23, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 164

 రామాయణమ్ 164

..............

రావణుడు తాను అపహరించిన సీతను తీసుకొని ఆకాశ మార్గాన వెళుతూ తన అంకమందు కూర్చుండబెట్టుకొని వేగముగా ప్రయాణిస్తూ ఉన్నాడు .

.

అప్పుడు ఆ తల్లి ఆకసములో ప్రయాణించే 

ఒక నిప్పులముద్ద లాగా కనపడ్డది. 

నల్లనిమేఘమును వెనుక ఉంచుకొని ప్రయాణించే చందమామ లాగ కనపడ్డది .

.

వాడు ఆవిడ కొప్పుపట్టుకొన్నప్పుడు ఊడిన సిగపూలు రాలి ఆకసమునుండి జారి పడుతూ భూపతనమవుతున్న పూలనదిలాగా ఉన్నది.

.

విదిలించుకొంటున్న ఆవిడ పాదములనుండి ఒక నూపురము జారి మెరుపుచక్రములాగా ధ్వనిచేయుచూ నేల రాలింది .

.

పెనుగులాడుతున్న ఆవిడ శరీరమునుండి అలంకారములన్నీ దివినుండి భువికి జారే నక్షత్రాలా అన్నట్లుగా కనిపిస్తున్నాయి .

.

ఆవిడ మెడ నుండి జారిపడుతున్న ముత్యాల హారము ఆకాశ గంగ భూమికి దిగివస్తున్నట్లుగా కనపడ్డది .

.

రావణుడి గమన వేగానికి పుట్టిన గాలికి ఊగిన వృక్షములు సీతకు భయపడవద్దని ధైర్యము చెపుతున్నట్లుగా అనిపించింది.

.

వన్య మృగములన్నీ తల పైకి ఎత్తిచూస్తూ కోపముగా రావణుని గమనమార్గమును అనుసరించి పరుగులుపెట్టినవి ,

.

గోదావరీ మాత సీతనే చూస్తూ తన దారినే మరచి గమనదిశను మార్చి క్రింద కానరాక లోయలో పడిపోయింది.

.

సూర్యుడు కాంతిహీనమై తెల్లగా కనపడ్డాడు .

.

లేదు సత్యానికి స్థానము 

లేదు ధర్మానికి స్థానము

లేదు ఋజుత్వానికి స్థానము

లేదు మంచితనానికి స్థానము 

అని సమస్త భూత గణాలు ఆక్రోశిస్తూ గుంపులు గుంపులుగా చేరి అగుపించాయి.

.

రాముడెక్కడున్నాడో ,లక్ష్మణుడు ఎక్కడున్నాడో అని ఆకసమునుండి క్రిందకి చూస్తూ వెతుకుతూ రామా లక్ష్మణా కాపాడండి అంటూ విలపించసాగింది సీతామహాసాధ్వి.

.రామాయణమ్ ..165

.............................

పెనుగాలికి ఊగిపొయె చివురుటాకులాగా వణికిపొతున్నది సీతమ్మ .

 అయినా ధైర్యము కోల్పోలేదు.

.

 రాజపుత్రి ,రామపత్నికదా! ! 


వరదలైపారుతున్న దుఃఖ్ఖాన్ని అదుపుచేసుకోలేక సతమతవుతూ రావణుని ఎదిరిస్తూ మాట్లాడసాగింది.

.

 ఒంటరి స్త్రీని అపహరించిన నీవూ ఒక వీరుడవేనా? 

నీదీ ఒక శౌర్యమేనా ? 

.

నీ వంశము గొప్పదని ,చాలా గొప్పవాడినని బీరాలు పలికావు ఇదెనా నీ గొప్పతనము ? 

రాముని ఎదిరించి నిలువలెక ఒక దొంగ లాగా వచ్చి అపహరించటానికి సిగ్గుగా లెదా ?

 ఒక ముహూర్తకాలము నిలువు నీవు వీరుడవైతె ?

 రామలక్ష్మణుల బాణాగ్నిలొ మిడతలాగా దగ్ధమైపొతావు ! 

వారి కంటబడ్డావా నీవు!

 నీ పని అయిపొయినట్లె !.

.

ముల్లొకాలలొ ఎక్కడికెళ్ళినా నీ మృత్యువు నీవెంటే వచ్చి నిన్ను కౌగలించుకుంటుంది. 

.

ఈ విధముగా మాట్లాడుతూనె తను పరిశీలనగా క్రిందకు చూస్తున్నది .

ఒక చొట అయిదుగురు వానరులు ఒక పర్వతము మీద కనబడ్డారు 

.

,అంత దీన స్థితిలొ కూడా ఆవిడ చురుకుగా ఆలొచించింది ,ధైర్యము కొల్పోలేదు ,

.

తన బంగరు ఉత్తరీయము తీసి అందుతొ పాటు నగలు కూడా జారవిడిచింది.

ఆ వానరులు తన గురించి రామలక్ష్మణులకు చెప్పాలనే ఉద్దెశముతొ అలా జార విడిచిందావిడ .

.

తొందరగా వెళ్ళెఉద్దెశముతొ ఉన్న రావణుడు ఆమె చేసిన పని గమనించలెదు..

.

పైనించి పడుతున్న వస్త్రాన్నీ ,ఆకాశములొ తీసుకుపోబడుతున్న సీతను తమ పచ్చని నేత్రాలతొరెప్పవాల్చకుండా తలపైకిఎత్తి అలాగే చూస్తూ ఉండి పోయారు వానరులు..


ఒడిలొ మహాభుజంగమును పెట్టుకొన్నట్ట్లుగా 

ఆ సాధ్వీమణిని చంకన పెట్టుకొని లంకలొ ప్రవెశించాడు రావణుడు ..

.

లంకలొ ఆ విధంగా మృత్యువు ప్రవేశించింది ..

కామెంట్‌లు లేవు: