28, ఫిబ్రవరి 2024, బుధవారం

నిష్కామ కర్మ*

 *నిష్కామ కర్మ*

                ➖➖➖✍️

*భగవంతుడు భగవద్గీత లో - ‘నిష్కామ కర్మ’ గూర్చి చెబుతారు, భగవద్ అనుగ్రహము కావాలంటే చాలా గ్రంధాలలో కూడా ఈ ‘నిష్కామ కర్మ’ గూర్చి ఉంది, నిష్కామ కర్మ వలన(ఫలితం ఆశించని) ఎటువంటి కర్మ ఫలము అంటదు...!*

*అదేంటో , ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకొందాము!!!*

       *ఒకానొక సమయములో, దూర్వాస మహర్షి యమునా నది దాటివచ్చి, భక్తితో గోపికలు సమర్పించిన ఫలములను, వాళ్ల సమక్షమున ఆరగించి, వారిని ఆశీర్వదించాడు.*

*ఇంతలో యమునా నది పొంగడం వలన, ఆ గోపికలు తిరిగి వెళ్ళే మార్గం లేక దూర్వాస మహర్షి సహాయాన్ని అర్ధించారు.*

*ఆ మహర్షి, వారితో యమునా నదిని ఈవిధంగా ప్రార్ధించమన్నాడు...*

*"ఓ యమునా మాతా! ఈ దూర్వాస మహర్షి ఈనాడు ఉపవాస దీక్ష పాటించి ఉండి నట్లయితే, దయతో మాకు ఆవలి ఒడ్డుకు చేరే దారినియ్యి!" అని.*

*తమ ఎదుటే భుజించిన మహర్షి కి, ఉపవాస దీక్ష ఏమిటి? అనుకుని గోపికలు నిర్ఘాంత పోయారు!!...*

*అయినా మహర్షి మహిమ దృష్టి లో ఉంచుకుని, మారు మాట్లాడకుండా యమునను ఆ విధంగా ప్రార్థించారు.*

*యమునా నది వెంటనే గోపికలకు త్రోవఇచ్చింది, దూర్వాస మహర్షి కేవలం గోపికల భక్తికి మెచ్చి, వారిని ఆనంద పరచడానికి పండ్లు ఆరగించాడే తప్ప, వాటిపై వ్యామోహం తో కాదు. ఆకలితో కాదు, మనస్సును, ఇంద్రియాలను జయించినవారికి, ఆకలి దప్పులు ఉండవు.*

*ఈశ్వరార్పణ భావంతో చేసిన ఆ కర్మకు అతడు కర్త కాదు, కేవలం సాక్షీభూతుడు, అందువల్ల అతనికి ఆ కర్మకు ఫలం అంట లేదు.*

*అలానే ఈనాడు కలియుగంలో ఏది చేసినా, అది భగవంతునికి అర్పితం చేయాలి!*

*ఎవరైనా ఇంతపని ఎలా చేసావు, ఎలా సాధ్యమైనది, అని అడిగినప్పుడు ‘అంతా ఈశ్వర సంకల్పం మాత్రమే, నేను నిమిత్తమాత్రుడిని, ఆయన దయ ఉంటే అన్నీ సాధ్యమే!’ అనే మాట చెప్పి, మన భావం కూడా అలానే ఉండాలి... అప్పుడే ఆ సర్వేశ్వరుడు - మంచి ఫలితం మనకు ఇచ్చి, దానిలో ఉన్న చెడును హలాహలం లాగా తాను స్వీకరిస్తాడు.* 

*అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది..!*

*ఈరోజు మనం, మంచి జరిగితే నేను, చెడు అయితే దేవుడు అని అనుకొని మాయలో పడుతున్నాము ...*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: