మాత శాపంక్ పెట్టడానికి కారణం ఉంది. ఒకనాడు ప్రశాంత సమయాన పార్వతీ శంకరులు కుమారవనంలో , ఏకాంతంలో ఒకరికి ఒకరై ఆనందిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి కొందరు మహామునులు వాళ్ళ దర్శనానికి వచ్చి , వనంలో ప్రవేశించారు. ఆది దంపతుల ప్రణయ కాలక్షేపం గురించి తెలియని ఆ మునులు వాళ్ళిద్దరూ ఆదమరిచి ఉన్న ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయారు.”*


*"పార్వతి సిగ్గుపడింది. ఆగ్రహించింది. తమ అభ్యంతర విహార స్థలమైన కుమారవనంలోకి ప్రవేశించిన ప్రతి పురుషప్రాణీ స్త్రీగా మారిపోయేలా శాపం పెట్టాలంది ! శివుడు సరే అన్నాడు ! ఇద్దరూ ఏక కంఠంతో ఆ విధంగా శాపం పెట్టేశారు !"* నారదుడు వివరించి , ఇల వైపు చూశాడు.


*"నారద మహర్షీ ! నా గతి ఏమిటి ? ఆదిశక్తి శాపానికి విరుగుడు లేదా ?"* ఇల ఆశగా అడిగింది.


*"చండిక శాసనం అది ! అంటే చండశాసనం అన్నమాటే. తల్లీ ! ఆదిశక్తి ఆగ్రహమైనా , అనుగ్రహమైనా అనుభవించక తప్పదు ! నిన్ను సుద్యుమ్నుడుగా ఎవరూ గుర్తించరు. నిన్ను స్త్రీగానే భావిస్తారు ! అంగీకరిస్తారు ! స్వీకరిస్తారు ! అందగత్తెవైన నీలాంటి యువతులకు పురుషులతో ప్రమాదం ఉండనే ఉంది ! అంచేత నువ్వు... రాజధానికి తిరిగి వెళ్ళడం శ్రేయస్కరం కాదు...”* నారదుడు చెప్పుకు పోతున్నాడు.


*"అయితే...నా భవిష్యత్తు ? మీరే నాకు మార్గ దర్శనం చేయాలి ?"* ఇల ప్రాధేయ పూర్వకంగా అంది.


*"ఈ అరణ్యంలో తూర్పుదిక్కుగా వెళ్తే నీకు మేలు జరిగే అవకాశం ఉంది. మహాసాత్వికులైన మంచి వ్యక్తులు నీకు పరిచయమవుతారు. నీ భవిష్యత్తుకు అంకురార్పణ జరుగుతుంది !"* నారదుడు భవితను సూచించే జ్యోష్కుడిలాగా అన్నాడు.


*“అయితే... నన్ను... ఇటు వైపు వెళ్ళమంటారా ?”* ఇలా అడిగింది. 


*"ప్రస్తుతం నీ మార్గాంతరం అదే ! బయలుదేరు ! శుభం భూయాత్ !"* నారదుడు దీవిస్తూ అన్నాడు.


ఇల నారదుడు సూచించిన దిశగా అడుగులు వేస్తోంది. రూపం మారేసరికి తనలో మానసికంగా కూడా ఏదో మార్పు వచ్చేసింది. చిన్న చప్పుడుకు కూడా తను జడుసుకుంటోంది. కుందేళ్ళనీ , లేళ్ళనీ , దుప్పులనీ చూస్తుంటే - పురుషావతారంలో అనిపించినట్టు వాటిని సంహరించాలనిపించడం లేదు. వాటిని చేరదీసి ముద్దు చేయాలని ముచ్చటవేస్తోంది. పురుష మనస్తత్వానికీ , స్త్రీ మనస్తత్వానికీ , ఆలోచనా సరళికి ఇంత అంతరం ఉంటుందా ?


మెత్తటి అడుగుల చప్పుడు ఇలను ఆలోచనల నుండి లాగింది. ఆమెలో ఆలోచనలు ఆగినట్టే , ఎదురుగా వినవచ్చిన అడుగుల సవ్వడి కూడా ఆగింది. ఇల బెరుకు బెరుకుగా చూసింది.


ఎదురుగా ఒక యువకుడు ! తనలాగే నిలబడి , తనలాగే ఆశ్చర్యపోతూ చూస్తున్న యువకుడు. ఇందాక లేడిని చూడగానే భయంతో స్పందించిన ఆమె గుండె ఇంకా ఎంతో వేగంగా స్పందిస్తోంది. అయితే భయంతో కాదు , ఏదో ఉద్వేగంతో !


పురుష సౌందర్యానికి నిర్వచనంలా ఉన్నాడా యువకుడు ! పోతపోసిన అందంలా ఉన్నాడు ! తళతళ లాడుతూ కనిపిస్తున్న శరీర సౌష్టవం ! గుండ్రటి ముఖం. చూపుల్ని బలంగా లాగి బంధించివేసే అందమైన పెద్ద పెద్ద కళ్ళు ! దరహాసానికి ప్రాణం పోస్తున్న పెదవులు... దగ్గరైన అదృష్టవంతురాలికి ప్రణయ పీఠంలా భాసించే విశాల వక్షం.... కళ్ళు చెదిరే శరీర వర్ణం... ఆ దేహకాంతిని హెచ్చవేత వేసి చూపించే వస్త్రధారణ... గాలికి ఎగురుతున్న పల్చటి అంగవస్త్రం. 


ఇల తటాలున రెప్పవాల్చి తనను చూసుకుంది. మరుక్షణం ఆమె సిగ్గుతో కుంచించుకు పోయింది. ఎడమ చెయ్యి తటాలున ఆమె పయ్యద ఉండాల్సిన స్థానాన్ని ఆక్రమించింది. కుడి చెయ్యి కిందకి జారిపోయి గాలికి మెలికలు తిరుగుతున్న పైటకొంగుని అందుకుంది. ఇదంతా లిప్త పాటు కాలంలో జరిగిపోయింది.

సిగ్గుతో ఇంకా రెప్పలు దించుకునే ఉన్న ఇలలో ఆలోచన వెన్నెల్లో కలువ మొగ్గలా వికసిస్తోంది. అంటే... అంటే... గాలి తాకిడికి పైట తొలగిపోయిన విషయాన్నీ , తన వక్షభాగం అనాచ్ఛాదితంగా ఉన్న విషయాన్నీ గమనించే స్థితిని దాటిపోయి, ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయింది తను. అంత అందగాడా అతడు ? ఇలా అంతరంగంలో పుట్టిన ఆ ప్రశ్నకు అంతరంగంలోనే సమాధానం దృశ్య రూపంలో లభించింది. ఇంకా కిందికి వాలి ఉన్న రెప్పల వెనక తను ఇందాకా చూసిన ఆ యువకుడి సమ్మోహనాకారం ప్రత్యక్షమైంది ! తన అంతరంగం మీదికి చేరిపోయి కనిపిస్తున్న ఆ యువకుణ్ణి అలాగే 'లో' చూపుతో చూస్తూ ఉండిపోయింది ఇల.


తాను నిలుచున్న రెండు పొదరిండ్ల మధ్య అందమైన యవ్వన వృక్షంలో ఉన్న యువకుడు ప్రకృతి నేపథ్యంలో తన ముందు నిలుచున్న ఆ యువతిని చూస్తూ. ఉండిపోయాడు. ఆమె నిసర్గ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ణి చేసి వేసింది. బంగారు తీగను గుర్తుకు తెచ్చే శరీరం... పూర్తిగా వికసించిన పద్మంలాంటి ముఖం ! కలువరేకుల్లాంటి అందమైన విశాల నేత్రాలు... ఊహూ... అవి నేత్రాలు కావు , ఎదుటి వారి మీద కాంతి కిరణాల్ని రువ్వే జ్యోతులు ! పగడాల్లాంటి పెదవులు. అవి కదిలినప్పుడల్లా తొంగి చూస్తున్న ముత్యాల్లాంటి పళ్ళు ! ఆమె సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్న ఆ పైట... ఆమె అందాన్ని తన చర్మచక్షువులకు కనిపించకుండా దాచగలిగింది కానీ , తన అంతర్నేత్రాల నుంచి , ఇంకా ఆ అయస్కాంత సౌందర్యాన్ని దర్శిస్తున్న తన అంతర్నేత్రాల నుండి దాచలేకపోతోంది !


ఈ నడుస్తున్న సౌందర్యం ఎక్కడిది ? ఎక్కణ్ణుంచి వచ్చింది ? ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేకా , ఆమెను అడగలేకా సతమతమనుతున్న యువకుడు తనకు తెలీకుండానే ముందుకు సాగాడు. అతని కదలిక కోసమే కాచుకున్నట్టు , ఆమె కూడా ముందుకు అడుగులు వేసింది. ఇద్దరూ ఒకర్ని దాటి ఒకరు ముందుకు వెళ్ళిపోయారు.


ఏదో అజ్ఞాత సంకేతాన్ని అందుకున్న వాళ్ళలాగా ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగారు. ఒకరికొకరు అభిముఖంగా నిలుచున్నారు. ఇద్దరి ప్రయత్నమూ లేకుండానే , ఇద్దరి కళ్ళూ తమ భాషలో పలకరించుకుంటున్నాయి. ఆ 'నేత్రభాష' పెదవులను స్పందింప జేస్తోంది. రెచ్చగొట్టుతోంది.


*“నా పేరు... బుధుడు...”* యువకుడు ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు *“నువ్వు...”*


*"నా పేరు... ఇల...”.*


*"నేను చంద్రుడి పుత్రుణ్ణి. తారాదేవి నా తల్లి. నేను ఈ దగ్గర్లోని ఆశ్రమంలో నివసిస్తున్నాను. నువ్వు..."* బుధుడు రెండు అక్షరాలతో ప్రశ్నను పూర్తి చేశాడు.


*“నాకు... నాకు... ఎవ్వరూ లేరు...”* తన గతం గురించి , పురుష జన్మ గురించి , పార్వతి శాపం గురించి చెప్పాలనిపించడంలేదు ఇలకు. ఆ అందగాడికి భయాందోళనలూ , సందేహాలూ కలిగించే నిజాలేవీ చెప్పకూడదనిపిస్తోంది. చెప్తే , తనకు... దూరమైపోతాడేమో ! ఇల తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. ఇప్పుడు దగ్గరయ్యాడా దూరం కావడానికి ?!


*"సూర్యాస్తమయం కావస్తోంది. అరణ్యం క్షేమకరం కాదు. నా ఆశ్రమంలో... విశ్రాంతి తీసుకోవచ్చు...”* బుధుడు ఆహ్వాన సూచకంగా అన్నాడు.


*“సరే..."* ఇలా అసంకల్పితంగా అంది. 


బుధుడు వెనుదిరి , తన ఆశ్రమం వైపు దారి తీశాడు. తనను వేటాడుతున్న ఇల కళ్ళను చూశాక అతను వేట గురించి , వేటగాళ్ళ గురించి మరచి పోయాడు.

కామెంట్‌లు లేవు: