13, మార్చి 2024, బుధవారం

*రమణ సందేశము

 *రమణ సందేశము*



ఈ మధ్య అరవిందబోస్ బెంగళూరునుండి ఖరీదైన పెన్సిళ్ళు కొన్ని తెచ్చాడు.

అవి శ్రీవారికి సమర్పించి, నమస్కరించి కుశల ప్రశ్నానంతరం “మహాప్రస్థానం”

అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగళాకు వెళ్ళాడు.


 అతను వెళ్ళిన తరువాత భగవాన్ ఆ పెన్సిళ్ళు అటూ ఇటూ త్రిప్పీ, రాసీచూస్తూ వాటి మంచినంతా వర్ణించి, కృష్ణస్వామి చేతికి ఇస్తూ "ఇవి భద్రంగా దాచి ఉంచయ్యా. జాగ్రత్త, మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి. అది చూచి

తెచ్చి యివ్వు" అన్నారు. కృష్ణస్వామి అవి తీసుకొని భగవాన్ సోఫాకు ప్రక్కనే

టేబిల్ మీద వున్న సన్నవి కొయ్యపెట్టె తెఱచి, అటూ యిటూ వెతికి, ఇంకొకటి

మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు..

భగవాన్ అదీ తిప్పి తిప్పి చూచి "ఇదెందుకయ్యోయ్. ఇది దేవరాజమొదలియారు ఇచ్చింది. అసలు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా. అది ఇచ్చి, ఇది

కూడా భద్రంగా దాచిపెట్టు" అన్నారు.


 కృష్ణస్వామి అక్కడెంత వెతికినా

కనుపించలేదు. “హాల్లో ఉన్నదేమో, వెతకండి" అన్నారు భగవాన్. ఒకరు వెళ్లి

చూచివచ్చి "కనిపించలేదు" అన్నారు. "అయ్యయ్యో, అది మన సొంత పెన్సిలయ్యా. ఎక్కడ పోయిందో సరిగా చూడండి" అన్నారు భగవాన్. దేవరాజమొదలియారు అక్కడే ఉండి "అదేమి భగవాన్, ఇవన్నీ మాత్రం సొంతం కాదా?”అన్నారు.


భగవాన్ నవ్వుతూ “అది కాదండీ. ఇది మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు.ఇవన్నీ ఖరీదైనవి. ఏమరుపాటుగా ఉంటే, ఎవరైనా ఎత్తుకు పోతారు. స్వామిఅందఱికి ఉమ్మడియే కదా. భగవానుకు అని అంత ఖరీదు పెట్టి తెచ్చామే,పోయిందే అని మీరు అనుకోవచ్చు. అదంతా ఎందుకు? మన సొంత పెన్సిలైతే ఎలా పెట్టుకున్నా బాధ లేదు. దాని వెల అర్ధణా. అదీ కొన్నది కాదు. ఎక్కడో

దొరికిందని వీరెవరో తెచ్చియిచ్చారు. అది మనకు సొంతం. వీటన్నిటికీ

చెప్పాలి. అది ఏమయిందని ఎవరూ అడగరు. అందుకని అదే కావాలి అంటున్నాను. ఇవన్నీ గొప్పవారు వాడేవి. మనకెందుకు? మనమేమి పరీక్షలు ప్యాసు కావాలా? ఉద్యోగాలు చేయాలా? మన రాతకు అది చాలును" అని

చెప్పి, కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్.


కొంతకాలం క్రిందట ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. అది ఏమంటే:

ధనికులెవరో వెండిది కప్పూ, సాసరూ, చెంచాతో సహా ఆఫీసు ద్వారా శ్రీవారి

సన్నిధికి తెచ్చి "భగవాన్ ద్రవపదార్థం ఏదైనా పుచ్చుకొనేప్పుడు ఇవి ఉపయోగింప వలసింది” అని సమర్పించారు. భగవాన్ అవి చూచి పరిచారకుల

చేతికి ఇచ్చారు. ఆ వచ్చినవారు వెళ్ళిన తరువాత, పరిచారకుడు అవి అక్కడి

బీరువాలో పెట్టబోతూ ఉంటే, భగవాన్ వారించి "అక్కడెందుకోయ్, ఆఫీసులోనే

ఉంచుకోమను" అన్నారు. “భగవాన్ వాడుకునేందుకని కదా వారిచ్చింది?”

అన్నారొక భక్తులు. “సరిపోయింది. ఇవన్నీ ధనవంతులు వాడేవి. మనకెందుకు?కావాలంటే మన సొంత కప్పులూ చెంచాలు ఉన్నవి కదా. అవి వాడుకోవచ్చు.ఇవెందుకు?” అని ఆ పరిచారకుని చూచి 'ఏమోయ్ రేపటినుండీ సొంతకప్పు వాడుకుందాం. తీసి ఇవ్వు" అన్నారు భగవాన్. “సొంత కప్పేమిటి భగవాన్?”

అన్నాడా భక్తుడు.

“అదా. టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం. అవే

నాకు కప్పులూ చెంచాలూను. అవి మనకు సొంతం. అవి వాడుకుంటే సరిపోతుంది. ఇవి భద్రం చేయమనండి" అన్నారు భగవాన్. "ఇవి మాత్రం

భగవానుని కాదా?” అన్నాడా భక్తుడు. భగవాన్ నవ్వుతూ “అది సరేనండీ. ఆ

ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి? అవి ఖరీదైనవి. ఎవరైనా

ఎత్తుకొనిపోతారు. కాపలా కాయాలి. స్వామికి అదేనా పని? అదీ గాక స్వామికదా

అడిగితే ఇవ్వడా? అని ఎవరైనా అడగవచ్చు. కాదనేందుకు లేదు. ఇచ్చామా,

స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చును. ఎందుకది? మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా, ఏం చేసినా ఫరవాలేదు" అని చెప్పి ఆ

వెండివి పంపి, సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు.


 ఆ రోజుల్లోనే ఉద్యోగస్థుడుగా వున్న ఒక భక్తుడు ఊరినుంచి

భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు వేసిన చక్కని చేతికఱ్ఱ ఒకటి తెచ్చి

శ్రీవారికి సమర్పించాడు. భగవాన్ అటూ యిటూ త్రిప్పి చూచి "భేష్, చాలా

బాగున్నదండీ, భద్రంగా వాడుకోండి" అని సెలవిచ్చారు. “అయ్యో, నాకని కాదు, భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను. మీరు ఉపయోగించాలి" అన్నాడా భక్తుడు.

“సరిపోయింది. వెండి పొన్నులు వేసిన నాజూకు కఱ్ఱలు మీవంటి ఉద్యోగస్థులు

వాడాలి కాని నాకెందుకు? అదుగో నా సొంత కఱ్ఱ వున్నది. అది చాలును”అన్నారు భగవాన్. “అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చును కదా" అన్నారింకో భక్తులు.

"ఈ అలంకారాలన్నీ మనకి ఎందుకండోయ్. కట్టెపేడు చెక్కితే క్షణంలో కఱ్ఱ

అమరుతుంది. అది మనకు మూడో కాలు. ఈ కట్టెకు ఆ కట్టె సహాయం.కొండమీద ఉండగా ఎన్నో కట్టెలు కఱ్ఱలుగా చెక్కి నునుపు చేసి ఉంచేవాణ్ణి.కానీ ఖర్చులేదు. ఆ కఱ్ఱలు ఎందరో పట్టుకొని వెళ్ళారు. మనకవి సొంతం. ఈ

ఆడంబరాలన్నీ మనకెందుకు? మనమేం ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?

మనకది చాలును" అని చెప్పి వారి కఱ్ఱ వారికి ఇప్పించారు భగవాన్.


భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు. కాణీ కూడా ఖర్చుకాని వస్తువులంటేనే వారికి ప్రీతి. 


💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: