6, ఫిబ్రవరి 2024, మంగళవారం

భక్తి..బంధుత్వం.

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భక్తి..బంధుత్వం..*


"మేము స్వామివారి కి బంధువులం అవుతామండీ..ఈరోజు ఇక్కడ నిద్ర చేయాలని అనుకున్నాము..మేము ఉండడానికి ఏదైనా గది ఇస్తారా?.." అని ఆ దంపతులు అడిగారు..ఇద్దరిదీ వయసు ముప్పై ఏళ్ల లోపలే..శ్రీ స్వామివారికి వారికి ఏవిధంగా బంధుత్వం వున్నదో కూడా తెలిపారు.. గది కేటాయించాము..ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోనికి వచ్చారు..ఆరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి వీలు లేదు కనుక..దూరం నుంచే నమస్కారం చేసుకున్నారు..


"మాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతున్నది..ఇద్దరమూ డెంటల్ డాక్టర్ల గా నెల్లూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాము..సరిగ్గా జరగడం లేదు..ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాము..దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ నుంచి మమ్మల్ని రమ్మనమని కబురు వచ్చింది..వెళ్లాలని అనుకుంటున్నాము..కానీ గత మూడు నెలలుగా ఏదో ఒక అడ్డంకి వలన మేము అక్కడికి వెళ్లలేక పోతున్నాము..మాకున్న ఈ ఆర్థిక సమస్యలు తీరిపోయి..దుబాయ్ వెళ్ళడానికి వీలుకుదరాలని స్వామివారికి విన్నవించుకుందామని వచ్చాము.." అని చెప్పారు..సాయంత్రం పల్లకీ సేవ ఎన్నిగంటలకో అని అడిగి తెలుసుకున్నారు..పల్లకీ సేవ లో తామిద్దరం పాల్గొంటామని చెప్పారు..సరే అన్నాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ ప్రారంభం అయింది..దంపతులిద్దరూ భక్తిగా పాల్గొన్నారు..పల్లకీ మందిరం చుట్టూ తిరిగే మూడు ప్రదక్షిణాల లోనూ అతనే పల్లకీని మోశాడు..పల్లకీ సేవ తరువాత, అన్నదాన సత్రానికి వెళ్లి, అన్నప్రసాదం స్వీకరించి వచ్చారు..వాళ్లకోసం గది ని కేటాయించినా కూడా ఆ రాత్రి మండపం లోనే పడుకుంటామని చెప్పి, అక్కడే నేలమీద నిద్ర చేశారు..


ప్రక్కరోజు ఆదివారం తెల్లవారుఝామున లేచి..స్నానం చేసి..శ్రీ స్వామివారి మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చారు..ప్రభాత పూజ, హారతులు అయిపోయిన తరువాత..ఇద్దరూ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, సుమారు పది నిమిషాల పాటు నిలబడ్డారు..తమ కోర్కెను శ్రీ స్వామివారికి విన్నవించుకున్నామని ఇవతలికి వచ్చి నాతో చెప్పారు..


"ఎందువల్లో తెలీదండీ..శ్రీ స్వామివారి సమాధి వద్ద మా బాధలు విన్నవించుకున్న తరువాత..మా మనసులకు ప్రశాంతత వచ్చింది.." అన్నారు..మధ్యాహ్నం దాకా మందిరం లో గడిపి..తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..


పదిహేను రోజులు గడిచిపోయాయి..మేము దాదాపుగా ఆ దంపతుల గురించి మర్చిపోయాము..ఒకరోజు శ్రీ స్వామివారి బంధువు మరొక వ్యక్తి మందిరానికి వచ్చాడు..మాటల మధ్యలో ఈ దంపతుల ప్రస్తావన వచ్చింది..పదిహేను రోజుల క్రిందటే వాళ్లిద్దరూ వచ్చి వెళ్లారని తెలిపాను..గత నాలుగైదు నెలలుగా వాళ్లిద్దరూ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారని..మానసికంగా కూడా వత్తిడి లో ఉన్నారనీ..అప్పుడు ఆ అమ్మాయి తల్లి గారు వాళ్ళను మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని శరణు కోరమని చెప్పిందనీ..ఆవిడ మాట ప్రకారం వాళ్లిద్దరూ ఇక్కడకు వచ్చారని..తెలిపాడు..శ్రీ స్వామివారికి మ్రొక్కుకున్న మూడు రోజుల్లోనే దుబాయ్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని..మరో వారం లోపలే ఆ దంపతులు దుబాయ్ వెళుతున్నారని..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని.." ఆ వచ్చిన వ్యక్తి తెలిపాడు..


ప్రస్తుతం ఆ దంపతులిద్దరూ దుబాయ్ లో లక్షణంగా ఉన్నారు...శ్రీ స్వామివారి దయ వలన ఆ భార్యా భర్తల కోరిక నెరవేరిందని అనుకున్నాము..బంధుత్వం కన్నా..వాళ్లిద్దరూ కనపరచిన భక్తి విశ్వాసాలే వాళ్ళను శ్రీ స్వామివారికి దగ్గర చేసాయి.. ఎందుకంటే శ్రీ స్వామివారు భక్త సులభుడు కదా!..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: