28, ఫిబ్రవరి 2024, బుధవారం

తెలియగ లేరే నీ లీలలు....

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*తెలియగ లేరే నీ లీలలు....*


*ఆవుల మల్లిఖార్జున..*


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తుడు..శ్రీ స్వామి వారి మందిరంలో మొదట దత్తదీక్ష తీసుకున్న అతి కొద్దిమందిలో మల్లిఖార్జున కూడా ఒకడు..క్రమం తప్పకుండా స్వామి వారిని సేవించుకునే వాడు..


ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దత్త దీక్ష స్వీకరించి..ఆ నలభై రోజులపాటూ శ్రీ స్వామివారి మందిరం వద్ద నిష్ఠతో దీక్ష కొనసాగించడం మల్లిఖార్జున అలవాటు..ప్రతి క్షణం శ్రీ స్వామి వారి సేవలోనే కాలం గడుపుతూ వుండేవాడు.. దీక్షలో ఉన్న ఇతర స్వాములకు కంకణాలు కడుతూనో.. వాళ్ళ కంఠం లో చిక్కుపడిన దీక్ష మాలలు సరిచేస్తూనో..సాయంత్రం భజనకు కావాల్సిన సరంజామా సర్దుతూనో..దీక్ష ముగింపు ముందు కలశాలు స్వాములకు నెత్తిన పెడుతూనో..స్వామీ వారి అభిషేక సమయంలో ఇతర స్వాములకు సహాయం చేస్తూనో.. స్వామీ వారి సమాధి కి అద్దే గంధం కలుపుతూనో...నిరంతరం ఆ స్వామీ సేవలోనే గడుపుతూ ఏ మాత్రం అహంకారం లేని భక్తుడు..


సౌమ్యుడు..మితభాషి..ఎవ్వరి విషయంలోనూ అనవసరపు జోక్యం చేసుకోడు..


కొద్దికాలం క్రిందట ఆ మల్లిఖార్జునకు మోటార్ సైకిల్ పై వెళుతుంటే ప్రమాదం సంభవించింది..ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు..ఆసమయంలో అతనిని చూసిన వాళ్ళు జీవించడం కష్టం అని తేల్చేశారు..హాస్పిటల్ లో చేర్పించారు..ప్రాణాపాయం లేదన్నారు కానీ, మామూలు మనిషి కావడానికి సంశయం వెలిబుచ్చారు..మాట కూడా లేదు..ఆర్ధికంగా కూడా చాలా ఖర్చు అయింది..నిత్యమూ శ్రీ స్వామిని నమ్ముకొని ఉన్న మల్లిఖార్జునను ఇక ఆ దిగంబర అవధూత దత్తాత్రేయుడే కాపాడాలి..అంతకంటే మార్గం లేదని ఇంట్లో వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారు..


అతని భార్యా, తల్లీ ఇద్దరూ చెరోవైపు పట్టుకుని స్వామి వారి మందిరానికి తీసుకొని వచ్చారు..ఆ దత్తాత్రేయుడి వద్ద నిలబెట్టారు..ఆ కుటుంబానికి స్వామి వారి మీద ఉన్న అచంచల భక్తీ విశ్వాసాలో, భక్తుడి పట్ల ఆ దత్తాత్రేయ స్వామి కి ఉన్న అవ్యాజ కరుణో..ఏదైతేనేం..తల్లి, భార్యా పట్టుకుంటే కానీ అడుగు వేయలేకపోయిన మల్లిఖార్జున.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..క్రమంగా కోలుకున్నాడు..నెమ్మదిగా నడవసాగాడు..కొద్దిరోజుల్లోనే మళ్లీ మామూలు మనిషిలా మారి..తన పనులు తానే చేసుకోసాగాడు..


మళ్ళీ దత్తదీక్ష ల నాటికి మల్లిఖార్జున ఎప్పటిలాగే పూర్తి స్వస్థత తో ఆలయానికి వచ్చి, 41 రోజుల మండల దీక్ష తీసుకున్నాడు..అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సంవత్సరం దీక్ష పూర్తి చేసాడు..ఈ సంఘటన జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది..ఈ సంవత్సరం కూడా మల్లిఖార్జున దత్తదీక్ష స్వీకరించి, శ్రీ స్వామివారి సన్నిధిలో వున్నాడు..


కష్టాలు ప్రతి మనిషికీ వస్తాయి..ఆ దత్తుడి మీద విశ్వాసం ఉంచి, తన కర్తవ్యం తను చేస్తే, ఆ దత్తాత్రేయుడే సహస్ర బాహువులతో కాపాడతాడు..


సర్వం..

దత్తకృప..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: