*శరణాగతి ఫలితం..*
కొన్ని సంవత్సరాల క్రిందట ఆశ్వీయుజ మాసం లో దీపావళి పండుగ కు ముందు శనివారం నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వాడ మధ్యాహ్నం మూడు గంటల నుంచీ వర్షం కురవడం మొదలైంది..మరో అరగంటకల్లా..వాతావరణం పూర్తిగా మారిపోయి..కుండపోత వర్షం కురవసాగింది..మా సిబ్బంది నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఈరోజు పల్లకీసేవ జరపడం కష్టం..పల్లకీ తిరుగాడే దారి అంతా బురదగా మారిపోయింది..ఇంకో అరగంటకు ఎండ వచ్చినా..ఈ బురద ఆరిపోదు..అందువల్ల పల్లకీని మంటపం లోనే ఉంచి..కేవలం పూజ మాత్రమే చేద్దాము.." అన్నారు..అర్చకస్వాములు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు..పరిస్థితి కళ్లారా చూస్తున్నాను కనుక..నేను కూడా సరే అన్నాను..సాయంత్రం ఆరు గంటలకు వర్షం తగ్గింది.."ఈరోజు పల్లకీసేవ వద్ద అర్చన మాత్రమే జరుగుతుంది..పల్లకీని మందిరం చుట్టూరా త్రిప్పటం లేదు.." అని భక్తులకు మైక్ ద్వారా తెలియపరచమని మా సిబ్బందికి చెప్పాను..అదే విషయాన్ని వాళ్ళు మైక్ ద్వారా రెండు మూడు సార్లు చెప్పారు..
అదే సమయం లో మందిరం వద్దకు బస్సు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయకులైన ఓ భార్యా భర్తా వచ్చారు..ఇద్దరూ స్వామివారి మందిర ప్రాంగణం లోకి వచ్చి..మైక్ లో పల్లకీసేవ గురించి మా సిబ్బంది చెపుతున్న ప్రకటన విని..నిరుత్సాహానికి గురైనట్టు బాధపడుతూ..నేరుగా మా సిబ్బంది వద్దకు వెళ్లి.."ఈరోజు పల్లకీసేవ రద్దు చేసారా..? అందులో పాల్గొనాలి అని చాలా దూరం నుండి వచ్చాము.." అన్నారు..మా సిబ్బంది వాళ్లకు పరిస్థితి వివరించి..మందిరం వెలుపల దారి అంతా వర్షం కారణంగా బురదగా మారినందున..పల్లకీ తిరగడం సాధ్యం కానందున..అలా త్రిప్పటం ఆపేసామని..పల్లకీ వద్ద అర్చన మాత్రం మందిరం లో జరుపుతామని " చెప్పారు.. "అలాగా..." అని సాలోచనగా అన్నారు..కొద్దిసేపు ఆలోచించుకొని.."సరే..మేము అర్చన చేయించుకుంటాము..మా పేర్లు నమోదు చేయండి.." అన్నారు..వాళ్ళ పేర్లు మా సిబ్బంది నమోదు చేసుకున్నారు..చిత్రంగా..ఆరోజు పల్లకీసేవ వద్ద అర్చన చేయించుకోవడానికి ఆ దంపతులు తప్ప మరెవ్వరూ పేర్లు నమోదు చేసుకోలేదు..
ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు మా అర్చకస్వాములు పల్లకీ ని అలంకరించి..స్వామివారి సమాధికి ఎదురుగా ఉన్న ముఖమంటపం లో ఉంచారు..అప్పటికి వర్షం ఆగిపోయి దాదాపుగా రెండు గంటలు అవుతున్నది..మా సిబ్బందిని పిలిచి.."పల్లకీ వద్ద అర్చన అయిపోయిన తరువాత..మందిరం లోపలే..స్వామివారి గర్భాలయపు మందిరం చుట్టూ..శ్రీ సాయిబాబా మందిరం ముందునుంచి..ప్రదక్షిణగా పల్లకీని త్రిప్పుదామని అనుకుంటున్నాను..మీ అభిప్రాయం చెప్పండి.." అని మా సిబ్బందిని అర్చకస్వాములను అడిగాను.."అయ్యా..ఈరోజు గట్టిగా వందమంది భక్తులు కూడా లేరు..ఇక్కడే త్రిప్పుదాము.." అన్నారు..అందరమూ ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత..పల్లకీసేవ మొదలుపెట్టాము..ఆ దంపతులు అత్యంత భక్తిగా పల్లకీవద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..పల్లకీ ని స్వామివారి మందిరం లోపలి భాగం లోనే మూడు ప్రదక్షిణాలుగా త్రిప్పుతున్నాము అని చెప్పగానే..ఆ భార్యా భర్తల ముఖం లో సంతోషం వచ్చింది..అతను గబ గబ పల్లకీ ని ఒక వైపు తన భుజం మీద ఎత్తుకొనున్నాడు..మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోసి..హారతి కళ్లకద్దుకొని..తీర్ధ ప్రసాదాలు తీసుకొని ఇవతలికి వచ్చారు..వాళ్ళ ముఖాల్లో ఏదో తృప్తి ఉన్నది.."రేపుదయం ఎన్ని గంటలకు మేము మందిరం లో ఉండాలి..?" అని నన్ను అడిగారు..ఆదివారం ఉదయం ప్రభాతసేవ తాలూకు అభిషేక హారతుల గురించి చెప్పి..ప్రొద్దున్నే ఐదు గంటలకు రమ్మన్నాను..సరే అని వెళ్లిపోయారు..
ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి..స్వామివారి సమాధికి అర్చకస్వాములు నిర్వహించే అభిషేకము..హారతులను ఆ దంపతులు చూసారు..ఏడు గంటలకు స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..తమ గోత్రనామాలతో స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..నేరుగా నావద్దకు వచ్చి.."అయ్యా..మేము అనుకున్న విధంగా స్వామివారిని దర్శించుకొన్నాము..చాలా తృప్తిగా ఉంది..కొండంత సమస్యతో ఇక్కడికి వచ్చాము..మా సమస్యను స్వామివారి పాదాల వద్ద విన్నవించుకున్నాము..ఇక మాకు స్వామివారే దిక్కు.. మా సమస్య తీరిపోయి మేము ఒడ్డున పడితే..స్వామివారి వద్దకు మళ్లీ వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాము..శనివారం పల్లకీ సేవ..ఆదివారం ప్రభాత సేవ..రెండింటిలో పాల్గొని..మా శక్తికొద్దీ అన్నదానం చేస్తాము.." అన్నారు..స్వామివారి విభూతి గంధం ఉన్న పాకెట్లు ఐదు కొనుక్కున్నారు..వాళ్ళు ఎక్కడినుంచి వచ్చారో కూడా తెలుపలేదు..ఆ ఉదయం 10 గంటల బస్సులో వెళ్లిపోయారు.. ఆ తరువాత వాళ్ళ గురించి మర్చిపోయాము కూడా..
సరిగ్గా ఆరేడు నెలల తరువాత..శ్రీ స్వామివారి దత్తదీక్షా సమయం లో ఒక శనివారం మధ్యాహ్నం నాడు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..మందిరం లోపలికి వస్తూనే..నేరుగా మా దంపతులము కూర్చుని ఉన్న చోటుకి వచ్చారు..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.."అయ్యా..మేము గుర్తువున్నామా?..ఆరు నెల క్రితం ఇక్కడికి వచ్చాము..ఆరోజు వర్షం కారణంగా పల్లకీని మందిరం లోపలే త్రిప్పారు..మాకొక సమస్య ఉన్నది..తీరగానే స్వామివారి వద్దకు వస్తాము అని మీతో చెప్పి వెళ్ళాము.." అన్నారు..నాకు గుర్తుకు వచ్చింది..ఆ మాటే చెప్పాను.."అయ్యా..మా సమస్య తీరిపోయింది..స్వామివారే తీర్చారు..మేము నమ్మి ఇంతదూరం వచ్చాము..మా మొర ఈ స్వామివారు ఆలకించారు..ఇప్పుడు మా సమస్య చెపుతాము వినండి..గత పదేళ్లుగా మేము ఇళ్లు కట్టించి..అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాము..బాగా జరుగుతూ ఉన్నది..మొదట్లో మా శక్తిమేరకు ఒకటో రెండో ఇళ్లు కట్టించి అమ్ముకునే వాళ్ళం..సంవత్సరానికి ఓ పదిలక్షలు మిగిలేది..తరువాత ఎక్కువ కట్టించి అమ్ముకుంటే లాభాలు ఎక్కువుంటాయని ఆలోచన చేసి..అప్పుచేసి మరీ వ్యాపారం పెంచుకున్నాము.ఒకేసారి నాలుగు చోట్ల మొదలుపెట్టాము..ఇళ్లు పూర్తయ్యేనాటికి డిమాండ్ తగ్గిపోయింది..ఒక్కసారిగా పెట్టుబడి ఇరుక్కుపోయింది..మాకు దిక్కు తోచలేదు..మా ఇంట్లో ఉన్న బంగారం..చేతిలో ఉన్న డబ్బూ అన్నీ కరిగిపోయాయి..అప్పులకు వడ్డీ పెరిగింది..ఒకానొక స్థితిలో ఆత్మహత్యే శరణ్యం అనే స్థాయికి వెళ్లిపోయాము..ఆ సమయం లో ఈ స్వామివారి గురించి హైదరాబాద్ లోని నా మిత్రుడు చెప్పి..మమ్మల్ని బలవంతంగా ఇక్కడకు పంపాడు..స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మండి..మీకు మేలు జరుగుతుంది..అన్నాడండీ..అతని మాట మీద ఇక్కడకు వచ్చాము..స్వామివారిని శరణాగతి చెందిన రెండు నెలల్లోనే..పరిస్థితి మారిపోయింది..సగం ఇళ్ళు అమ్ముడుపోయాయి..ముందు అప్పులు తీర్చుకున్నాము..ఇప్పుడు మా పెట్టుబడి రావాలి..అదికూడా వస్తుంది..ఎందుకంటే ఇంకొన్ని ఇళ్లకు అగ్రిమెంట్ అయింది..ధైర్యం వచ్చింది..అంతా ఈ స్వామివారి కారుణ్యం మాత్రమే...ఒక్కటి మాత్రం నిజమండీ..ఈ స్వామివారికి శరణాగతి చెందితే..వెంటనే ఫలితం చూపిస్తారు..అందుకు మా జీవితాలే సాక్ష్యం.." అని ఉద్వేగంతో..ఇద్దరూ కళ్లనీళ్ళతో చెప్పుకొచ్చారు..
ఆ రోజు పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం ఉదయం ఇద్దరూ తలనీలాలు ఇచ్చారు..ఆ తరువాత స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి..దత్తదీక్ష రోజుల్లో జరిగే అన్నదానం గురించి తెలుసుకొని..రాబోయే శని ఆదివారాల్లో అన్నదానానికి అయ్యే వ్యయం ఇస్తామని చెప్పి..అంతేకాకుండా దత్తదీక్ష చేసే స్వాములకు మూడురోజుల అన్నప్రసాదానికి కూడా ఖర్చు తామే భరించి..ఐదు రోజులు నిద్ర చేసి..ప్రతిరోజూ స్వామివారి సమాధి దర్శించుకొని..తిరిగి వెళ్లారు..
స్వామివారు కారుణ్యమూర్తి అని మేము అందరితో చెపుతుంటాము..ఆ మాటను ఆ అవధూత దత్తాత్రేయుడు పదే పదే మాకు ఋజువు చేస్తూ మౌనంగా సమాధిలో కూర్చుని వుంటారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి