శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
తే."విమలమానస నారదా ! యేల యిపుడు *
కూర్మితోడను నీవిట కొచ్చినావు ?
తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె
తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య " 11
క. నారాయణు డా విధముగ
కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై
నారదు డన్తట భక్తితొ
యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 12
సీ. "సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !
నీ వెఱుంగని దేది నీరజాక్ష !
మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు
పలుయోనులందున ప్రభవమొంది
వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి
యనుభవించుచునుండె యమితవగపు
పాపకర్మలతోడ పలురోగములతోడ
పీడింప బడుచుండె పెక్కురీతి
తే. యమిత బాధల క్లేశాల యనుభవమున
మహిని జీవించుచున్నట్టి మానవులకు
బాధలను బాప నేదైన పరమపథము
బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !" 13
క. ముని నారదు డావిధముగ
వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్
జనముల బాధలు దెలుపగ
విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 14
క. "మునివర ! నీ యభిమతమును
విని సంతస మొందినాను వేడుక యయ్యన్
జగముల క్లేశము బాపగ
మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 15
తే. లోక కల్యాణమును గోరి తేకువగను
యమిత యావేదనంబున యడుగ జూచి
సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర !
వినుము దెల్పెద నీకొక్క విమల పథము 16
క. వినుమో నారద ! తెల్పెద
మనమందున కలతమాని మదిస్థిమితమునన్
జనులందఱు సుఖ శాంతుల
మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 17
తే. కామితార్ధ ప్రదాయిని కల్పతరువు
"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"
యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు
పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు 18
సశేషము …
✍️ గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి