6, డిసెంబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల

 

*కారుణ్యమూర్తి..*


శ్రీ స్వామివారు 1976 వ సంవత్సరం లో సిద్ధిపొందారు..ఆనాటికి మొగలిచెర్ల గ్రామం లో ఆమాటకొస్తే..చుట్టుప్రక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ..ప్రతి వ్యవసాయదారుడి ఇంటిలోనూ.. కనీసం ఒక ఎద్దుల జత ఉండేది..కొందరు మోతుబరి రైతుల వద్ద వారి వారి స్తోమతను బట్టి రెండు నుంచి నాలుగు జతల ఎద్దులు ఉండేవి..వ్యవసాయమంతా ఆ ఎద్దుల మీదే ఆధారపడి జరుగుతూ ఉండేది..రైతులు కూడా తమ ఎద్దులను ప్రాణప్రదంగా చూసుకునేవారు..అప్పటికి ట్రాక్టర్ల తో సేద్యం చేయడం ఇంకా అలవాటు పడలేదు..మా ఇంటిలోనూ నాలుగు జతల ఎద్దులుండేవి..ఇవికాక గేదెలు..ఆవులు..ఉండేవి..అందుకే ఆరోజుల్లో "పాడీ..పంటా.." అనేవాళ్ళు..చుట్టుప్రక్కల గ్రామాల్లో ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా..ఎద్దుల బండి కట్టుకొని వెళ్లేవారు..అలా ఎద్దులబండిలో వెళ్ళిరావడం అదొక అనుభూతి..ఇప్పటికీ నాకు బాగా గుర్తు..


రేణమాల గ్రామానికి చెందిన గంగయ్య సాధారణ రైతు..తనకున్న ఎద్దుల జత సహాయంతో..ఉన్న రెండెకరాలనూ సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు..ఒక సంవత్సరం లింగసముద్రం గ్రామంలో జరిగే తిరునాళ్లకు తన బండి కట్టుకొని వచ్చాడు..బండిని ఒక ప్రక్కగా నిలిపి..ఎద్దులను కట్టేసి, వాటికి ఇంత గడ్డి మేత వేసి, తాను తిరునాళ్ళ చూడటానికి వెళ్ళాడు..రాత్రి బాగా పొద్దుపోయేదాకా తిరిగి..తన బండి వద్దకు వచ్చాడు..బండి ఉన్నది..ఒక ఎద్దు ఉన్నది..రెండో ఎద్దు లేదు..కట్టిన కట్టు విప్పదీసుకొని..ఎటో వెళ్ళిపోయింది..తెల్లవారిన దాకా చూసాడు..చుట్టుప్రక్కల వెతికాడు.. కానీ ఎద్దు కనబడలేదు..తనకు తెలిసిన వాళ్ళ ఇంటివద్దకు బండిని చేర్చి..ఒక్క ఎద్దునూ తోలుకొని తన ఊరు చేరాడు..జత ఎద్దులు లేకుండా ఏ పనీ జరగదు..రెండు మూడు రోజుల పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి వెతికి వచ్చాడు..ఎద్దు దొరకలేదు..ఇక మిగిలింది మాలకొండ అడవి లో వెతకడం..అక్కడికి వెళ్లాలంటే మొగలిచెర్ల గ్రామం మీదుగానే వెళ్ళాలి..


ప్రక్కరోజు ఉదయం ప్రయాణమై..మొగలిచెర్ల చేరి..తనకు తెలిసిన వారందరి దగ్గరా విచారించాడు.. పొరపాటున ఎవరైనా కట్టేసి ఉన్నారేమో అని కూడా అడిగి..లేదని తెలిసి హతాశుడై.. దిక్కుతోచక కూర్చున్నాడు..గ్రామం లోని ఒక పెద్దాయన..మాలకొండ అడవిలో వెతికే ముందు..ఫకీరు మాన్యం లో ఉన్న శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు..సరే అని చెప్పి..ఆ రైతు..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..సమాధి ముందు నిలబడి..మనస్ఫూర్తిగా వేడుకున్నాడు.."స్వామీ..నాకున్న ఆధారం ఆ ఎద్దుల జతే.. అందులో ఒకటి తప్పించుకొని పోయింది..అది క్షేమంగా దొరికితే..రాబోయే ఆరాధన రోజున పదిమందికి అన్నం పెడతాను.." అని మ్రొక్కుకున్నాడు.. కొంచెం సేపు శ్రీ స్వామివారి మందిరం వద్దే కూర్చుని..మాలకొండ అడవిలో చూసి వద్దామని బైలు దేరాడు..


గంగయ్య మెల్లగా నడుచుకుంటూ మొగలిచెర్ల గ్రామం చేరేసరికి.."గంగయ్యా..నిన్ను మీ ఇంటికి తిరిగి వచ్చేయమని మీ ఆడవాళ్లు చెప్పిపంపించారు..త్వరగా రమ్మన్నారు.." అని తన ఊరు నుంచి వచ్చిన మనిషి చెప్పాడు..ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే శరణ్యం కనుక..గంగయ్య కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రానికి తన గ్రామం చేరాడు..ఇంటి వద్దకు వచ్చేసరికి..ఇంటి ముందు రెండు ఎద్దులూ కట్టేసి ఉన్నాయి..తాను వెతుకుతున్న తన ఎద్దు..తన ఇంటి ముందే గడ్డి మేస్తోంది..


గంగయ్య భార్య బైటకు వచ్చి సంతోషంతో.. "పొద్దున నువ్వు వెళ్లిన తరువాత..మధ్యాహ్నానికి ఇది మన ఇంటికి ఎవరో తోలుకొచ్చినట్లు గా వచ్చింది..వెంటనే లోపలికి తీసుకొచ్చి.. గడ్డి వేసి..నీళ్లు పెట్టాను..మన ఊరి మనిషే మొగలిచెర్ల వెళుతున్నాడని తెలిసి..అతని ద్వారా నిన్ను ఇంటికి రమ్మనమని చెప్పి పంపాను..దేవుడు చల్లంగా చూసాడు..మన ఎద్దు మన ఇంటికి వచ్చింది..రేపు కొబ్బరికాయ కొడతాను.." అన్నది..గంగయ్య భార్యతో తాను మొగలిచెర్ల స్వామి వారి వద్ద మ్రొక్కుకున్న విషయాన్ని చెప్పాడు..అలాగే చేద్దామని అతని భార్య ఆనందంగా ఒప్పుకున్నది..అనుకున్న ప్రకారమే..ఆ దంపతులు..శ్రీ స్వామివారి ఆరాధన రోజు..తమ శక్తి కొద్దీ కొంతమందికి అన్నదానం చేశారు..


ఆర్తితో పిలిస్తే శ్రీ స్వామివారు తప్పక పలుకుతారు..ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు నాకు చెప్పేవారు..ఇన్నాళ్లకు ఇలా వ్రాసే అవకాశం కలిగింది..ఏ అవధూత అయినా..తన భక్తుల కష్టాలను తన కష్టంగా భావించి..ఆ భక్తుడి బాధను తీసివేస్తారు.. కాకుంటే..మనం సంపూర్ణ భక్తి విశ్వాసాలతో వారిని కొలవాలి..అదొక్కటే వారు కోరుకునేది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699)





కామెంట్‌లు లేవు: