26, ఏప్రిల్ 2020, ఆదివారం

నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు.

   నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు అనే భావన చాల మంచిది ఇది ప్రతి మనిషికి ఊరట నిస్తుంది. కానీ కొన్ని సమయాలలో ఇదే ప్రాణాలను హరిస్తుంది కూడా. నేను దైవ భక్తుణ్ణ నన్ను కాపాడటం దేముడి కర్తవ్యం.  ఎందుకంటె నేను రోజు దైవ ప్రార్ధన చేస్తాను.  అని కొందరు మూర్కులు ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రవర్తించి మృత్యువాత పడ్డ  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్న.  ఇక్కడ మతం ముఖ్యం కాదు కేవలం నమ్మకం ముఖ్యం.  ప్రతి మనిషికి ఎవరో ఒకరు దేముడు ఉంటాడు.  కానీ కొంతమంది తమ దైవం మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడని.  అందరు ఆ దేముడినే కొలవాలనే మూర్ఖపు ఆలోచనలో వుంటారు.  నిజానికి ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక దేముడు ఉన్నాడు. ( దేముడు అనే పోస్ట్ చదవగలరు) 

భక్తులని కాపాడటం దేముడి కర్తవ్యమా:  ఈ ప్రశ్నకు మనం రెండు విధాలుగా సమాధాన ఇవ్వొచ్చు ఒకటి కాదు అని రెండు ఔను అని. ఒక ప్రశ్నకు ఒక జవాబు ఉండాలి కానీ రెండు విరుద్ధ జవాబులు ఉంటాయా అని మీరు అడగవచ్చు.  ముందుగా మొదటి జవాబు కాదు అనేదానికి వస్తే. 

దేముడు ఎప్పుడు ఎవ్వరిని కాపాడటం కానీ, లేక శిక్షించటం కానీ చేయడు.  ఈ సంగతి తెలియని కొందరు మూర్ఖులు వారు చెప్పినట్లుగా నడవక పోతే  నరకానికి వెళతారు అని అమాయక మానవులతో చెప్పి వారి పబ్బం గడుపుకుంటున్నారు.  నిజానికి ఆ మూర్కులే చివరకు నరకానికి వెళతారు అన్న యదార్ధం తెలుసుకోలేరు.  ఎలానో చూద్దాం. 

ప్రతి మనిషి రోజు కర్మలు అంటే పనులు చేస్తూ ఉంటాడు.  ఈ కర్మలు రెండు రకాలు ఒకటి సత్కర్మ రెండు దుష్ కర్మ ఈ రెండు ఏమిటో చూద్దాము. 
సత్ కర్మ అంటే మంచి కర్మ ఈ కర్మ చేయటం వలన మంచి కలుగుతుంది.  అంటే ఈ ,మంచి ఎవరికి కలుగుతుంది ఎట్లా కలుగుతుంది చూద్దాం. ఆకలితో వున్న వానికి అన్నం పెట్టారనుకోండి ఆ అన్నం తిన్న వానికి ఆకలి తీరుతుంది.  దాని ద్వారా అతనికి నీ పట్ల కృతజ్ఞతా భావం కలుగుతుంది. అంటే అతని మనస్సు ప్రశాంతతగా నీ పట్ల ఉంటుంది.  దీని ఫలితం మంచి ఫలితం అని అనుకుందాం. ఈ మంచి ఫలితమే పుణ్యం అని అంటారు.  అంటే నీవల్ల ఎదుటి వానికి కలిగిన  మేలు.  ఇతర జీవులకు మేలు చేయటం అని అర్ధం.  

నీవు ఏ కారణం లేకుండా ఒక మనిషిని కానీ, జంతువుని కానీ హింసించావనుకో దానివల్ల అతనికి నీమీద కోపము, ద్వేషము కలుగుతాయి అంటే అతని మనసు నీ కారణంగా క్షోభిస్తుంది.  దీని వల్ల నీకు చెడు ఫలితం వస్తుంది.  అదే పాపం. అంటే ఏది ఎదుటువాడు నీకు చేస్తే నీవు బాధపడతావో అది నీవు ఎదుటివాడికి చేయటం పాపం.  అదే విధంగా నీకు ఎదుటివాడు ఏది చేస్తే నీవు ఆనందపడతావో అది నీవు ఎదుటి వానికి చేయటం పుణ్యం అన్నమాట. 

ప్రతి మనిషి పూర్తిగా పాపాత్ముడు కాడు అదే మాదిరిగా పుణ్యప్తుడు కాడు.  ఎందుకంటె మనం రోజు చేసే కర్మలలో సత్ కర్మలు, దుష్ కర్మలు రెండు ఉంటాయి. అంటే మనకు రోజు కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు మన అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి అన్న మాట.  అంటే మనిషి పాప,పుణ్యాల మిశ్రమం.  అయితే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కక్క విధంగా ఎందుకు వుంటారు అనే సందేహం వస్తుంది.  నిజానికి ఈ పాప పుణ్యాల ఫలితమే ఈ రోజు మనకు వున్న ఈ శరీరం.  అందుకే ఈ శరీరాన్ని ప్రలబ్ద దేహంగా జ్ఞ్యానులు చెపుతారు. 

భక్తుని దేముడు ఎలా కాపాడుతాడు.  దేముడికి ఎవరిమీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు.  మనిషి చేసిన పాప పుణ్యాల ఫలితమే తానూ పొందే సుఖ దుఃక్కాలకు కారణం.  కేవలం దైవ భక్తి వలన పుణ్య కార్యాలు చేయాలనే తలపు వస్తుంది.  కానీ తాను చేసిన పాప పుణ్యాల ఫలితం పొందక తప్పదు.  కాబట్టి జీవితాంతం నేను పాప కార్యాలు చేస్తాను కేవలం ఒకసారి ఏదో ఒక మంచిపని చేస్తాను నన్ను ఆ దేముడు రక్షించాలి అని అనుకోటం కేవలం అమాయకత్వం మాత్రమే.  మనం పాప పుణ్యాల డేటాను ఒక బ్యాంక్ అకౌంటుతో పోలుద్దాము .  నీవు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొన్నావు అనుకో అది పాపం.  ఒక వెయ్యే రూపాయలు డిపాజిట్ చేసావనుకో అది పుణ్యం.  ఇప్పుడు నీవు ఒక పది వేలు కావాలని చెక్ ఇచ్చావనుకో ఆ చెక్కు హానర్ కాదు ఎందుకంటె నీకు బ్యాలన్స్ లేదు కాబట్టి.  అంతే కాక నీ వద్దనుండి బ్యాంకు వాళ్ళు 90 వేలు రికవరీ చేస్తారు.  నీ ఆస్థి అమ్మి ఆయన కట్టాలి.  అదే విధంగా నీవు తక్కువ పుణ్యం చేసి దేముడు నిన్ను కాపాడుకుంటాడని అనుకుంటే దేముడు కాపాడాడు సరి కదా నీ బాలన్స్ పాపాన్ని నీవు అనుభవించాలి.  అది ఎట్టి పరిస్థితిలోను తప్పదు.  ఇది తెలియని వాళ్ళు కొందరు  నేను ప్రతి రోజు దేముడిని ఆరాధిస్తాను కాబట్టి నాకు దేముడు ఎప్పుడు తోడుగా ఉంటాడని విర్రవీగుతూ వుంటారు అంతే కాక్ వాళ్ళు ఇతరులు పాపాత్ములుగా భావిస్తుంటారు.  కానీ నిజానికి  వారికీ వారు చేసిన  పాపలు పుణ్యాల మీదే వారి ప్రాప్త ప్రాప్తాలు లభిస్తాయి.  దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది కేవలం పాప రహితులు కేవలం అధిక పుణ్యం చేసిన పుణ్యప్తులు మాత్రమే దైవ కృపకు ప్రాప్తులౌతారు.

దేముడు - పుణ్యప్తులు.
పుణ్యప్తులు అంటే పుణ్య కార్యాలు ఎక్కువగా చేసే వాళ్ళు.  అంటే ఎవరైతే వారి జీవితాన్ని ఒక క్రమశిక్షణగా గడుపుతారో ఎవరైతే వారి జీవితాన్ని ఇతరుల క్షేమంకోసం శ్రమిస్తారో వారు దేముడికి దగ్గరగా వుంటారు.  వారిపై ఆ చేరా చెర జగన్నాధుడు సర్వ వేళల నీడలా వుంటూ వారిని కాపాడుతూ ఉంటాడు.  ఈ భూమి మీద దీర్ఘ కాలం జీవించటం మాత్రమే దైవ కృప అనుకుంటే పొరపాటే అవుతుంది.  ఈ జీవితం మనం చేసిన పాప పుణ్యాలను అనుభవించటానికి వచ్చింది అని మాత్రమే తెలుసుకోవాలి.

షడ్భాగం మనుష్యాణాం సప్తమం దైవ చింతనం. అనే నానుడి ననుసరించి మానవుడు ఆరు విధాలుగా ప్రయత్నం చేసి తానూ ఫలితం పొందని పరిస్థితిలో మాత్రమే ఏడవ భాగం దైవ చింతనం అంటే దేముడి అనుగ్రహం మీద ఆధారపడవలసి ఉంటుంది.  అప్పుడు మాత్రమే దేముడు తప్పకుండా కాపాడుతాడు.

గజేంద్ర మోక్షం: ఈ కధ ఇప్పుటి పరిస్థితికి పూర్తిగా సమన్వయకరణంగా తోడ్పడుతుంది. గజేంద్రుడు తన బలం మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు.  కానీ తన బలంతో మకరిని ఎదుర్కొనలేక పోయాడు.  వెంటనే అనేక మంది దేముళ్ళను అనేక విధాలుగా ప్రార్ధించాడు.  కానీ లాభాము లేక పోయంది.  చివరికి " లా ఒక్కింతయు లేదు దేర్యమ్ము  విలోలంబాయే   అని నీవే తప్ప ఇతప్పారంబు ఎరుగను అని త్రికరణ శుద్ధిగా శరణాగతి కోరాడు.  అప్పుడు మాత్రమే ఆ దేముడు కరుణించాడు గజేంద్రుని కాపాడాడు.  ప్రస్తుతం కొందరు వివిధ రకాల దుస్తులు ధరించి తాము సాక్షాతూ దేముడి వారసులం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరులు తమకు దాసులు అని భవిస్తూ బాహ్య డంబాచారాలు పోతూ సామాన్యులను మోసగిస్తున్నామని అనుకుంటున్నారు.  కానీ నిజానికి వారు  వారినే వారు మోసగించుకుంటున్నారు,  వారు ఇతరులను ఉద్దరించటం అటుంచి వారే పాపకూపంలో త్రొక్కబడుతున్నారు. . వారి చేష్టలకు అనుగుణంగా ఫలితాలు అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు.  కానీ అది వారు గుర్తించక పోవటం విచారకరం.

గజేంద్రుడు ఏ రకంగా అనేకవిధాలుగా ప్రయత్నించి చివరికి దేముడి కృపకు పాత్రుడు అయినాడో అదే విధంగా మనం ఈ  కరొనను ఎదుర్కొటం కోసం షడ్భాగం అంటే ఆరు రకాలుగా ప్రయత్నించాలి  అవి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమనగా
1) ఇంట్లోనే ఉండటం. 2) చేతులు ముఖం సబ్బుతో మాటి మాటికీ కడుగుకోవటం. 3) ఇతరులకు దూరంగా ఉండటం. 4) తప్పనిసరి ఐతే తప్ప బైటికి వెళ్లకపోటం. 5) ఎవ్వరితో చేతులు కలపక పోవటం. 6) బైటికి వెళితే మాస్కు ధరించటం అనే ఈ ఆరు భాగాల ప్రయత్నం  చేసి ఏడవది ఐన దైవ చింతనం అంటే భగవంతుడిని ప్రార్ధించడం చేస్తే తప్పకుండ దేముడు మనలను కరోనా నుండి కాపాడుతాడు.

కానీ కొందరు నా కేమి కాదు దేముడు నన్ను కాపాడతాడు అని రోడ్డుమీద పని వున్నా లేకున్నాఇష్టమొచ్చినట్లు తిరుగుతూ, వెంట  చిన్న పిల్లలని కూడా తీసుకొని వాళ్లతో పాటు వాళ్ళ ఇంట్లోని 60 సం. ధాటిని వృద్ధులిని, తీసుకొని వెళ్లే వాళ్ళను ఏ దేముడు కాపాడాడు. ఇంకా ఇంట్లో ఏమి తోయటం లేదని కూరల బండి వద్దకు, కిరాణా షాపుల వద్దకు, దేముడి గుడికి వెళ్లే ఆడవారిని ఏదేముడు కాపాడడు వారికి అతి వేగంగా కరోనా సోకె ప్రమాదము వున్నది.
సరదాగా కిరానా షాపుల దగ్గర పాన్ షాపుల దగ్గర నిలుచొని సిగరెట్ తాగే మూర్కులారా ఇకనైనా కళ్ళు తెరవండి ప్రమాదాన్ని గుర్తించండి జాగ్రత్త వహించండి.

దేవానాం మనుష్య రూపేణా; అన్న ఆర్యోక్తి ప్రకారం దేముడు ఎప్పుడు మనిషి రూపంలోనే మనకు సహాయం చేస్తాడు.  అది తెలుసుకోక మనం సాటి మనిషి మాటను లెఖ్ఖ చేయం దాని పర్వయవసాయంగా చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తాము.  మన దేశ ప్రధాని మోడీ గారు మనకు చక్కగా లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్ట టానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి మన ప్రధాని మోడీగారు మానుషరూపంలో వున్నా దేముడు మనమంతా మోడీ గారికి కృతజ్ఞతలు తెలపాలి.
ఈ విపత్కర పరిస్థితినుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
 తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త
ఓం శాంతి శాంతి శాంతిహి:











కామెంట్‌లు లేవు: