రామాయణమ్. 101
..
భరతుడు చిత్రకూటపర్వతము సమీపించాడు .అతని సైన్యము చేసే కోలాహలమునకు వన్యప్రాణులు బెదిరిపోసాగినవి.
.
భరతుడు తన సైన్యంలోని వారికి ఆజ్ఞలు జారీ చేశాడు సీతారామలక్ష్మణుల జాడ కనుగొనమని.
.అందరూ తలకొక దిక్కుగా జట్లుజట్లుగా వెదుకుట ప్రారంభించారు.వారికి ఒక చోట నుండి పొగపైకి లేస్తూ కనపడ్డది. జనులు నివసించనిచో పొగ ఎట్లా ఉంటుంది ? అది ఎవరో ఒక తాపసి ఆశ్రమమో లేక రాముడి నివాసమో అయి వుంటుంది. అని నిర్ధారణకు వచ్చి సైన్యమంతటిని ఉన్న చోటనే నిలిపి వేసి తాను వశిష్ఠ సుమంత్రులతో కూడి ముందుకు వెళ్ళాడు.
.
చిత్రకూటపర్వతశోభలు వర్ణింపనలవిగాకుండా ఉన్నవి.ఆ పర్వతంమీద నివాసముండటం వలన తాను ఎంతో సంతోషంగా అందరనీ మరచిపోయి ఉండగలుగుతున్నానని రాముడు సీతతో చెపుతున్నాడు.ఇద్దరూ హాయిగా ప్రకృతిని చూసి పరవశిస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.అందమైన ప్రాంతాలను ఇంద్రుడు శచీదేవికి చూపిస్తున్నట్లుగా చూపిస్తూ ఆనందంగా విహరిస్తున్నారు ఇరువురూ!.
.
సీతా అటుచూడు నిర్మల మందాకినీ జలాలు చూడు! ఇదుగో ఇటు చూడు ఈ పద్మమాలికలు చూడు ఎవరో కాముకులు నలిపివేసినట్లున్నదికదా! .అదిగో ఆ చక్రవాకపక్షికూతలు విను ఎంత మంగళప్రదంగా మధురంగా ఉన్నదో కదా!
.
సీతా రా నాతో కలిసి జలక్రీడలాడుదువుగాని ! ఈ మందాకినీ నదిలోని ఎర్రనైన ,తెల్లనైన పద్మాలన్నీ నీ జలక్రీడలతో నలిగిపోవాలి సుమా! .
.
సీతా అందమైన ఈ చిత్రకూటమే అయోధ్య,ఇందులోని మృగాలే పౌరులు ,ఈ మందాకినిని సరయూనదిగా భావిస్తూ నీవూ లక్ష్మణుడు తోడుంటే ఎన్ని యుగాలైనా ఇక్కడే గడిపేస్తాను..
.
ఇలా ఆనందంగా విహరిస్తూ ఆవిడను అనునయిస్తూ ఇదిగో ఇది రుచిగా ఉన్నది,ఇదుగో ఇది బాగా కాలింది అని మాంసము తినిపిస్తూ పర్వతశిఖరంపై కూర్చున్నాడు రాముడు.
.
ఇంతలో ఆయనకు భరతుడి సేనచేసే కలకలధ్వనులు వినపడ్డాయి. ఆ సేనలోని అశ్వ,గజముల పదఘట్టనకు రేగిన ధూళి ఆకాశాన్ని కప్పి వేస్తూ కనపడ్డది.
.
సైన్యం సృష్టించిన అలజడికి అడవిలోని మృగాలన్నీ భయంతో పరుగెత్తుతూ వికృతంగా అరుస్తున్నాయి.
.
అప్పుడు రాముడు లక్ష్మణునితో అదేమిటో చూడమని చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఒక సాలవృక్షాన్ని ఎక్కి నలుదెసలా పరీకించి చూశాడు...
.
ఉత్తరము వైపు చూస్తూనే మహోగ్రంగా అన్నా!
నీవు అగ్నిని చల్లార్చు,
సీతమ్మను గుహలోకి భద్రముగా పంపివేయి ,
కవచముధరించు!
,ధనుర్బాణాలను సిద్ధంచేసుకోఅంటూ అరిచాడు.
.
లక్ష్మణా ఎందుకంత ఆవేశం! ఆ సేన ఎవరిదో సరిగా చూడు అని రాముడన్నాడు.
.
ఇంకెవరిది ఆ కైక కొడుకు భరతుడిది! మనల్నిద్దరినీ చంపివేయటానికే ఇంతసేనతో ఇక్కడికి వస్తున్నాడు. అదిగో కోవిదారధ్వజము స్పష్టముగా కనపడుతున్నది.
.
ఓ మహావీరా లే ! మనమిరువురమూ ధనుస్సులు ధరించి పర్వతము పైకెక్కుదాము. ఎవడి మూలంగా నీవు రాజ్యభ్రష్టుడవైనావో!
ఆ భరతుడు వధార్హుడే ,చంపివేద్దాము ఇప్పుడే !
అన్నా త్వరగా లే అంటూ గావుకేకలు పెడుతున్నాడు లక్ష్మణుడు.
.
వాడితో పాటు కైకను కూడా చంపేస్తాను భూమిపైఉన్న పాపము నేటితో తుడిచిపెట్టుకు పోతుంది!.వాడి సైన్యాన్నంతా చీల్చి చెండాడతాను. ఈ చిత్రకూటమంతా రక్తపుమడుగులలో మునిగిపోవాల్సిందే ఈ రోజు,
అంటూ ఆవేశపడుతున్నాడు లక్ష్మణుడు.
.
కోపంగా ఉన్న లక్ష్మణుడిని చూసి రాముడు శాంతంగా ,
వచ్చేది భరతుడే అయినప్పుడు ఇంక ధనుస్సుతో,కత్తితో ,డాలుతో పని ఏమున్నది?
.
లక్ష్మణా తండ్రిమాట నిలుపుటకు అడవికి వచ్చిన నేను నేడు నను చూడవచ్చిన భరతుని చంపి అపకీర్తి మూటకట్టుకోమంటావా!.
.
బంధునాశనము,మిత్రనాశనము వలన కలిగిన సంపదలు నాకు విషపుకూడుతో సమానము.
.
నా తమ్ములైన మీ అందరూ సుఖించి ఉండ లేని రాజ్యము నాకెందుకు? నిజానికి నేను రాజ్యము కోరేది మీ అందరినీ సుఖంగా ఉంచడానికి మాత్రమే
.
నేను తలుచుకొంటే సముద్రపర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యము లభించటం ఎంతసేపు?
.
అధర్మమువలన వచ్చిన ఇంద్రపదవికూడా నేను స్వీకరించను!.
.
లక్ష్మణా ! నీవూ,భరతుడు,శత్రుఘ్నుడు అనుభవించలేని ఏ సుఖం నాకు కలిగినా దానిని కాల్చి బూడిదచేస్తాను.
.
మీ మువ్వురితో కలిసి ఉండటంలోనే నాకు సుఖమున్నది!
.
భరతుడు ఎలాంటి వాడనుకొన్నావు?
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి