6, మార్చి 2024, బుధవారం

తాత్కాలిక కష్టాలు..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*తాత్కాలిక కష్టాలు..*


"ఆ స్వామివారిని పూర్తిగా నమ్మి కొలుస్తున్నాము..కష్టమొచ్చినా..సుఖమొచ్చినా...ఆ స్వామి దయ అని భావిస్తున్నాము.."


సర్వ సాధారణంగా చాలా మంది భక్తులు నాతో చెప్పే మాట ఇది..కానీ సుఖాన్ని ఆస్వాదించినంత ఆనందంగా కష్టాన్ని ఓర్చుకోలేరు..చిన్న కష్టం కలగగానే.."శ్రీ స్వామివారిని ఇంతగా పూజిస్తున్నామే..మా కెందుకీ పరీక్ష పెట్టాడో..?" అని సంసాయాత్మక బుద్ధిని బైట పెడుతుంటారు..ఇది మానవ నైజం..సర్వకాలసర్వావస్థలయందూ ఒకే రీతిని స్పందించేవారు బహు అరుదుగా వుంటారు..అటువంటి వారే నిజమైన భక్తులు..వారు సుఖ దుఃఖాలను రెండింటినీ సమంగా చూస్తారు..రెండూ ఆ స్వామివారి ప్రసాదం గానే భావిస్తారు..


సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రిందట..దంపతులిద్దరు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరూ అరవై ఏళ్ల పైబడిన వారే..నెల్లూరు ప్రాంతం వారు..శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన చేసే రోజుల్లోనే దర్శించుకొని ఆశీర్వాదం పొందివున్నారు.. శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం నిర్మించుకొని, తన సాధన కొనసాగిస్తున్న కాలంలో రాలేక పోయినా..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళుతూవుండేవారు..అన్నదానం అంటే ఆ దంపతులకు మహా ఇష్టం..శ్రీ స్వామివారి దగ్గర అన్నదానానికి ప్రతిసారీ విరాళం ఇచ్చేవారు..


వారికి మొత్తం ముగ్గురు సంతానం..ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల..అందరూ చక్కగా చదువుకున్నారు..మంచి ఉద్యోగాల్లో వున్నారు..వివాహాలూ జరిగాయి..ఏ రకంగానూ పిల్లల గురించి చింత పడాల్సిన అవసరం లేదు..తాము శ్రీ స్వామివారిని మొదటిసారి దర్శించుకున్న రోజే..శ్రీ స్వామివారు.."అంతా మంచి జరుగుతుంది..శుభం.." అని ఆశీర్వదించారనీ..ఆరోజు నుంచీ.. తమకు కానీ..తమ పిల్లలకు కానీ..ఎటువంటి ఇబ్బందీ కలుగాలేదనీ..చెప్పుకుంటారు..రెండోసారి శ్రీ స్వామివారిని కలిసినప్పుడు.."కష్ట సుఖాలు అనేవి..పగలు రాత్రి వంటివి..వస్తూ పోతూ ఉంటాయి..రెండింటినీ సమంగా చూడండి.."అన్నారట..ఆ మాట వాళ్ళిద్దరి మనసులో హత్తుకుపోయింది..


ఈసారి వాళ్లిద్దరూ శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది..ఆ భార్యాభర్త లలో ఆవిడకు ఆరోగ్యం దెబ్బతిన్నది..డాక్టర్లు పరీక్షలు చేసి..ఆవిడ కాన్సర్ తో బాధ పడుతున్నదనీ.. మరో ఐదారు నెలల సమయం మాత్రం ఉందనీ..ఆపైన ఆవిడ బ్రతకడం కష్టమని చెప్పారు..బాధ్యతలు అన్నీ తీరిపోయాయి అని తెలిసినా..ఎవరూ మృత్యువును ఆహ్వానించరు.. ఇంకొంత కాలం జీవించి ఉండాలనే కోరుకుంటారు..కానీ ఆ దంపతులు అట్లా ఆలోచించలేదు... తమ జీవితాలు చరమాంకంలో ఉన్నాయనీ.. ఇంతకాలం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా..మొత్తమ్మీద సంతృప్తి కరమైన జీవితాన్ని గడిపామనీ..శ్రీ స్వామివారు తమతో కష్ట సుఖాలను సమంగా చూడమని చెప్పారు కనుక..ఇప్పుడొచ్చిన ఈ వ్యాధి తాలూకు బాధను కూడా సంతోషంగానే స్వీకరిస్తాననీ ఆవిడ తెలిపారు..ఆ దంపతుల ముఖంలో ఎటువంటి విచారమూ లేదు..ఎప్పటిలాగే శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని..మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..అంత కష్టం లోనూ అన్నదానానికి విరాళం ఇచ్చారు..


తమ ఊరికి బైలుదేరేముందు నా దగ్గరకు వచ్చి.."ఎప్పుడు మృత్యువు వచ్చినా సంతోషమే..కాకుంటే నేను పోయిన తరువాత ఈయన ఇబ్బంది పడతారు..అదొక్కటే నా బాధ..ఈ వయసులో ఒకరికొకరం తోడుగా వున్నాము..తాను ఒంటరి తనం తో బాధ పడతారేమో నని నాకున్న ఒకే ఒక్క ఆలోచన..అంతకు మించి ఇంకేమీలేదు.." అని ఆవిడ చెప్పింది..అదేసమయం లో ఆయన అందుకొని.."ప్రారబ్ధాన్ని తప్పించుకోలేము..అంతా ఆ స్వామి దయ..చూద్దాం..ఆయనదే భారం.." అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు అప్పుడప్పుడూ మందిరానికి వస్తూనే వుండేవారు.. ఆరునెలల కంటే సమయం లేదని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా.. మరో ఐదారేళ్ళ పాటు ఆవిడ హాయిగా వున్నది.. "శ్రీ స్వామివారు చెప్పినట్టు..ఆ కాన్సర్ అనే కష్టం కూడా తాత్కాలికంగా వచ్చి వెళ్లిపోయిందేమో ప్రసాద్!.." అని నాతో ఆయన పలుమార్లు చెప్పేవారు..ఒక సంవత్సరం క్రిందట ఆ దంపతులిద్దరిలో ..ముందుగా ఆయన.. ఆ తరువాత మరో ఇరవై రోజుల కల్లా ఆవిడా కన్నుమూసారు..మరణం లోనూ ఎక్కువకాలం ఎడబాటు లేదు ఇద్దరిమధ్యా..


శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తీ..విశ్వాసం తో పాటు స్థితప్రజ్ఞత కూడా వాళ్లకు అంతకాలం పాటు రక్షగా ఉన్నది..పుణ్యదంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగాసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: