మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*పరివర్తన..*
"అయ్యా..స్వామికి ఒక ఆవును ఇద్దామనుకుంటున్నాను..ఎప్పుడు తీసుకొని రమ్మంటావు.."? అని నిన్న ఆదివారం ఉదయం యానాది అని పిలువబడే అతను అడిగాడు.."వచ్చే వారం తీసుకొని రా.." అన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..అతనిని చూస్తే..ఒకప్పుడు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఇతను అనే ఆలోచనే రాదు..
2014 లో సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నుంచి ఆ యువకుడిని, అతని తల్లిదండ్రులు అతి కష్టమ్మీద శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొని వచ్చారు..అతి కష్టమ్మీద అని ఎందుకు అన్నానంటే..ఆ యువకుడు ఒక పట్టాన ఓ ప్రక్క నిలవడం లేదు..చూపు ఎటో ఉంది..మనిషి ప్రవర్తన తేడాగా ఉంది..తనలో తానే మాట్లాడుకుంటూ..ఉన్నట్టుండి పరుగెట్టేవాడు..పట్టుకోవడం కూడా కష్టం..పోనీ చిన్నపిల్లవాడా అంటే కాదు..సుమారు ముప్పై సంవత్సరాల వయసు..పెళ్లి కూడా జరిగి నాలుగైదు సంవత్సరాల కాలం గడిచి పోయింది..
అతని పేరు కోడిపల్లి యానాది..వృత్తి గొర్రెల పెంపకం..చిన్నతనం నుంచీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా వుండేవాడు..కొద్దిగా బిడియస్తుడే గానీ..నెమ్మదస్తుడు..ఎటువంటి వివాదాల్లోకి వెళ్లే మనస్తత్వం కాదు..తన పనేమిటో..తానేమిటో..అన్నట్లుగా వుండేవాడు..వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు..మూడేళ్ల పాటు సంసారం ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోయింది..ఇద్దరు పిల్లలు కూడా కలిగారు..ఉన్నట్టుండి అతనికి ఏమైయిందో తెలీదు..ఒక్కసారిగా యానాది ప్రవర్తనే మారిపోయింది..మానసికంగా మనిషి కుంగిపోతున్నాడు..పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..
భార్యా..తల్లిదండ్రులు..యానాది లో వచ్చిన మార్పు చూసి తల్లడిల్లిపోయారు..
అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొచ్చారు..శ్రీ స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు..మొదటి రెండు మూడు రోజులూ తల్లీ తండ్రీ..భార్యా..ఇలా ఎవరో ఒకరు యానాది ని పట్టుకొని ప్రదక్షిణాలు చేయించే పరిస్థితి..కానీ నాలుగో రోజు గడిచేసరికి..తన పాటికి తానే శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు..తనలో తాను మాట్లాడుకోవడం తగ్గి పోయింది..మార్పు స్పష్టంగా కనబడ సాగింది..
అతనిని మేమూ చాలా కుతూహలంగా గమనించసాగాము..మాకూ కూడా యానాదిలో వస్తున్న మార్పు ఆశ్చర్యం కలిగించసాగింది.."అయ్యా..మా అబ్బాయి యానాదిని ఇక్కడికి తీసుకొచ్చి..ఆ స్వామి సమాధి చుట్టూ త్రిప్పుతుంటే..వాడిలో చాలా మార్పు కనబడుతోంది.. మేము మండలం రోజుల పాటు వాడిని ఇక్కడే ఉంచాలని అనుకుంటున్నాము..మా పాటికి మేము వంట చేసుకుంటాము..కాకుంటే మా సామాను పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఇప్పించండి.."అన్నారు..సరే అని ఒక చిన్న గది కేటాయించాము..అందులో వుండసాగారు..
మరో వారం రోజులు గడిచాయి..యానాది ఒక క్రమ పద్దతి ప్రకారం ప్రదక్షిణాలు చేయడం..శ్రీ స్వామివారి దీపారాధన కోసం నూనె తీసుకొచ్చి అర్చకులకు ఇవ్వడం..ఇతర ఉపాలయాల్లో కూడా ప్రదక్షిణాలు చేసి రావడం..తల్లిదండ్రులతో అప్పుడప్పుడూ మాట్లాడటం..పిల్లలను దగ్గరకు తీసుకోవటం..చేయసాగాడు..మనిషి లో గుణాత్మక మార్పు వచ్చేసింది..చిత్రమేమిటంటే..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న అర్చకులకే కాదు..ఇతర సిబ్బంది కి.. అందరికీ...యానాది ప్రీతిపాత్రుడిగా మారడం..అట్లని అతనేమీ అతి చనువు తీసుకొని ప్రవర్తించడం లేదు..
మండలం రోజులు పూర్తయ్యేదాకా యానాది శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నాడు..యానాది మళ్లీ మామూలు మనిషిగా మారాడు..తనకు వచ్చిన ఇబ్బందిని తీర్చిన శ్రీ స్వామివారిని యానాది మర్చిపోలేదు..తన గ్రామానికి వెళ్లి తన వ్యాపకం తాను చేసుకుంటూ...తాను సంపాదించిన ప్రతి రూపాయ లో కొంత శాతం శ్రీ స్వామివారి వద్ద అన్నదానానికి కేటాయించసాగాడు..ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తున్నాడు..గొర్రెలు కాచుకుని జీవనం సాగించే యానాదికి అన్నదానమంటే అత్యంత ఇష్టం.."అన్నమొక్కటే కదయ్యా మనచేత "ఇక చాలు"..అని అనిపించేది.." అంటాడు నవ్వుతూ..తనకు ఏ కష్టం వచ్చినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి మ్రొక్కుకొని వెళుతూ ఉంటాడు..
అత్యంత మితంగా మాట్లాడే యానాది మనసంతా శ్రీ దత్తాత్రేయ స్వామివారే నిండి పోయి వున్నారు..అదే అతనికి శ్రీరామరక్ష..
సర్వం..
దత్తకృప.
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి