6, డిసెంబర్ 2020, ఆదివారం

*శ్రద్ధ చాలాఅవసరం

 *శ్రద్ధ చాలాఅవసరం..*


వేరువేరు కర్మలు వేరువేరు ఫలాలనిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజుల్లో పలువురు తామాచరించిన కర్మలకు తామనుకున్నట్లు ఫలితాలు కలగకపోవటంతో శాస్త్రాల ప్రామాణికతను సందేహిస్తున్నారు . గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు .


" అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ !

  అసదిత్యుచ్యతే పార్ధ నచ తత్ప్రేత్య నో ఇహ !! "


శ్రద్ధ లేని కర్మ కోరిన ఫలాన్నివ్వదు . అందువలన మీరు చేసిన ఏకర్మఅయినా కోరిన ఫలములివ్వలేదంటే ఆ కర్మను మీరు శ్రద్ధతో చేయలేదని అర్ధం . శ్రద్ధ లేకుండ కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు . సర్వకాలాలలోను సందేహాతీతమైన ప్రామాణ్యం కలవి శాస్త్రాలు . అందువలన శ్రద్ధతో కర్మలనాచరించాలనేది చాలా ముఖ్యం .


అయితే శ్రద్ధ అంటే ఏంటి ? అనే ప్రశ్నకు ఆదిశంకరులు ఇలా సమాధానమిచ్చారు .


" శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుధ్యాసవధారణా !

  సాశ్రద్దా కథితా సద్భి: !! "


శాస్త్రాలలో గురువాక్యంలో అచంచలమైన నమ్మకమే శ్రద్ధ అని . ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి .


పురాణాలలో దక్షప్రజాపతి ఈశ్వరద్వేషంతో యజ్ఞం చేయ తలపెట్టాడు . యజ్ఞం సత్ఫలితాలనివ్వకపోగా , అది ఘోరమైన విధ్వంసంతో ముగిసింది .


గురువుగారి ఉపదేశాన్ని శ్రద్ధతో గ్రహించేవానికే జ్ఞానం లభిస్తుంది . 


" శ్రద్దావాన్ లభతే జ్ఞానం " - అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు .


అందువలన మనిషి జీవితంలో శ్రద్ధ చాలా అవసరం . అందరు శ్రద్ధతో కర్మలనాచరించి శ్రేయస్సును పొందుదురుగాక .


   - జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు.

కామెంట్‌లు లేవు: