శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహాత్మ్యము
సర్వ సంపద లారీతి సమసిపోయి
కూర్మి పుత్రులు యందఱు గూలిపోగ
యధిపు కవగత మయ్యెను యంత నపుడు
సత్యదేవుని ఘోరమౌ శాపఫలము 171
"గొల్లవాళ్ళిచ్చి రనియును కోపగించి
దివ్యమైన ప్రసాదంబు తీసికొనక
దైవద్రోహంబు జేసితి దర్పమునను"
యనుచు పరితాప మొందెను యధిపు డపుడు 172
అంత తుంగధ్వజునృపుడు యడవికరగి
గొల్లలను గూడి తనయొక్క గోడు దెలిపి
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
చేయ వేడెను తానును చేరి చేయ 173
పిదప భూపతి గొల్లల పిలుచు కొనియు
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
చేసి సద్భక్తి తోడను చేతులార
దివ్యమైన ప్రసాదంబు స్వీకరించె . 174
తనదు తప్పు లెఱిగి ధరణీశు డారీతి
సత్యవ్రతము జేసి సన్నుతించ
సకల వరదు డంత సంతుష్టు డయ్యును
కామితములు దీర్చి కాచె నతని 175
శత సుతులను బ్రతికించెను
యతి సంపద లిచ్చి మఱల యధిపతి జేసెన్
వెత లన్నియు దీర్చి యతని
గతియించిన యశము గూర్చి కాపాడెనిలన్ 176
ధరణిపతి సత్యదేవుని దయను పొంది
వఱలుభక్తితొ ప్రతినెల వ్రతము జేసి
యవని సౌఖ్యంబు లెల్లను యనుభవించి
సాగె నంత్యంబునందున సత్యపురికి" 177
సశేషము ….
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి