రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “సంధ్యాయై నమః' అని చెప్పాలి.
సం + ధ్యా - సంధ్యా అనగా - 'సమ్యక్ + ధ్యానము' అని 'సంధ్యా' పదం సూచిస్తుంది కాబట్టి చక్కగా ధ్యానము చేయబడునది అని అర్థం వస్తుంది. సంధ్యాకాలం గుఱించి ఈ క్రింది విధంగా చెప్పబడింది.
'అహోరాత్రస్యయస్సంధి సూర్య నక్షత్ర వర్జితః, తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాత స్సమాహితః
సూర్యుడు, నక్షత్రాలు లేని 'రాత్రి - పగటి' సంధికాలాన్ని సాయం సంధ్యా కాలం అంటారు. అంటే - సూర్యుడు అస్తమించిన తరువాత, నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యా కాలంగాను, నక్షత్రములు కనబడకపోయిన తరువాత, సూర్యుడు ఉదయించక ముందు ప్రాతః సంధ్యా కాలంగాను గుర్తించారు.
వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యా కాలాలు ప్రతి రోజూ గుర్తించడం కష్టమౌతుంది. అందుకని ఛాందోగ్యంలో – వేరే విధంగా నిర్ణయించారు. దీని ప్రకారం సూర్యబింబం సగంకనబడునప్పటి నుండి నక్షత్రాలు కనబడేంతవరకు మధ్య గల కాలం సాయం సంధ్యా కాలంగాను; అలాగే, సూర్యోదయానికి మూడు ఘడియలు (72 ని.లు) కాలముండగా నక్షత్రాలు కనబడే కాలం నుండి సూర్యోదయమయే వరకు ప్రాతః సంధ్యాకాలం గాను నిర్ణయించారు. సూర్యునితో కూడి యుండిన సాయంసంధ్య, నక్షత్రాలతో కూడి యుండిన ప్రాతః సంధ్య, పగటికాలంలో 3/5 నుండి 4/5 వంతు దాకా ఉండే కాలంతో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలాలను సంధ్యావందనానికి ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు.
ఈ సంధ్యాకాలాల్లో అర్ధమవని విషయాలు అర్థమవుతాయని, జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుందని కనబడని (invisible) కనబడే (visible) జ్ఞానదేవతలు కలసి ఈ సంధ్యాకాలాలల్లో విధులగూర్చి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెబుతారు. మళ్ళీ- ఈ మూడింటిలో ప్రాతః కాల, సాయంసంధ్యా ధ్యాన సమయాలు మరింత ఎక్కువ ప్రయోజనకరంగా వుంటాయేమోననిపిస్తుంది. (ఎందుకంటే - దేవతలు గూడా విధులు Duties మారే సమయాలు ఇవి కాబట్టి). (మాస్టరు సి.వి.వి. గారు కూడా ఈ ప్రాతః సంధ్యా, సాయం సంధ్యా సమయములకు సమన్వయముగా ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 'ప్రేయరు' చేయమన్నారు.)
'సంధ్య' అంటే మధ్య ఉండేది - అనే అర్థం కూడా ఉంది. పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఐదింటిలో మధ్యగా ఉండేది మనోమయ కోశం. ' అన్యోంతర ఆత్మామనోమయు:', ... తస్య యజురేవశిరః, ఋక్ దక్షిణ పక్షః, సామోత్తర పక్షః, ఆదేశ ఆత్మా, అధర్వాంగిరసః పుచ్చం ప్రతిష్టా' - అని తైత్తిరీయం చెబుతుంది.
మనోమయ కోశానికి శిరస్సు - యజుర్వేదం;
దక్షిణ పార్శ్వం - ఋగ్వేదం;
ఉత్తర పార్శ్వం - సామవేదం;
ఆదేశాలు అంటే బ్రాహ్మణాలు (Commentaries) - ఆత్మ, అధర్వణ వేదం - ప్రతిష్టారూపమైన పుచ్ఛం' అని పై మంత్రానికి అర్థం. కాబట్టి, ఈ విధంగా అవయవాలు కలిగిన మనోమయ కోశమే “సంధ్య' అనే వేదం యొక్క సూక్ష్మ రూపం. సంధ్య మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టే మనస్సును ఆకాలంలో ధ్యానంలో ఉంచమని చెప్పారు. ఈ సంధ్య సాక్షాత్తూ అమ్మవారిని సూచిస్తుందని ప్రస్తుత నామం ద్వారా తెలుసుకోవాలి.
ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల సంధి స్థానం భ్రూమధ్యంలో ఉంటుంది. ఈ స్థానమే పుణ్య కాశీ పట్టణాన్ని గూడా సూచిస్తుంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. మధ్యన ఉన్న కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యా కాలాలను . సూచిస్తాయి. కాబట్టి, రెండు కన్నుల మధ్య భాగం అయిన భ్రూమధ్యస్థానాన్ని సంధ్యగా గుర్తించి, ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. ఇదే మనస్తత్వాన్ని సూచించే ఆజ్ఞా చక్రస్థానం. ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ 'సంధ్య' అమ్మవారికి బిరుదు నామంగా ఏర్పడింది.
'చక్కగా ధ్యానం చేయబడునది' అని ఈ నామానికి అర్థం.
ఓం ఐం హ్రీం శ్రీo సంధ్యాయై నమః
శ్రీ మాత్రే నమః
శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి