శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
క్షణంలో నేను బంగారుపల్లకిలో ఉన్నాను. కుదుపు తెలియకుండా బోయీలు మోస్తున్నారు.
తాళధ్వజ రాజధానికి చేరుకున్నాను. ఒక శుభమూహూర్తాన నన్ను ఆ మహారాజు అగ్నిసాక్షిగా వివాహం
చేసుకున్నాడు. ఆ నిమిషంనుంచీ అతడికి ప్రాణాధికంగా ప్రియురాలిని అయ్యాను. సౌభాగ్యసుందరి అని
నామకరణం చేశాడు. అనుక్షణమూ అలాగే పిలిచేవాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతర భోగవిలాసాలతో
తాళధ్వజుడు రేయింబవళ్లు నాతోనే గడిపాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. కామకళారతుడై
కాలానికి కళ్ళెం వేశాడు. ఉద్యానాలలో సరోవరాలలో వాపీకూపతటాకాలలో గిరికందరాలలో గిరిశిఖరాలలో
మహాసౌధాలలో వారుణీమదమత్తుడై నాతో శృంగారకేళీవిలాసాలలో తెలియాడాడు.
వ్యాసమహర్షి! నిజం చెబుతున్నాను. నేనూ అలాగే తన్మయం చెందాను. క్రీడా
రసవశీకృతమయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరంగానీ పురుషరూపంగానీ మునిజన్మగానీ ఏమీ
జ్ఞాపకం రాలేదు. అతడు నా పతి. నేనతడి పత్నిని. పట్టమహిషిని. విలాసాలు తెలిసిన ప్రియవల్లభను,
జీవితం సఫలమయ్యింది. యౌవనవతిత్వం చరితార్ధమయ్యింది.
పన్నెండు సంవత్సరాలకాలం క్షణంలా గడిచిపోయింది. నేను గర్భం ధరించాను. రాజుగారి
ఆనందం అవధులుదాటింది. వేదవిప్రులను రావించి యథావిధిగా గర్భసంస్కారకర్మలు జరిపించాడు.
నా మనస్సు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. గర్భిణులకు రకరకాల
కోరికలు పుడతాయిట, దాపరికం లేకండా అడుగు. నీ కోరిక ఏదైనా సరే తీరుస్తాను అంటూ రోజూ ప్రేమగా
నిర్బంధించేవాడు తాళధ్వజమహారాజు. కానీ సిగ్గుతో ఏనాడూ ఏదీ నేను అడగనేలేదు. పదివెలలూ
నిండాయి. పండంటి కొడుకు పుట్టాడు. గ్రహనక్షత్రతారాలగ్న బలాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి.
రాజూ నేనూ ఎంతగానో సంతోషించాం. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. జాత కర్మలు మహావైభవంగా
జరిపించాడు. వీరవర్మ అని నామకరణం చేశాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి