16-19-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఇంతవఱకు అసురస్వభావముగలవారి లక్షణములను జెప్పి ఇక రెండు శ్లోకములద్వారా వారు పొందు ఫెూరదుర్గతిని వివరించుచున్నాడు -
తానహం ద్విషతః క్రూరాన్
సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్ర మశుభాన్
ఆసురీష్వేవ యోనిషు ||
తాత్పర్యము:- (ఆ ప్రకారము సమస్తప్రాణులలో గల ఆత్మయగు) నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ(పాప)కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను జననమరణ రూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచ జన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.
వ్యాఖ్య:- "ద్విషతః" - ఇతరుని ద్వేషించినచో ఆతని హృదయమున భగవానుడు కలడు కనుక భగవానుని ద్వేషించినట్లే యగుచున్నది.
పైనదెల్పిన ప్రకారముగ అసురగుణములుగలిగి భగవంతుని ద్వేషించుచు నీచకార్యములకు గడంగునట్టి జనుల కెట్టి భయంకరపరిణామము గలుగునో ఇచట తెలియజేయుచున్నారు. ప్రపంచములో సత్కార్యములు చేయువారికి సద్గతి, దుష్కార్యములు చేయువారికి దుర్గతి యను ఫలితములు సృష్టియందే ఏర్పడియున్నవి. అది ఈశ్వరనియతి. దాని నెవరును ఉల్లంఘించరాదు. ఉల్లంఘించినచో దాని దుష్ఫలితములకు వారే బాధ్యులగుదురు. కనుకనే భగవానుడు మొట్టమొదట అనేక దైవగుణములుచెప్పి, వానిని ఉల్లంఘించువారు, అనగా అసురగుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగ నీచజన్మలను, ప్రవాహరూపమగు ఈ సంసారముననే పడి పుట్టుచు, చచ్చుచు పలువిధయాతనల ననుభవించుచుందురు. కాబట్టి అసురగుణముల నెవరును అవలంబించరాదు. దైవసంపదనే ఆశ్రయించి ముక్తిని బడయవలెను.
‘తానహం' - ‘నేనే వారిని కర్మఫలానుసారముగ కృమికీటకాది, రాక్షసాది నీచ జన్మలందు బడదోసెదను" అని శ్రీకృష్ణమూర్తి చెప్పుటవలన, సర్వజగన్నియామకుడు, సర్వశాసకుడు, కర్మఫలప్రదాత, సర్వజీవగతినిర్ణేత ఆ పరమాత్మయే యని స్పష్టమగుచున్నది.
"నరాధమాన్" - "మనుజాధము”లను కఠినపదము నిచట ప్రయోగించుటవలన భగవానుడు పాపులపై, దైవవిద్వేషులపై, అసురగుణాశ్రయులపై ఎంతటి రౌద్రమును వహించిరో తెలియుచున్నది. "వినాశాయ చ దుష్కృతామ్' అని ఇదివఱలో పాపాత్ములను శిక్షించుటకు (పుణ్యాత్ములను రక్షించుటకు) తానవతరించుచుందునని పలికిన వాక్యములను ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలయును. మనుజుడు నరాధముడుగ నుండరాదు, నరోత్తముడుగ నుండవలెను. పురుషాధముడుగ వర్తింపక పురుషోత్తముడుగ నుండుటకైయే యత్నింపవలెను. ఒకవేళ పాపకార్యములుచేసి నరాధముడుగ మారెనా, తగినశాస్తి జరిగియే తీరునని యిచట వచింపబడినది. కాబట్టి మనుజులు భయభక్తులుగల్గి జాగరూకులై, తమ విజ్ఞత నుపయోగించి తమ జీవితమున అసురగుణముల నేమాత్రము ఆశ్రయింపక దైవీసంపదనే బాగుగ అభ్యసింపవలయును.
'సంసారేషు', ' ఆసురీష్వేవ యోనిషు' - అని బహువచనము ప్రయోగించుటచే వారు ఏ ఒకటి రెండు జన్మలో కాదు, కృమికీటకాది, రాక్షసాది అనేక జన్మలను పొందుదురని స్పష్టమగుచున్నది. సంసారమునందే, జన్మపరంపరయందే పడి వారు తమ దుష్కర్మప్రభావముచే అందుండి తప్పించుకొనజాలక నానాబాధలను పొందుచుందురు. పారిపోవు గొఱ్ఱెను కసాయివారు మఱల వెనుకకు తెచ్చి వధించుచందమున అట్టినీచులు దుఃఖమునుండి, సంసారబంధమునుండి తప్పించుకొనదలంచినను, దుష్కర్మఫలితముండు వఱకు భగవదాజ్ఞచే తిరిగి దానియందే పడద్రోయబడుదురు.
గరుడపురాణమును చదివినచో ఏ యే పాపముచేసినవారు నరకమున ఏ యే దుఃఖమనుభవించుచుందురో బాగుగ తెలియగలదు. అట్టి దారుణ నరకదుఃఖమునుగాని, కృమికీటకాది నీచజన్మజనితదుఃఖములనుగాని తప్పించుకొనదలంచు ప్రతిమానవుడును తన చరిత్రవిషయమై కడుజాగరూకుడై భగవానుడు పైనదెలిపిన దుష్టప్రవృత్తులు (ఆసురసంపద) ఏవియు లేకుండ చూచుకొని, సదాచారపరాయణుడై కైవల్యపదము నలంకరింపవలయును.
"క్షిపామి" - "విసరివేసెదను” - పాపాత్ములను, అసురగుణావలంబులను "నీచజన్మలందు చేర్చెదను” అని చెప్పక నీచ జన్మలందు విసరివేసెదనని భగవానుడు పలుకుటచే అట్టి దుర్మార్గులయెడల భగవాను డెంతటి తీవ్రవైఖరి యవలంబించెనో తేటతెల్లము కాగలదు. ఒక రాయినిగాని, బంతినిగాని దూరముగ విసరునట్లు పాపులను నరకాదిలోకములలో నీచజన్మలందు విసరివేయుదునని శ్రీకృష్ణపరమాత్మ యిచట చెప్పిరి. కావున భగవదాశయమును, జగన్నియతిని ఎఱిగి సత్పథమునే చేబట్టుట విజ్ఞుల కర్తవ్యము.
'అజస్రమ్' - (ఎల్లప్పుడు) - జనుల దుష్ట ప్రవృత్తు లెంతకాలముండునో అంతకాలము దుఃఖము వారిని వెన్నంటుచునే యుండును. నీడవలె శోకము వారిని అనుగమించుచుండునని ‘అజస్రమ్' అను ఈ పదముచే స్పష్టమైనది. కొందరిట్లు ప్రశ్నించుదురు - ‘అయ్యా! ఈ సంసారబాధలు మాకింకను ఎన్నాళ్లుండును?' - వారి యా ప్రశ్న కిచట సమాధానమొసంగబడినది. జనులందు పాపము, దుర్మార్గము, దుశ్చరితము, భగవద్విస్మృతి, అజ్ఞానము మున్నగునవి ఎంతవఱకుండునో అంతవఱకును ఈ దుఃఖములు జనులను వీడనేవీడవు. దుర్గుణములు ఎల్లపుడుండుచో ఈ తాపములున్ను ఎల్లపుడుండును అవి పోయినచో ఇవియు పోవును.
‘అజస్రమ్' అను పదముచే - “పాపాత్ములకు శిక్ష లభించును" అను ఈ శాసనము ప్రపంచమున ఎల్లపుడును అమలునందుండును - అను భావమున్ను వ్యక్తమగుచున్నది.
ప్రశ్న:- అసురగుణములు కలవారికి, దైవవిద్వేషులకు ఎట్టి ఫలితము లభించును?
ఉత్తరము:- వారు దైవనియతిచే అసురసంబంధమైన నీచజన్మలందే మఱల మఱల పుట్టుచుందురు. అనగా కృమికీటకాది, రాక్షసాది హీనజాతులందే వారు (దుష్కర్మలనివృత్తికాలమువఱకు) జన్మించి నానాయాతనల ననుభవించుదురు. భగవానుడే వారలను ఆ యా జన్మలందు విసరివేయును.
ప్రశ్న:- దైవశాసన మెంతకాలముండును?
ఉత్తరము:- ఎల్లపుడును ఉండును (అజస్రమ్).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి