_*భజే శ్రీనివాసమ్*_
*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*
*రచన.*
*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
*అశ్వని. --1*
నక్షత్రాలన్నింటిలో మొదటిది అశ్వని. ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు అధి దేవతలు. ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశికి చెందుతాయి.అశ్వని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవతల వైద్యుడైన ధన్వంతరి శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుని అశ్వనీ నక్షత్రం రోజున ఎవరు ఆరాధిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యం నుంచైనా వెంటనే ఉపశమనం కలుగుతుంది. పూర్వకాలంలో కోసల దేశంలో రేవంతుడనే రాజు ఉండేవాడు.
రేవంతునికి పూర్వ జన్మ కర్మ ఫలితంగా ఒక విచిత్ర రోగం పట్టుకున్నది. పగలు ఎంతో చలాకీగా ఉండే రేవంతునికి సూర్యాస్తమయం కాగానే
కంటిచూపు మందగించేది. చెవులకు ఏమీ వినిపించేది కాదు. తల తిరుగుతున్నట్లుగా ఉండేది. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి తానుఎవరో కూడా మరిచి పోయేవాడు. రాత్రంతా నిద్ర లేక అంత:పురం అంతా పిచ్చి వాడిలా తిరిగేవాడు. తెల్లవారగానే తిరిగి మామూలు మనిషి అయ్యేవాడు. ఈ వ్యాధి ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. రాజవైద్యులు
చెయ్యని చికిత్స లేదు. ఈ వ్యాధి అంతు పట్టక రాణి ఎంతో దు:ఖించి ఎన్నో దేవతలకు మొక్కుకున్నది. అయినా ఫలితం లేకపోయినది. రాజు తన ఈ వింత వ్యాధి పోగొట్టినవారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. దేశం నలుమూలల నుండి ఎందరో గొప్ప వైద్యులు వచ్చి ఎన్నో రకాల వైద్యం చేసినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. ఆ రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. పగలంతా శిష్యులతో సంచారం చేసి రాత్రికి ఒక పెద్ద చెట్టుకింద
విశ్రమించాడు.అటుగా పోతున్న బాటసారులు కొంతమంది ఆ రాత్రికి ' చెట్టుకిందనే గడుపు దామని వచ్చారు.ఆ బాట సారుల మాటలు కొన్ని సాధువు చెవిన పడ్డాయి. ఆ దేశపు రాజైన రేవంతుడు ఎంతకీ అంతుచిక్కని విచిత్ర వ్యాధితో బాధ పడు తున్నట్లుగా గ్రహించాడు. ఆ రాజు వ్యాధి తగ్గే మార్గం తన దగ్గర ఉన్నదని గ్రహించిన సాధువు మరుసటి రోజు రాజాస్థానానికి చేరుకున్నాడు. తను వచ్చిన సంగతి వివరించాడు.తాను రాజుయొక్క వ్యాధి తప్పక నయం చేయగలనని మంత్రితో చెప్పాడు. అయితే అతని మాటలను ఎవరూ నమ్మలేదు. ఎందరో గొప్ప వైద్యులకు సాధ్యం కానిది ఈ సామాన్య సాధువు వలన అవుతుందా అని తలచారు.కానీ రాణి మాత్రం ఏ పుట్టలో ఏ పాముందోనని తలచి సాధువుతో" స్వామీ! తమరి రాక మాకెంతో సంతోషం, దయచేసి నా నాథుడి వ్యాధి నయమయ్యే దారి చెప్ప వలసింది" అని వేడుకుంది. అంతట ఆ సాధువు ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానించి 'అమ్మా! నేను చెప్పినట్లుగా చేస్తే ఈవ్యాధి తప్పక నయ మవుతుంది. ఈ వ్యాధే కాదు, ఎంతటివ్యాధైనా సరే తప్పక నయమవుతుంది. నీవు చేయవలసిందల్లా ఒక్కటే! రాజును నీవెంట పెట్టుకుని వేంకటాద్రి చేరి అశ్వనీ నక్షత్రం నాడు పుష్కరిణిలో స్నాన మాచరించి, వరాహ స్వామిని దర్శించి అటు తర్వాత ఆనందనిలయంలోని శ్రీనివాసుని దర్శించవలసింది. ఆ మరుదినమే రాజు పూర్తిఆరోగ్యవంతుడౌతాడు. నేటికి ఏడవరోజునే అశ్వనీ నక్షత్రం. ఇక ఆలస్యంచేయక రేపే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని తిరుమల యాత్ర చేయవలసింది
అని చెప్పాడు.ఇదంతా సావధానంగా విన్న రాణి ఆ సాధువునికి నమస్కరించి
తగు రీతిన సత్కరించి పంపింది. సాధువు చెప్పినట్లు గానే వెంటనే ప్రయాణపు ఏర్పాట్లు ప్రారంభించి అశ్వనీ నక్షత్రానికి ఒకరోజు ముందుగానే తిరుమలకు చేరుకున్నారు. మరునాడు సూర్యోదయం కాగానే రాజు,రాణి ఇద్దరూ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, వరాహ స్వామిని దర్శించి తరువాత ఆనంద నిలయంలో శ్రీ స్వామి వారిని దర్శించారు. స్వామిని తమను అనుగ్రహించ వలసిందిగా అనేక విధాల ప్రార్థించారు.ఆ రోజు రాత్రి కొండమీదనే విశ్రమించ దలచారు. సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్ది రాణి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ రాత్రి
తన నాథుడు ఎలా వుంటాడో అని ఎంతో బాధపడింది. ఇంతలోనే సాయంత్రం అయ్యింది. రాజు నవ్వుతూ కులాసాగా వున్నాడు. రాత్రి చీకటి కాసాగింది. రాజులో వ్యాధి లక్షణాలు ఎక్కడా లేవు.
రాజు పూర్తి ఆరోగ్యవంతుడిలా వున్నాడు. రాజు వ్యాధి పూర్తిగా నయమైందని గ్రహించిన దంపతుల ఆనందానికి అవధులు లేవు.తెల్లవార గానే ఆ రాజ దంపతులిద్దరూ ఆలయానికి వెళ్ళారు. వారు ఆనంద నిలయం చేరేటప్పటికి అక్కడ వున్న అర్చకులు ఎంతో కమనీయ స్వరంతో స్వామికి సుప్రభాతసేవ చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీనివాసుని ఆ అద్భుత దివ్య మంగళ స్వరూపం చూసిన రాజ దంపతులు ఆనందానికి
అవధులు లేవు. ఈ సృష్టిలోని అందం అంతా ఆ స్వామిదే. ఈ విశ్వంలోని తేజస్సంతా ఆ పరబ్రహ్మమూర్తిదే. ఈ జగత్తులోని ఆనందమంతా స్వామిలోనే వున్నది. ఇలా స్వామి గుణ గణాలను తలుస్తూ రాజ దంపతులిద్దరూ చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ నిల్చున్నారు. సుప్రభాతసేవ పూర్తికాగానే
అక్కడ వున్న అర్చకులతో రాజుయొక్క అనారోగ్యము, తిరుమల యాత్రతో స్వామి అనుగ్రహంతో రాజు అనారోగ్యం పూర్తిగా నయమవటం తెలిపారు.
అప్పుడు అర్చకులు ఆ రాజుతో మహారాజా! ఈ శ్రీనివాసుడు భక్త వత్సలుడు.తనను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి. ఆ స్వామిని జీవితాంతం కొలచి మీ జన్మను సార్థకం చేసుకొనవలసింది అని అన్నారు. అప్పుడు రాజ దంపతులిద్దరూ “ఓ శ్రీమన్నారాయణా! శ్రీనివాసా!
నీవు భక్త సులభుడవు. నిన్ను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే
అమృతమూర్తివి. ఈ సృష్టిలో నిన్ను మించిన దైవం లేదు. నీకివే మానమస్కారాలు”. అని పరిపరివిధాల ప్రార్థించి తిరిగి రాజ్యానికి పయనమై
కలకాలం సుఖంగా జీవించారు.
అశ్వనీ నక్షత్రం నాడు స్వామిని దర్శించినవారికి సంపూర్ణ
ఆరోగ్యంతోపాటు, ఐశ్వర్యమూ కలుగుతుంది. ఎటువంటి అనారోగ్యమైనాక్షణంలో మాయమౌతుంది. ఎంతటి దీర్ఘవ్యాధులైనా అశ్వనీ నక్షత్రంనాడు శ్రీ స్వామిని దర్శించటం వలన వెంటనే నయమవుతాయి.ఓ శ్రీనివాసా! నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణా! నీకివే ప్రణామములు. ఓ జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.
" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి