12, అక్టోబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


అల్లంత దూరంనుంచే నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ అరణ్యంలో

ఒంటరిగా ఎవరీ సౌందర్యరాశి అని ఆశ్చర్యపోయాడు. దగ్గరకు వచ్చి

కల్యాణీ! ఎవరునువ్వు? దేవతావనితవా? మానవాంగనవా? గంధర్వోరగకాంతామణివా? ఎవరి

అమ్మాయివి? రూపయౌవన విభూషితవై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావెందుకు? వివాహితవా?

కవ్యవా? చంద్రవదనా! నిజం చెప్పు. మధుకరచికురా! పెదవి కదుపు. మృగవయనా! ఈ సరోవరంలో

ఏమిటి తిలకిస్తున్నావు? తదేకదీక్షగా అటే చూస్తున్నావు ఏమిటి కారణం? హే కృశోదరి! హే మరాళాక్షి!

హే మదనమోహిని! నన్ను పతిగా వరించి మహారాజభోగాలు అనుభవించు.

(అధ్యాయం-28, శ్లోకాలు- 54)

తాళధ్వజుడు అనురక్తుడై పలవరించాడు. నేనూ క్షణకాలం ఆలోచించాను. మృదుమధురంగా

బదులు పలికాను.

హేరాజన్! నేనెవరి కూతురినో నాకే తెలియదు. తల్లిదండ్రులెవరో ఎక్కడ ఉంటారో తెలియదు.

ఎవరు నన్ను ఈ సరోవరతీరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలియదు. ఏమి చెయ్యాలో, ఎక్కడికి

వెళ్ళాలో, నా అదృష్టం ఎలాఉందో ఏమీ తోచక ఇలా నిలబడ్డాను. నిరాధారను. ఏమి చెయ్యాలా అని

ఆలోచిస్తున్నాను. దైవమే దిక్కు. ఎటు నడిపిస్తాడో? నువ్వు ధర్మజ్ఞుడివి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి

నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరూ లేరు. తండ్రిలేడు, తల్లిలేదు, ఇల్లు లేదు, వాకిలిలేదు,

బంధువులులేరు, చెలిమికత్తెలులేరు. ఒంటరిదానను, నీదానను.

నా పలుకులకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనస్సులో మన్మథుడు గిలిగింతలు

పెట్టాడు. వెంటనే భృత్యులను పిలిచి

బంగారుపల్లకీ సిద్ధం చెయ్యండి. పట్టువస్త్రాలు తెరలు కట్టండి. మెత్తని పరుపులు పరవండి.

బాలీసులు సర్దండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది. మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు.

.

కామెంట్‌లు లేవు: