30, జనవరి 2025, గురువారం

సవాళ్లపై గెలవడమే.

 డిఫీట్(defeat)అన్న పదమే ఒక ఫీట్!*

```

అప్పటి దాకా విజయంతో విర్రవీగే శాల్తీని ఒక్కసారి పల్టీ కొట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే ఆపజయం.


విజయకాంక్షకు మంచిచెడుల విచక్షణ ఉండదు. అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి. తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణవుతుంది. 


జపనీయులకు తాజా చేపలంటే ఇష్టం. కానీ జపాన్ సమీప సముద్రజలాల్లో చాలినన్ని చేపలు దొరికేవి కావు. అందుకని మత్స్యకారులు పెద్ద నావల్లో బాగా దూరాలు వెళ్లి చేపలు పట్టేవారు. కానీ, తిరుగు ప్రయాణానికి చాలా సమయం పట్టడంతో వాటిలోని తాజాదనం తగ్గిపోయేది. 


ఈ ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఫ్రీజర్ లు ఉనికిలోకి వచ్చాయి. పట్టుకొన్న చేపల్ని అక్కడికక్కడే నావల్లో అమర్చిన ప్రీజర్లలో భద్రం చేసేవాళ్ళు దాంతో మరింత దూరం వెళ్లి ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారు. 


ఎంతైనా తాజా చేపలే రుచి అనుకున్న ప్రజలు వాటికే ప్రాధాన్యం ఇవ్వటంతో, ఫ్రీజ్డ్ ఫిష్ మార్కెటింగ్ చేసే కంపెనీలు దివాలా బాటపట్టాయి. 


ఈ సమస్యకూ ఆ కంపెనీలు విరుగుడు కనిపెట్టాయి. నేరుగా నావల్లోనే నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకొన్నాయి. వ్యాపార సంస్థలకు లాభాలు ప్రధానం కాబట్టి తక్కువ సైజు తొట్టెలలో సాధ్యమైనంత ఎక్కువ సరుకు కుక్కుతుండేవి. నీటిలో కదిలేందుకు చాలినంత చోటు లేక నీరసపడిపోయేవి చేపలు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 


అయినా మత్స్య పరిశ్రమ మొత్తం తలలు పట్టుకు కూర్చోలేదు. జపనీయులు సహజంగానే కార్యసాధకులు. ఆ పట్టుదల కారణంగానే నేటికీ రుచికరమైన తాజా మత్స్యాహార పదార్ధాలకు జపాన్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది. 


చివరికి వారేంచేశారంటే... నీటి ట్యాంకులో చేపలతో పాటు ఒక చిన్న షార్క్ ను కూడా వేసేవారు. ప్రాణభయంతో చేపలు అనుక్షణం కదులుతూ అప్రమత్తంగా ఉండేవి. ఆ కదలికల్లోని చురుకుదనం వాటిని జీవకళతో తాజాగా ఉంచేది.


జగజ్జేతగా ఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ జీవితమంతా విజయగాథలతో నిండిలేదు. పెషావర్ యుద్ధంలో 'అశ్వకుల' అనే బలమైన శత్రుజాతిని వీరోచితంగా ఎదుర్కొనే శక్తి చాల్లేదతనికి! దాంతో రాత్రి చీకట్లో కోటలోకి జొరబడి మూకుమ్మడి ఉచకోతలకు తెగబడ్డ ఉదంతాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు సుధాకర్ చటోపాధ్యాయ'ద అకమీనీడ్స్ అండ్ ఇండియా'లో గ్రంథస్థం చేశారు.


సవాళ్లు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి.వాటిమీద పైచేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది. 


గెలుపు కేవలం సంతృప్తినే కాదు.. సంతోషాన్ని అందిస్తుంది. 


సంతోషంగా జీవించడమంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లపై గెలవడమే.

కామెంట్‌లు లేవు: