5, ఆగస్టు 2020, బుధవారం

పాంచ భౌతిక తత్వాలు

మోక్షం సాధన🌹పాంచ భౌతిక తత్వాలు
         ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం....... శబ్దం   

    వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

 అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

  జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

    భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

    ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

   జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

  అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది

    వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

  ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


 ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే...

కామెంట్‌లు లేవు: