5, అక్టోబర్ 2023, గురువారం

సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల

 ॐ   కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల 


అది 1972 వ సంవత్సరం 


తమిళనాడు లోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు.వారు పేర్లు పళనివేల్ , తారక మణి.ఇద్దరూ జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు.


పెళ్లినా ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగని కారణం చేత పళనివేల్ తల్లిదండ్రులు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతాన బిక్షను ప్రసాదించమని మ్రొక్కుకున్నారు.వారు అలా మ్రొక్కుకుని ముడుపు కట్టిన సంవత్సరం లోపే వారికి పండంటి మగ శిశువు జన్మించాడు.సుబ్రహ్మణ్యుని వర ప్రసాదం వలన జన్మించినందుకు ఆ శిశువుకు పళని వేల్ అనే పేరు పెట్టారు.


పళని వేల్ కు చిన్నతనం నుండే దైవ భక్తి మెండుగా ఉండేది.ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేవాడు.వృత్తి పరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు.వ్యాపారంలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు.


తారక మణి అనే వ్యక్తితో పళని వేల్ కు చిన్నతనం నుండి మంచి స్నేహం ఉండేది.ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు.తారక మణికి కూడా దైవభక్తి ఎక్కువే.


ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తారక మణి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి తనకున్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు.తన స్నేహితుని కష్ట దశను అర్ధం చేసుకున్న పళని వేల్ తారక మణిని పళని సుబ్రహ్మణ్య ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు.


తారక మణి ఆనందభాష్పాలతో తన స్నేహితుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కరించాడు.అడుగకుండానే సహాయపడిన నీ గొప్ప మనస్సుకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.నీ బాకీని తీర్చగాలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా ఋణపడే ఉంటాను అన్నాడు.


పళని వేల్ ఇలా అన్నాడు,ఇది అప్పు కానే కాదు,ఇందులో ఋణం అనే పదానికి చోటేలేదు.నా స్నేహితుని ఆపదలో ఆడుకోవడం నా కనేస ధర్మం.నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు అని.


ఇదంతా చూస్తున్న ఆ గుడి ఆవరణలో పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి వారితో ఇలా అన్నాడు.మీలాంటి స్నేహితులను నేను ఇంతవరకూ చూడలేదు.ఎటువంటి బంధాలనైన త్రుంచే ప్రమాదమైన పదార్ధం " ధనం ".


ధనం ప్రభావం వలన మనుషుల మనస్తత్వం మారిపోతుంది.పళని వేల్ గారూ, మీరు చేస్తున్న సహాయానికి ఒక " ప్రామిసరీ నోటు " వ్రాసుకుంటే ఇరువురికీ మంచిది కదా అన్నాడు.


అందుకు పళని వేల్,ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు,నా స్నేహితుని కష్టదశలో ఆడుకోవడం నా కనీస ధర్మం.ఇందులో ఋణ ప్రసక్తే లేదు అన్నాడు.


తారక మణికి పళని వేల్ వ్యక్తిత్వం అర్ధం అయ్యింది.తను వ్యాపారంలో లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళని వేల్ కు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే ఈ సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు.


అందుకు పళని వేల్,నువ్వు నాకు కనుకలు ఇస్తే నువ్వు సంతోష పడవచ్చు నిజమే కానీ నేను కూడా సంతోష పడాలంటే నువ్వు మరొక పని చేయాలి అన్నాడు.


అదేమిటంటే నువ్వు నాకు కానుకలు ఇచ్చేబదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకూ, ఆలయ అభివృద్ధికీ , స్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు , అన్నదానం కొరకు కర్చు పెట్టు నేను చాలా సంతోషిస్తాను అన్నాడు.అందుకు సంతోషంగా అంగీకరించాడు తారక మణి.


కొన్ని రోజులలోనే పళని వేల్ ఒక వర్తక నిమిత్తం విదేశాలకు వెళ్ళ వలసి వచ్చింది . తన స్నేహితుడు తారక మణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని,నీకు వ్యాపారంలో లాభాలు వస్తే వాటిలో కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి కర్చు చేయమని ఒకవేళ లాభాలు రాణి పక్షంలో తన ఇంట్లో వారిని అడిగి తీసుకుని ఆలయానికి కర్చు చేయమని చెప్పాడు.అలాగే అని అంగీకరించాడు తారక మణి.


పళని వేల్ విదేశాలకు వెళ్ళి ఆరు సంవత్సరాలకు తిరిగి స్వదేశం వచ్చాడు.తన స్నేహితుడు తారక మణిని కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు.అప్పటికే కోట్లు సంపాదించిన తారక మణి పళని వేల్ ను గుర్తు పట్టనట్లు ప్రవర్తించాడు.ధన మదంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్ధం చేసుకున్న పళని వేల్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఏమైనా కర్చు చేస్తున్నాడా అని వాకబు చేసాడు.


తారక మణి గత ఆరు సంవత్సరాలుగా ఆలయానికి ఏమి చేయలేదు అని , పళని వేల్ ఇంటి సభ్యులే కర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు.తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు , తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళని వేల్ అంతగా బాధపడలేదు కానీ దేవుడ్ని మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు.


మరొక్కసారి తారక మణిని కలుసుకుని దేవుడి సొత్తును దొంగిలించడం మంచిది కాదు,నువ్వు దేవుడికి చేయవలసిన కర్చును ఇప్పటికైనా చెల్లించు అని చెప్పాడు.అందుకు తారక మణి నేను దేవునికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు.


దేవుడిని సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు.సరే అయితే ఆ దేవుడ్నే వచ్చి నాకు చెప్పమను అప్పుడు చేస్తాను అన్నాడు.తారక మణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది,సరే కోర్టులోనే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు.


పళని వేల్ తరఫున వాదిస్తున్న వకీలు,మన దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవూ ,కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు.అందుకు పళని వేల్ ఈ సొత్తు దేవునిది,ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు.దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా,మన ప్రయత్నం మనం చేద్దాం , తుది నిర్ణయం ఆ దేవునికే వదిలేద్దాం అన్నాడు.


ఆ రోజు రాత్రి పళని వేల్ కు ఒక స్వప్నం వచ్చింది.ఆ స్వప్నంలో అతను పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు.స్వామిని దర్శించుకుని తన మనసులోని బాధను,తను స్నేహితుడు చేసిన మోసాన్ని,దేవుడ్ని కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలచుకుని బాధపడుతుండగా వెనుక నుండి," అయ్యా ఎలా ఉన్నారు , చాలా సంవత్సరాల తరువాత మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను,మీ వ్యాపారం ఎలా ఉంది , మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నడా ? " అని ప్రశ్నించాడు.


అప్పుడు గుర్తొచ్చింది పళని వేల్ కు,నువ్వు మురుగన్ కదా,చాలా సంవత్సరాలు అయ్యింది కదా కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను.నువ్వు ఎలా ఉన్నావు,ఎక్కడ ఉంటున్నావు,నా స్నేహితుడు నన్ను , దైవాన్ని కూడా మోసం చేసాడు.తను చేస్తాను అన్న సేవలేవి చేయలేదు,నన్ను కూడా ఎరుగనట్లు మాట్లాడుతునాడు.అందుకే కోర్టులో కేసు వేసాను.కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు,అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు.


అందుకు మురుగన్,మీరేమి దిగులు పడకండి,మీ దగ్గర నోటు లేకపోవచ్చు కానీ నేను ప్రత్యక్ష్య సాక్షిని కదా,నేను వచ్చి మీ తరఫున సాక్ష్యం చెబుతాను అన్నాడు.చాలా సంతోషం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు పళని వేల్.ఇక్కడు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్.


వెంటనే పళని వేల్ కు మెలకువ వచ్చింది.తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు.మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు.ఆశ్చర్యం , ఆనందం కలిగిన పళని వేల్ జరిగినదంతా చెప్పాడు.ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్యుని లీలే అని ఆనందించారు.


కోర్టులో కేసు విచారణకు వచ్చింది.అప్పుడు పళని వేల్ తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మురుగన్ ను చూసి భయపడిపోయాడు తారక మణి.మురుగన్ మాటను నమ్మిన కోర్టు తారక మణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావు వంతు స్వామి వారికీ ఇవ్వాలని తీర్పునిచ్చింది.


కోర్టు ఆవరణలో పళని వేల్ ను కలిసి తారక మణిని ఇలా అడిగాడు,ఈ మురుగన్ ఎలా వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు,నేను నమ్మలేకపోతున్నాను అని.అందుకు పళని వేల్ నీతో మాట్లాడి వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది అందులో నాకు మురుగన్ కనిపించాడు,తన చిరునామా చెప్పాడు,నేను ఉదయాన్నే తను చెప్పిన ఊరికి వెళ్లి చూసాను,అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు.తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను అన్నాడు.ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు.


అందుకు తారక మణి,అసలు ఈ మురుగన్ మూడు సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు.తను నీకు కలలో కనిపించడం,చిరునామా చెప్పడం,నువ్వు వెళ్లి నిజంగానే కలవడం,తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం అంతా విచిత్రంగా ఉంది.ఆ మురుగన్ ఎవరో కాదు సాక్షాతూ ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారే.నేను తప్పు చేశాను,కోర్ట్ చెప్పిన దానికి రెండింతలు స్వామి వారి చేల్లిస్తాను అన్నాడు.


అప్పుడు అందరికీ అర్ధం అయ్యింది నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని.ఇక్కడ సుబ్రహ్మణ్యుని పిలిస్తే పలుకుతాడు.


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .


దయచేసి అందరికీ షేర్ చేయండి 


అందరం " ఓం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం 


ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

కామెంట్‌లు లేవు: