24, జనవరి 2024, బుధవారం

స్ఫూర్తిదాయకమైన సందేశం

 *ॐ   అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం - బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ*


    శ్రీరామమందిరం ద్వారా, జాతికి శాశ్వతంగా స్ఫూర్తిదాయకమైన సందేశం అందితే, 

    రామరాజ్య స్థాపనకి మార్గం సుగమమం అవుతుంది. 

   "రామమందిరం" చిహ్నంగా, దాన్ని భావితరాలు, కాపాడుకొంటాయి. 

    రామరాజ్యం రావాలంటే, అయోధ్య కేంద్రంగా శ్రీరాముని రాజ్యానికి సంబంధించిన వాటిపై, మనకి అవగాహన కలగాలి. 

    మనం తెలుసుకొంటున్న విషయాలలో కొన్ని 

      

*రామరాజ్యం - విషయ అవగాహన -8*


*అయోధ్య - మంత్రుల సమర్థత* 


    అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలనలో ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. 

ధృష్టి, 

జయంతుడు, 

విజయుడు, 

సిద్ధార్థుడు, 

అర్థసాధకుడు, 

అశోకుడు, 

మంత్రపాలుడు, 

సుమంత్రుడు. 


          *"ధృష్టి ర్జయంతో విజయ* 

           *స్సిద్ధార్థో హ్యర్థసాధకః I* 

           *అశోకో మంత్రపాలశ్చ* 

           *సుమంత్రశ్చాష్టమోఽభవత్ ॥"* 


* వారు తరువాత కూడా కొనసాగారు. రాజకీయ మార్పులు ఎలా ఉన్నా, వారు కొనసాగేవారు. 

   (ఇప్పటి IAS, IP, IFS, ... కార్యదర్శుల వ్యవస్థ అదే!) 


ఆ మంత్రులు (Secretaries), 


  - సమస్త వ్యవహారాలయందును సమర్థులు, 

  - తమ ప్రవర్తనకు సంబంధించి, రాజపరీక్షలలో నెగ్గినవారు, 


  - కోశాగారాన్ని నింపడానికై ధనాన్ని సమకుర్చడమందూ,

  - యోగ్యతలనుబట్టి వేతనాలను ఒసంగుచూ చతురంగ బలాలని సంరక్షించడమందూ 

    జాగరూకులై ఉండేవారు. 

 - జ్ఞానులకూ, రక్షణ వ్యవస్థ సిబ్బందికీ బాధ కలుగకుండా ధనాగారం నింపేవారు. 


  - శత్రువులనూ ఎదుర్కొనే వీరులు, 

  - సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు, 

  - అయినా, శత్రువు నిరపరాధియయితే అతనిని దండించేవారు కాదు. 

  - అపరాధం చేసినవారు తమ కుమారులైనా కూడా, నిష్పక్షపాతంగా దండించేవారు. 


  - అపరాధుల యొక్క దోషాల తారతమ్యాలనుబట్టీ, 

    వారి శక్తి సామర్థ్యములను బట్టీ, 

    అపరాధరుసుములను, దండనలను విధించేవారు. 


  - రాజనీతిని అనుసరించి, శాసనాలను ఆచరణలో ఉంచేవారు.  


    మంత్రులందరూ త్రికరణశుద్ధితో ఏకగ్రీవంగా రాజవ్యవహారాలను నడుపుచుండేవారు. 

*("శుచీనామ్ ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్")* 


    అర్హులై, నిజాయితీతో, స్వార్థరహితంగా, నిష్పక్షపాతంగా, పరిపాలనకు అందించే మంత్రాంగం, 

    ఏ దేశానికైనా, ఏ కాలంలోనైనా, అత్యంత ఆవశ్యకం కదా! 


    అయోధ్య కేంద్రంగా ఇక్ష్వాకు వంశీయుల ఆదర్శపాలనలో, 

    మంత్రుల భాగస్వామ్యం, 

    ఎంత ఆదర్శమైందో తెలియజేస్తూ, 


    మనం కూడా, ఆ విధంగా పొందవలసిన ఆవశ్యకత, ఎప్పటికీ గుర్తెరిగిస్తుంది కదా! 


                    జై శ్రీరామ్ 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: