ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు
మనకి ప్రకృతి అనేక రకాలు అయిన ఆహారపదార్థాలని మనకి ప్రసాదించింది. వాటిని సంపూర్ణంగా వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి .
అపథ్యం అని తెలిసీ ఒక పదార్థం రుచిగా ఉంది అని తినకూడదు. ఏది తినవలనో , ఏది తినకూడదో బాగుగా పరీక్షించి పదార్థాలను భుజించవలెను . ఆహారం వలన పుట్టిన ఈ శరీరం ఆహార వైషమ్యం వలన నశిస్తుంది. కావున ప్రతిదినం మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యం చెడిపోకుండా కొత్తగా ఏ రోగం రాకుండా చూసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం రక్షించబడుతుందో ఆ ఆహారాన్ని మనం సర్వదా తీసుకుంటూ ఉండాలి అని చరక మహర్షి వివరించారు .
మనలో చాలామంది ఆకుకూరలు తింటారు కాని వాటి యొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియదు . కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు అయా రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కూడ శరీరానికి పుష్కలంగా విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చు.
కొన్ని ముఖ్యమైన ఆకుకూరల గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను .
అవిసె ఆకు కూర -
* ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఎరుపు మరియు తెలుపు దీని పువ్వులనుబట్టి చెప్పవచ్చు.
* ఏకాదశి ఉపవాసం మొదలయిన ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా ఉపయోగిస్తారు . ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది.
* దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా ఉపయోగిస్తారు . గాయాలకు , దెబ్బలకు మంచి మందు.
* జలుబు , రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గును. లొపల నుంచి జలుబు నీరు రూపంలో కారిపోయి తలనొప్పి, బరువు తగ్గును.చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి వాడవలెను .
* పురిటిబిడ్డలలో పడిసెం ఎక్కువుగా ఉంటే రెండు చుక్కల అవిసె రసంలో 10 చుక్కల తేనె వేసి రంగరించి పాతకాలం లో వైద్యులు ఆ బిడ్డ ముక్కులలో వేలితో పైపైన రాస్తారు .
* ఈ అవిసె ఆకులు రుచికి కారంగా , కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది . ఈ మధ్య మార్కెట్లో అవిసె కారం దొరుకుతుంది దానిని పిల్లలు మరియు పెద్దలు విరివిగా వాడుకొనవలెను .
* సాలీడు , పులికోచ మున్నగు జంతువుల విషాన్ని కూడా ఈ ఆకురసం విరిచేస్తుంది.
* అవిసె ఆకుల రసం టాన్సిల్స్ కి పూస్తే అవి కరిగిపోతాయి.
* రేజీకటి రోగం కలవారు అవిసె ఆకులకూర వాడటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అవిసె ఆకులు దంచి ముఖ్యంగా రోట్లో కర్ర రోకలి వాడవలెను . ఆ దంచిన పిప్పిని కుండలో వేసి ఉడకపెట్టి రసం తీసి ఆ రసాన్ని 10ml లొపలికి తీసుకోవడం వలన రేజీకటి పుర్తిగా దూరం అగును.
* నాలుగు రోజులకు వచ్చే జ్వరానికి దీని ఆకురసం అయిదారు చుక్కలు ముక్కులలో వేసుకొని లొపలికి పీలిస్తే మంచి ప్రభావం కనిపించును.
* అవిసె ఆకు , మిరియాలు కలిపి నూరి రసం పిండి ఆ రసాన్ని ముక్కులలో వేస్తే అపస్మారంలో ఉన్న వ్యక్తి కోలుకుంటాడు.
* చిన్నపిల్లలో వచ్చే బాలపాప చిన్నెలకు ఇది అద్భుత ఔషదంగా పనిచేయును
* దీనిలో ఉన్న కారం మరియు చేదు ఉన్నను వండాక మధురంగా ఉండును.
* ఇది క్రిమి రహితం అయ్యి శరీరంలో మలిన పదార్థాలు మరియు మల పదార్థాలు బయటకి పంపును. దీనిని మనకంటే తమిళ సోదరులు ఎక్కువ వాడతారు.
కరివేపాకు -
* దీనిని రావణ , గిరి నింబిక , మహానింబ అని కూడా పిలుస్తారు .
* ఈ చెట్టుకు ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు పోస్తూ ఉంటే లేత కరివేపాకు చెట్లు ఏపుగా ఎదుగుతాయి.అదే విధంగా ముదురు చెట్లకు బియ్యం కడిగిన నీరు పోస్తే వాటి ఆకులు మంచి సువాసనలు వెదజల్లుతాయి .
* ఈ కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం మరియు వాతాన్ని పోగొడుతుంది.
* అగ్నిదీప్తి ఇస్తుంది.
* దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన గ్రహణి రోగం అనగా విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు తగ్గించును .
* ఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు మరియు దద్దుర్లకు ఉపయోగిస్తారు .
* కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాదిని కూడా నివారించును.
* కరివేపాకు , మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేపాకు కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి నోటి యెక్క అరుచిని పొగొట్టును.
కామంచి ఆకు కూర -
* దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గును. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పట్టును .
* శరీరం ఉబ్బుతో కూడి యున్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్బుతంగా పనిచేయును .
* ఎలుక కాటు సమయంలో ఈ ఆకుల రసం పైన రాయవలెను .
* ఈ కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరించును .
* ఔషదాలతో పాటు కుష్టు వ్యాధి కలవారు దీనికి కూడా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వేగంగా వస్తాయి.
కొత్తిమీర -
* ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము .
* వీటియొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును.
* కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి , అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది .
* కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది . విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది . భ్రమ ని తగ్గిస్తుంది . కొత్తిమీర మంచి జీర్ణకారి.
* కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి.లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరును .
* కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది.
* ప్రాచీన కాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలెను.
* నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయును .
* ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.
* దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచును.
* దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అగును.
కొత్తిమీర కారం తయారీ విధానం -
కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలని
తొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గును.
గమనిక -
గ్రహణి రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు.
గంగపాయల కూర -
* ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు , ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.
* దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగును .
* ఇది పాలకంటే మరియు వెన్నకంటే మంచిది .
* దీనిలో A ,B విటమినులు బాగా ఉన్నాయి .పాలకంటే , వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది . అదేవిధంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలో తెలిసింది.
* ఈ కూరలో ఐరన్ , కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. A విటమిన్ ఎక్కువ , B ,C D విటమినులు కొద్దిగా ఉన్నాయి.
* రక్తహీనత వ్యాధి కలవారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు.
* శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .
* మన శరీర ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే " క్షారశిల " అను మూల పదార్థం కావాలి ఈ పదార్థం గంగపాయల కూరతో దేహములోకి చేరును . ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం.
* సంగ్రహణి , కుష్టు , మూత్రాశయం లో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కూరని ఆహారం లో బాగం చేసుకోవాలి .
* వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును.
* రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధం గా పనిచేయును .
ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో బాగం చేసుకోవలెను .
గమనిక -
ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకును కావున ఇసుక , మట్టి ఎక్కువుగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి
దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచెసే గుణం కలిగినది.కావున ఎక్కువ తిన్నచో శరీరంలో శ్లేష్మమును పెంచును. కండ్లకు మరియు మూత్రపిండముల పై , తలలో నరములపై కొంచం ప్రభావం చూపించును. కావున 10 రోజులకు ఒకసారి తిన్నచో చాలును.
గుంటగలగర -
* దీనిని కేశరంజన , భృంగరాజ అని సంస్కృతంలో పిలుస్తారు .
* దీనిని పితృదేవతల అర్చనల్లో వాడుతారు.
* తేమగల ప్రదేశాలలో ఉంటుంది. లంక నేలల్లో శీతాకాలంలో పెరుగును .
* ఇది మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, పసుపు, నలుపు . నలుపు దొరకటం మహాకష్టం దీనిలో పసుపురంగు పువ్వులు పూసేది మంచి ప్రశస్తమైనది.
* దీనియొక్క రుచి కారం,చేదు కలిసి ఉంటుంది.
* దీనిని లోపలికి తీసుకోవడం వలన శరీరం నందలి కఫం మరియు వాతాన్ని పోగొడుతోంది
* దంతాలు , చర్మం వీనికి హితంగా ఉంటుంది. ఆయువుని , ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది.
* కుష్టువు, నేత్రరోగం , శిరోరోగం , వాపు , శరీరం యొక్క దురద నివారించును.
* హెర్నియా , ఆయాసం , పొట్టలోని క్రిములు , ఆమరోగం అనగా రుమాటిజం , పాండు రోగం అనగా భయంకరమైన రక్తక్షీణత , గుండెజబ్బు , చర్మరోగం వంటి వ్యాధులు హరించును .
* కొన్ని రకాల ఆకుకూరలు నేత్రాలకు చెడుచేస్తాయి అని అంటారు. కాని ఆకుకూరల్లో పొన్నగంటి కూర తరువాత నేత్రాలకు మేలుచేసేది గుంటగలగర కావున గుంటగలగరని ఉపయొగించవలెను .
* గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి.
* కేశాలువృద్ధి , మేధావృద్ధి ని కలుగచేస్తుంది.
* స్ప్లీన్ , కామెర్లు , సుఖఃరోగాల్లో దీనిని వాడటం వలన మంచి ఫలితం కనిపించును.
* గుంటగలగర ఆకు రసం మజ్జిగలో కలిపి తీసుకోవడం వలన పాముకాటు నుంచి కాపాడవచ్చు.
* ఎనిమిది చుక్కల తేనెలో రెండు చుక్కల గుంటగలగర ఆకు రసాన్ని వేసి పురిటి బిడ్డల జలుబురోగాల్లో వాడతారు.
* కడుపులో నులిపురుగులు ఉన్నాయి అని అనుమానం వచ్చినపుడు ఆముదంతో ఈ ఆకుపసరు కలిపి పుచ్చుకోవడం మంచిది .
* చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు.
* ఈ ఆకులు ముద్దగా నూరి తేలు కుట్టినచోట వేస్తే విషం విరుగును.
* చర్మరోగాల్లో ఈ ఆకుపసరు బాగా పనిచేస్తుంది .
* గుంటగలగర ఆకుల పొగని కాని , ఆ ఆకులు వేసి కాచిన నీటి ఆవిరి కాని గుదముకు పట్టించిన మూలశంక రోగం తగ్గును.
* గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది .
గుంటగలగర ఉపయోగించు విధానం -
దీనిని తరచుగా కూరగా, పచ్చడిగా ఉపయోగించడం మంచిది . తియ్యకూరగా కాని , పులుసుకూరగా కాని వండుకోవచ్చు. గుంటగలగర ఆకువేయించి చేసిన పచ్చడికి
కొంతవరకు గోంగూర పచ్చడి రుచి వస్తుంది.
గుంటగలగర ఆకులో ఇనుము ఎక్కువుగా ఉంటుంది. దీనిని లోపలికి తరచుగా తీసుకోవడం వలన శరీరానికి ఇనుము చక్కగా అందును. మరియు నేత్రాలకు చల్లదనం , కేశాలకు వృద్ది కలుగును.
గోంగూర -
వెల్లులి బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా ?
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా !
పైన చెప్పిన పద్యం గువ్వలచెన్న శతకంలోనిది. దీనిలో ఆ కవి వర్ణించిన తీరు చూస్తుంటే తెలుస్తుంది . గొంగూర యొక్క గొప్పతనం . ఇప్పుడు మీకు దానిలోని పోషక విలువలు మీకు తెలియచేస్తాను.
* దీనిని సంస్కృతంలో పీలు , గుచ్ఛఫల , ఉష్ణప్రియ అని కూడా పిలుస్తారు .
* ఆకుకూరలలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది.
* ఈ ఆకుల్లో రాగి ఎక్కువ ఉంటుంది.
* దీనిలో పోటాష్ కూడా ఉంటుంది.
* ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గోంగూరని వేడిని కలుగజేసేదిగా పేర్కొన్నది. బలం కలుగచేసే ఆకుకూర గా తెలియచేశారు .
* రక్తపిత్తవ్యాధి అనగా నోటినుంచి రక్తం పడువ్యాధిని హరించును .
* శరీరంలోపలి గడ్డలు , మూలవ్యాధి , స్ప్లీన్ సంబంధ సమస్యల ను నివారించవచ్చు.
* వాతం , కఫం ఉన్నవారు దీనిని లొపలికి తీసుకోవలెను .
* ఇది మంచిరసాయనం .
* ఈ గోంగూరలో నాలుగు రకాలు ఉన్నాయి.
గొంగూరలో పుల్లగోంగూర , ఎర్ర గోంగూర , తెల్ల గోంగూర దీనిని దేశివాళి గోంగూర అని కూడా అంటారు. మరొక రకం ధనాసర గోగు అని 4 రకాలు ఉన్నాయి.
* పుల్లగోంగూర కాయలు ఎర్రగాకాని , తెల్లగా కాని ఉంటాయి. పుల్లగోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు .
* ఎర్రగోగు చెట్టు కాడలు బూడిద రంగుతో కలిసిన పచ్చని రంగుతో ఉంటాయి.
* తెల్లగోంగూర సర్వసామాన్యమైనది. దీనిని నాటు గోంగూర లేదా దేశివాళి గోంగూర అని కూడా అంటారు.
* ధనాసర గోంగూర విదేశీది మలేసియా దేశం లోని తర్నాసరి రాష్ట్రం నుంచి వచ్చింది. తర్వాత దాని పేరు ధనాసరి గా క్రమంగా మారింది. ఇది మంచి పథ్యకరమైనది . బాలింతరాళ్ళకి కూడా పెట్టవచ్చు.
* పైర గోంగూర అని ఇంకోరకం కూడా ఉన్నది. దీన్ని శీతాకాలంలో సాగుచేస్తారు . ఇది మిగిలిన గోంగూరల కంటే మంచి రుచిగా ఉంటుంది. పచ్చజొన్న , పైరగోంగూర రెండు శ్రేష్టం అయినవని సామెత .
* నువ్వుల చేలో పండిన గోంగూర అంత పథ్యకరం కానిది అని వైద్యులు చెప్తారు .
* గుంటూరు జిల్లాలో పెరిగే గోంగూర చాలా రుచిగా ఉంటుంది. దీని ఆకుతో పులుసు , పచ్చడి చేసుకుంటారు .
* గుంటూరు జిల్లాలో దీనిని నిలువ పచ్చడిగా పెడతారు.
నిలువపచ్చడి పెట్టే విధానం -
నిలువ పచ్చడి పెట్టడానికి పైర గోంగూర వేయించాలి . కావాలిసిన ఉప్పు చేర్చి ముందు ఒకసారి తొక్కాలి. ఆ తరువాత పండు మిరపకాయలు కొద్దిగా పసుపు చేర్చి మరలా తొక్కాలి . తరువాత గిన్నెలోకి తీసుకుని ఊరనివ్వాలి .
* సంవత్సరానికి పైగా ఊరిన ఈ పచ్చడి చాలా పథ్యకరం అయినది. పైన చెప్పిన పచ్చడి నూనెతో కూడా చేయవచ్చు . కాని పైన చెప్పినవలె నూనె కలిపితే పథ్యకరం కాదు.
* గోంగూర మంచి బలకారం అయిన శాకం . అందుకే గొంగూర పచ్చడి కోడి మాంసంతో సమానం అయినది అని చెప్తారు .
* రేజీకటి రోగం కలవారు ఈ కూర చాలా మేలు చేయును .
* గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి అని చెప్తారు .
* మేహ సంభందమైన వ్రణాలు కు గోంగూర ఆకు ఉడికించి కడితే మేహవ్రణాలు పక్వానికి వస్తాయి.
* గోంగూర నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి.
* బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.
* గేదల లేగదూడలకు నాలుగయిదు గోంగూర ఆకులు పెట్టడం వలన మల సమస్య తీరి ఆరోగ్యంగా ఎదుగుతాయి.
* గోంగూరని ఎక్కువ ఉడికించడం వలన మరియు కుక్కర్లలో ఉడికించడం వలన దానిలోని జీవపోషకాలు నశిస్తాయి.
గమనిక -
ఈ గోంగూరని ఎక్కువుగా వాడరాదు . శరీరంలో వేడిని పెంచును. మరియు మలబద్దకం సమస్య పెంచును.
చక్రవర్తి కూర -
* దీనిని సంస్కృతంలో వాస్తుక , శాకపత్ర , కంబీరా , ప్రసాదక అనే పేర్లతో పిలుస్తారు .
* ఇది తొందరగా జీర్ణం అవుతుంది. రుచిగా ఉంటుంది.
* శుక్రవృద్ధిని కలిగి ఉండి , శరీరంలో తొందరగా వ్యాపిస్తుంది.
* స్ప్లీన్ , రక్తంలో దోషం , పిత్తం అనగా శరీరంలో వేడి తగ్గించును .
* మూలవ్యాధి , కడుపులో నులిపురుగులు , త్రిదోషాలు వీటిని పోగొట్టును .
* ఇది మధురంగాను మరియు కొంచం ఉప్పగాను ఉంటుంది.
* మలమూత్ర సమస్యలని నివారిస్తుంది.
* ఈ కూర బుద్ధిబలాన్ని పెంచును.
* ఆకలి పుట్టిస్తుంది.
* కళ్ళకు మేలు చేయును .
* మలబద్దకం సమస్యని నివారించును.
* వాత పిత్త శ్లేష్మ దోషాలను నివారించడంలో దీనికిదే సాటి .
* చర్మరోగాలు ను పోగొడుతుంది .
గమనిక -
దీనిని ఎక్కువుగా తీసుకొన్నచో మలబద్దకం మరియు ఉష్ణాన్ని చేయును.
చామ ఆకు -
* చామ ఆకు కూర చాలా మంచిది . జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది .
* మూలశంక సమస్యతో బాధపడేవారు దీనిని లోపలికి తీసుకోవడం చాలా మంచిది
* ఈ ఆకుకూర మూత్రాన్ని బాగా జారిచేస్తుంది .
* అరుచి అనగా నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది.
* ఆకలి పుట్టిస్తుంది.
* ఈ చామ ఆకులను పులుసుకూరగా తినడం చాలా మంచిది .
* ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి.
* రక్తనాళాల నుంచి కారే రక్తం ఆగిపోతుంది.
గమనిక -
దీనిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో వాతం , శ్లేష్మంని కలిగించును.దీనికి పులుసు విరుగుడు కావున పులుసు కూర చేసుకోవడం వలన దీనిలో దుర్గుణాలు నశించును.
చింతాకు -
* కూరగాను , పచ్చడిగాను దీనిని ఉపయోగిస్తారు . దీని లేత చిగురుని చింతచిగురు అంటారు.
* ఈ చింతచిగురు హృదయానికి మేలు చేయును .
* ఇది వగరు మరియు పులుపు రసాలని కలిగి ఉంటుంది.
* రుచిని పుట్టిస్తుంది.
* బుద్ధికి మేలు చేయును .
* జీర్ణక్రియకు మేలు చేయును .
* కఫ మరియు వాతాలని అద్భుతంగా నిర్మూలించును.
* చింతచిగురు ఎక్కువుగా వేసవికాలంలో దొరకును. కాని ఒక ప్రక్రియ ద్వారా అకాలంలో కూడా చింతచిగురు పొందవచ్చు.
అకాలంలో చింత చెట్టు చిగురించేలా చేసే ప్రక్రియ -
మనం ఏ చెట్టుకి అయితే అకాలంలో చింతచిగురు తెప్పించాలి అనుకుంటున్నామో ఆ చెట్టు కొమ్మ పాత ఆకులని రాలిపివేయాలి . ఆ తరువాత ఆ కొమ్మకి సెగ బాగా తగిలేలా అక్కడ తాటాకు మంట వేయాలి . ఈ విధంగా చేసిన వారం పదిరోజుల్లో ఆ చెట్టుకి బాగా చిగురు తొడుగును.ఇలా కొత్తగా వచ్చిన ఆకుతో పచ్చడి చేసుకుని తినవచ్చు
* చింతచిగురు శరీరానికి వేడిచేస్తుంది అనుకుంటారు . కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట విస్తారంగా పట్టును . చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదు.
* చింతచిగురు వాత వ్యాధులని , మూలరోగాన్ని , శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గించును .
* పైత్యం , వికారములు ను తగ్గించును .
* కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు.
* ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత కలదు. ఈ పొడికూర చాలా పథ్యకరమైనది మరియు తినదగినది.
* చింతాకు రసంలో పసుపు కలుపుకుని తాగితే మసూచికా వ్యాధి నివారణ అగును.
* మోకాళ్ళ వాపు తో చింతాకు ముద్దగా చేసి నీళ్లతో నూరి పట్టు వేయవచ్చు.
* మొండి వ్రణాలను చింతాకు కషాయంతో కడిగితే అవి త్వరగా నయం అవుతాయి.
* ఎర్రగా కాల్చిన ఇనుప గరిటె చింతాకు రసంలో ముంచి ఆ రసం వేడిగా ఉండగానే తాగితే అజీర్తి విరేచనాలు కట్టుకుంటాయి.
గమనిక - నేత్ర వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినరాదు. కొంచం జఠరాగ్నిని కూడా తగ్గించును .
చిర్రికూర -
* దీనిని సంస్కృతంలో మేఘనాధ , భండీర , విషఘ్న , కచర అని రకరకాల పేర్లతో పిలుస్తారు . దీనికి పథ్య శాకం అని పేరుకూడా కలదు . అనగా అన్ని రకాల వ్యాధుల్లో దీనిని ఉపయోగించవచ్చు అని అర్ధం .
* ఇది కొద్దిపాటి తేమగల ప్రదేశాలలో చిర్రికూర బయలుదేరి బాగా పెరుగును .
* ఇది చూడటానికి ముళ్లతోటకూరలా ఉంటుంది. కాని దానిలా ముళ్ళు ఉండవు.
* చిర్రికూరలో మూడురకాల జాతులు కలవు. చిర్రి , నీటి చిర్రి , చిన్న చిర్రి అనేవి కలవు. వైద్యగ్రంధాలలో మాత్రం నీటిచిర్రి గురించి వివరించబడి ఉంది. కాని వంటకాలలో ఉపయోగిస్తున్నట్టు ఎక్కడా కనపడదు.
* వైద్యగ్రంధాలలో వివరించినదాని ప్రకారం పిత్తాన్ని , కఫాన్ని , రక్తదోషాన్ని పోగొట్టును .
* మలమూత్రాన్ని బాగా బయటకి పంపిస్తుంది.
* నాలుకకు రుచిని పుట్టిస్తుంది.
* రక్తం కక్కే వ్యాధిని పోగొడుతుంది . శరీరంలో జఠరాగ్ని పెంచును.
* చిర్రికూర పాషాణాది విషాన్ని , సర్ప విషాన్ని మొదలయిన విషాలను హరిస్తుంది అని పేరు కలదు.
* విషంతో కూడిన రక్తాన్ని శుభ్రపరచడంలో దీనికి మంచి పేరు ఉంది.
* పెట్టుడు మందుల విషాన్ని పోగొట్టడానికి
చిర్రికూర వండిపెడతారు.
* కందిపప్పు మొదలయిన పప్పుల్లో చేర్చి ముద్దకూరగా , లేదా పొడికూరగా వండవచ్చు.
* ఈ కూర బాగా ఆకలి కలిగిస్తుంది.
* వాత, పిత్త, శ్లేష్మాలు అనే త్రిదోషాలను నివారిస్తుంది.
* కళ్ళజబ్బులు , మెదడు జబ్బులు కలవారికి ఇది మిక్కిలి హితకరం అయినది.
* ఈ కూరలో ఉక్కు లోహం ఉంది అని చెప్తారు .
* రక్తం కక్కుకునే వ్యాధుల్లో , గుండెజబ్బుల్లో చిర్రిఆకుకూర చాలా ఉపయోగికారిగా ఉంటుంది.
* ఈ కూర తినటం వలన అతిసార వ్యాధి తగ్గును.
చిలుకకూర -
* దీనిని "జలబ్రహ్మి" అని అంటారు.
* నదుల గట్టులు , చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూర పెరుగును .
* ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. మరియు నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.
* దీనిలో రెండురకాల జాతులు కలవు. ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు .
* ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది.
* శరీరంలో జఠరాగ్ని పెంచును.
* స్ప్లీన్ , రక్తదోషం , త్రిదోషాలు , శరీర అంతర్భాగంలో గల క్రిములను హరించును .
* తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరించును . జ్వరంతో పాటు వచ్చే దోషాలని , త్రిదోషాలని హరించును .
* ఇది రుచికి చేదుగా ఉంటుంది.
* ఇది మంచి విరేచనకారి.
* కడుపులో నులిపురుగులని హరిస్తుంది.
* కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో కలదు.
* శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.
* మూలవ్యాధుల్లో , గ్రహణి రోగం అనగా బంక విరేచనాలలో , ఉబ్బు రోగాల్లో , కడుపులో బల్లలు పెరిగే రోగాల్లో ఈ ఆకుకూర వాడవలెను.
* మసూచి వంటి వ్యాధుల్లో చిలుకకూరాకు రసంలో తెల్ల చందనం ముద్ద ను రంగరించి తాగితే ఆ రోగము తగ్గును.
చుక్క కూర -
* ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు.
* ఈ చుక్క ఆకులు దళసరిగా , పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.
* దీనిలో 2 రకాల జాతులు కలవు. అవి
చుక్కకూర , చిన్న చుక్కకూర .
* ఈ చుక్కకూర పుల్లగా , తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది.
* ఇది జఠరాగ్ని పెంచును.
* ఇది రుచిని పుట్టించును .
* కఫం , వాతం పోగొడుతోంది . పిత్తాన్ని కలిగిస్తుంది .
* గ్రహణి , మూలరోగం , అతిసారం , కుష్టువు వీనిని నశింపచేస్తుంది.
* మలబద్దకం ని తొలగించి సుఖవిరేచనం కలిగించును.
* నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది.అది కఫ సంబంధమైన సమస్య ఆ సమస్యకి చుక్కకూర తరచుగా తీసుకోవడం వలన సమస్యకి అద్బుతంగా పనిచేయును .
* వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేయును .
* వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేయును .
* జీర్ణకోశంలో ఏర్పడే మంటని , వేడిని ఇది తగ్గించును .
* పైత్యం అధికం అవ్వడం వలన కలిగే విరేచనాలని , రక్తంతో కూడియున్న బంక విరేచనాలని తగ్గించడంలో చుక్కకూర చాలా అద్బుతంగా పనిచేస్తుంది .
* మూలరోగాలు , గుల్మాలు , క్షయలు , మేహవ్యాధులు మొదలయిన వ్యాధుల్లో ఈ కూరని ఉపయోగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
* గుండెజబ్బులు కలవారు , ఆమవాతం , గుండెల్లో నొప్పిని తగ్గించును .
* విషాదోషాలు పొగొట్టును.
* బుద్దికి చలువచేయును .
* శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది .
* మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చూస్తుంది.
* పక్వము అవ్వని గట్టిగా ఉండే వ్రణాల పైన చుక్క ఆకు వేసి కడితే మంచి గుణకారిగా ఉంటుంది.
* చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అగును.
* తెలంగాణా ఏరియాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.
చెంచలి కూర -
* ఏ ఆకు కూరలు దొరకని ఆషాడ మాసంలో ఈ ఆకుకూర దొరుకుతుంది .
* ఎందుకనో ప్రజలు దీనిగురించి ఎక్కువ పట్టించుకోరు.
* దీనిలో చెంచలికూర, నీరు చెంచలి కూర అని రెండురకాలు కలవు. సాదారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు.
* ఇది మలాన్ని గట్టిపరుస్తుంది.
* మేహాంని , త్రిదోషాన్ని పోగోట్టును .
తమలపాకు -
* దీన్ని సంస్కృతంలో భక్ష్యపత్రి అంటారు.
* భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉన్నది.
* తమలపాకు ని సంస్కృతంలో తాంబూల వల్లి , నాగవల్లరి అని కూడా పిలుస్తారు .
* వానాకాలం వచ్చే తమలపాకులు దళసరిగా , పెద్దగా ఉంటాయి. ఎండాకాలం వచ్చే ఆకులు పలచగా కొద్దిగా ఉంటాయి. వానకాలం తమలపాకుల కంటే ఎండాకాలం వచ్చే తమలపాకులు ఎక్కువ రుచిగా ఉంటాయి.
* తమలపాకులు శరీరాన్ని శోధనం చేస్తాయి.అనగా శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి.
* రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి.
* వగరు , చేదు , ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి. శ్లేష్మాన్ని , నోటికంపుని , బడలికని పోగొట్టును .
* మిగిలిన ఆకుకూరలు చెట్టు నుంచి కోసిన తరువాత ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది . కాని తమలపాకు విషయంలో దీనికి పూర్తి వ్యతిరేకం . చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో మరియు జడంగా ఉంటాయి.
* దోషయుతమైన తమలపాకులు వాడటం వలన వాంతులు , మలం స్థంభించుట , నాలిక రుచి లేకుండా పోవడం . దాహం వేయడం , రక్తదోషం వంటి సమస్యలు సంభంవించును.
* పండిన తమలపాకులు రుచిలో అత్యుత్తమంగా ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి .
* భోజనం చేసుకున్నాక తాంబూలం వేసుకోవడం వలన మంచి జీర్ణశక్తి పెరుగును .
* తమలపాకులు అతిగా తినటం వల్ల వచ్చే భుక్తాయాసాన్ని నివారించును.
* నోటి దుర్వాసన పోగొట్టును
* తమలపాకులు వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి .
* వాత , కఫాలని హరిస్తాయి.
* కంఠస్వరాన్ని బాగుచేస్తాయి.
* తమలపాకులు పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు . బాలింతలు కూడా తీసుకోవచ్చు .
* పత్తిచెట్టు వేరు , తమలపాకు రసంతో నూరి ముద్దచేసి ఉపయొగిస్తే వజ్రం కూడా భస్మం అగును.
* ఇంతగొప్ప లక్షణాలు ఉన్నను తాంబూలం మితిమీరి సేవించరాదు . సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి.
* తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది.
* భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే , వాంతి చేసుకున్న వెంటనే , నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోరాదు.
* వెలగపండు , పుల్లనిపండ్లు , పనసతొనలు , అరటిపండ్లు , చెరకు గఢ , కొబ్బరికాయ , పాలు , నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్తతుల్లో తినరాదు.
* తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.
తొటకూర -
* తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గును. శరీరంలో ఉన్న అతివేడిని తగ్గించి శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది.
* ఋషిపంచమి వంటి పుణ్యదినాల్లో మరియు వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం .
* తోటకూర మూడు లేక మూడున్నర అడుగుల వరకు ఎదిగే చిన్నమొక్క . తోటకూరని ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు.
* విత్తనం మొలకెత్తి మూడో ఆకు వేసేదాకా తోటకూరవిత్తనాలు చల్లిన మళ్ల మీద అరటిసోరగు కాని ఎండు కొబ్బరిఆకులు కాని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన పక్షుల నుంచి విత్తనాలను కాపాడవచ్చు.
* మడిలో విత్తులు ఒత్తుగా చల్లడమే మంచిది . లేతగా ఉండగానే నడుమనడుమ కొన్ని మొక్కలని పీకేస్తూ కూరకు ఉపయోగిస్తుంటే ఉన్న మొక్కలు ముదిరి బాగా కాస్తాయి. ఇలా ముదిరిన మొక్కల కాడలు కూరకి మరియు పులుసుకి పనికివస్తాయి.
* తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి.
పెరుగుతోటకూర , కొయ్యతోటకూర , చిలుకతోటకూర , ఎర్రతోటకూర , ముళ్లతోటకూర మెదలైనవి.
* కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది.కాబట్టే దీనిని బాలింతలకు , నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడవలెను . వాతత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఉష్ణశరీరం కలవారికి గుండెలో నొప్పి , కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు.
* ముళ్లతోటకూర ఆకులని పప్పుకూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.
* ఈ మొక్కల్ని తెచ్చి ఎండించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని బట్టలసోడాకు బదులుగా చాకలివారు వాడతారు. దీనికి కారణం ముళ్లతోటకూరలో క్షారపదార్థం విస్తరించి ఉందని తెలుస్తుంది.
* సోడాపెట్టి ఉతికిన బట్టలు కంటే ముళ్లతోటకూర బూడిద పెట్టి ఉతికే బట్టలు చాలారోజులు మన్నుతాయి. మరియు సోడా పెట్టిన వాటికంటే ఇవి శుభ్రముగా ఉంటాయి.
* చిలకతోటకూర పెరళ్ళలో బాగా ఎదుగును. పెరుగుతోటకూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది.
* అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తల పరిశోధనలలో కనుగొనబడినది.
* ఇది పుల్లకూరగా , తీయకూరగా, పప్పుకూరగా , పులుసుగా వండుకుంటారు.
దోసకాయ ఆకు కూర -
* మనం దోసకాయలను ఆహారంగా తీసుకుంటాం కాని దోస ఆకు లో కూడా చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఇది లొపలికి కూరగా తీసుకొవడం వలన మలమూత్రాలను జారీచేస్తుంది.
* పైత్యం పెరగటం వలన బ్రాంతి తగ్గును.
పుదీనా ఆకు -
* నోటియొక్క అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి చేసుకుని తినవలెను . పుదీనా ఆకులు , ఖర్జురపు కాయలు , మిరియాలు , సైన్ధవ లవణం , ద్రాక్షా మొదలయిన పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు
* పుదీనా ఆకుని నేతితో వేయించి కాని పచ్చిది కాని నూరి పచ్చి మిరపకాయలు , ఉప్పు చేర్చి నూరి నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.
* జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది . వారికి ఈ పచ్చడి అద్బుతంగా ఉంటుంది.
* గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.
* పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలు కు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అగును.
* అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది .
పొన్నగంటి ఆకు కూర -
* ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోంది .
* ఇది మలాన్ని గట్టిపరుస్తుంది. శీతలంగా ఉంటుంది.
* కుష్టు వ్యాధి , రక్తదోషం , కఫం , వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది .
* జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం , వాంతి , అరుచి వీనిని పోగొడుతుంది.
* హృదయానికి మేలు చేస్తుంది.
* ఇది చలువచేయును . జ్వరతాపాలను , అతిదాహం తగ్గిస్తుంది .
* ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి.
* మూలవ్యాధుల్లో కూడా పొన్నగంటికూర చాలా బాగా పనిచేస్తుంది
* వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిది .
* పొన్నగంటిఆకు రక్తదోషాలను మరియు కుష్టురోగాలను నయం చేస్తుంది.
మునగాకు -
* ఆషాడ మాసంలో మునగాకు కూర తినవలెను అని పెద్దలు చెపుతారు.
* మునగాకులో 5 ,000 యూనిట్ల A విటమిన్ ఉంది . అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .
* మలాన్ని గట్టిపరుస్తుంది.
* జఠరాగ్నిని పెంచును.
* కఫాన్ని , వాతాన్ని హరించును .
* శరీరంకు వేడిచేయును . రక్తములో వేడి పెంచును కావున తక్కువ తీసుకోవడం మంచిది .
* మునగాకుని పప్పులో వేసి ముద్దకూరగా కాని పొడికూరగా కాని వండుకోవచ్చు .
* ఈ కూర దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది అని చెబుతారు.
* శరీరంలో చెడ్డ నీరు తొలగించుటకు మునగాకు కూర చాలాబాగా పనిచేస్తుంది .
* వేడిశరీరం కలవారు ఈ మునగాకుని వాడకుండా ఉంటే మంచిది .
* స్త్రీ ముట్టులో ఉన్నప్పుడు మునగాకు కూర పెట్టడం చాలా మంచిది . దీనికి కారణం స్త్రీలు ముట్టులో ఉన్నప్పుడు శరీరంలో వాతం ఎక్కువుగా ఉండును. ఈ సమయంలో మునగాకు తినిపించడం వలన వాతం హరించును .
మెంతి ఆకు -
* ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగును.
* నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.
* మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడు కాని , ఎండపెట్టి వరుగు చేసి కాని ఉపయోగించుకోవచ్చు.
* రక్తపిత్తం , అగ్నిదీప్తి , మలాన్ని బందించును., బలాన్ని కలిగించును.
* జ్వరం , వాంతి , వాతరక్తం , కఫం , దగ్గు , వాయువు అనగా వాతం , మూత్రరోగం , క్రిమి , క్షయ , శుక్రం వీటిని నశింపచేస్తుంది.
* ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు , వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.
* ఈ మెంతిఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి.వెంట్రుకలు రాలే జబ్బు తగ్గును.
* మెంతికూర స్త్రీల గర్భాశయాన్ని బాగుపరచడంలో ఋతుస్రావాన్ని సుష్టుచేయడంలో మెంతికూర బాగా పనిచేయును .
* ఈ మెంతిఆకుల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడంలో పులుసు వస్తువులు వాడవలెను.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి