1, ఆగస్టు 2024, గురువారం

దేహతాదాత్మ్యము

 #దేహతాదాత్మ్యము..*


ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు. అయినప్పటికి చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చు గ్రుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారుచేశాడు. వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు. ఆ శిల్పియే అనుకుంటారు. ఆ తొమ్మిదింటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది.


అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతోకాలం జీవించటం జరగదు. బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకేరకం వస్త్రాన్ని కప్పి, తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు.ఆదిత్యయోగీ.


ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒక్కటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్షు తీరిపోయిన శిల్పి ఎవరా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధ పడటం లేదు.


ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న 'సమవర్తి' అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగివెళుతూ వెళుతూ "వీడెవడో గాని అన్నింటిని ఎంతో నైపుణ్యంతో, జీవకళ ఉట్టి పడేటట్లుగా చక్కగా చెక్కాడు గాని ఒక్క పొరపాటు చేశాడు" అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి "ఏమిటయ్యా.. ఆ పొరబాటు..?" అన్నాడు. "..నీవు లేవటమే ఆ పొరపాటు" అని యమధర్మరాజు.. అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గైకొని పోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి. కాని దేహాభిమానం అతణ్ణి వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే.. నేనేం పొరపాటు చేశాను..? అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు. పొయ్యాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది.

 

దేహాభిమానం గలవారు 'ఈ దేహమే నేను' అనే భావంతో ‘నేను’ 'నేను' అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని 'నావారు' అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని 'నావి' అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని, మనస్సును అనవసరమైన ఆందోళనలకు, ఉద్రేకాలకు లోనుగావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ "దేహతాదాత్మ్యమే మానవులు కున్న పెద్దదోషం".


ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఈ దేహాభిమానమే.. దేహతాదాత్మ్యమే.. దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా.. పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం.. పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్థుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది.. అలాగే అంతరంగం లోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మయందు మనస్సు నిలుపుదాం అని ప్రయత్నిస్తే నిలుస్తుందా..? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలిగితే గాని నిర్గుణోపాసన కుదరదు...

.

శ్రీరామకృష్ణులు:..


                       "ఇతరులకు బోధించాలంటే అధికారిక ఆమోదం పొంది ఉండాలి. లేకుంటే బోధన అపహాస్యంగా పరిణమిస్తుంది. తానే అజ్ఞాని, ఇతరులకు జ్ఞానోపదేశం చేయటానికి పూనుకోవటమా? ఇది అంధుడు అంధుడికి దారిచూపటం వంటిది. అలా బోధచేయటం మేలుకంటే కీడే ఎక్కువ వాటిల్లజేస్తుంది. భగవత్సాక్షాత్కారానంతరం అంతర్దృష్టి కలుగుతుంది. ఆ తరువాతనే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక రుగ్మత నిర్ధారించి, సముచిత ఉపదేశం చేయగలిగేది.ఆదిత్యయోగీ.


"భగవదాదేశం లేకుంటే, మనిషికి 'నేను జనులకు ఉపదేశం చేస్తున్నాను' అని అహంకారం జనిస్తుంది. ఈ అహంకారం అతడి అజ్ఞాన జనితమే; అజ్ఞాని తాను కర్తనని భావించుకొంటాడు. గదా! 'భగవంతుడే కర్త ఆయనే సమస్తం చేస్తున్నాడు. నే నేమీ చేయటం లేదు.' ఇలా భావిస్తున్న వ్యక్తే నిజానికి జీవన్ముక్తుడవుతాడు. 'నేను కర్తను. నేను కర్తను' అనే భావంనుండే మనిషి యొక్క సమస్త దుఃఖాలు, అశాంతి ఉద్భవిస్తాయి...

.

"శూన్యం" పరానికి సంబంధించినది.

" ధర్మం" ఇహానికి చెందినది.


ఎప్పుడయితే మనం ఆలోచనల్ని దాటి శూన్యంగా.. నిశ్శబ్దంగా అయిపోతామో అప్పుడే అసలైన ధర్మం మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో "స్వధర్మం" అన్నాడు.


 శ్రీ రామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ" యే కాళీమాత. కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు. అర్ధరాత్రి..ఆదిత్యయోగీ.

ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని , అంధకారాన్ని (అభేదాన్ని) ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. రాత్రి నిద్ర పోతున్నపుడే కాదు.. పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని.. ఆ శూన్యాన్ని అనుభవించగలగడమే సహజ సమాధి. 


 నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీ...ఖాళీగా ఉండదు. ఆ "ఖాళీ" దైవంతో నిండిపోయి ఉంటుంది. అదే నిన్ను సదా నడిపిస్తూ ఉంటుంది. దీనిని అర్ధం చేసుకోగలగడం మానవుడికి మాత్రమే ఉన్న గొప్ప వరం...

.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో

 " జహి శత్రుం,మహాబాహో, కామరూపం దురాసదమ్"

(ఓ మహాబాహువుడవైన అర్జునా!జయించడానికి అసాధ్యమైన ఈ కామము అనే శత్రువును నాశనము చేయుము),

అని అర్జునునితో అంటాడు.

స్త్రీయొక్క బాహ్య సౌందర్యం చూచి చలించని పురుషుడు లేడు.

కామమును జయించడం ఎంత కష్టమో "భర్తృహరి మహాయోగి" ఇలా అంటున్నారు..


(కేవలము వాయు భక్షణము చేసి గాని,ఆకులు తినిగాని, లేక నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించిగాని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడు, పరాశరుడు వంటి మునీశ్వరులు కూడా పద్మమువంటి అందమైన, స్త్రీ ముఖమును చూడగానే మోహపరవశులయినారు.

నెయ్యి, పాలు, పెరుగులతో కూడిన వరి అన్నము తినే మానవులు నిజముగా ఇంద్రియములను (కామమును)జయిస్తే, వింధ్యపర్వతం సముద్రములో తేలుతుంది! ).ఆదిత్యయోగీ.

దేనికైనా పట్టుదలతో సాధన చేయాలి.

చంద్రబాబు, జగన్ , కె.సి.ఆర్ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటే కాలం కూడా తెలియకుండా కాలగర్భంలో కలవడం తప్ప జీవితంలో ఏదీ సాధించలేము...


గోవులు రంగులు వేరైనా గోక్షిరము ఒకటే,

ఆభరణములు వేరైన బంగారు ఒకటే,

ప్రాంతములు వేరైనా ప్రాణులు ఒకటే,

నక్షత్రములు అనేకములైనా ఆకాశము ఒకటే,

అలాగె సర్వమతముల సారము భగవంతుడు ఒక్కడే..

"భగవంతుడు" అంటే సాకారము "ఆత్మ" అంటే నిరాకారము.....

.

కామెంట్‌లు లేవు: