6, డిసెంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 101*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 101*

                                    *****

      *శ్లో:-దానం భోగో నాశ స్త్రిస్రో ౹*

             *గతయో  భవన్తి  విత్తస్య ౹*     

             *యో న దదాతి న భున్క్తే౹*

             *తస్య తృతీయా గతి ర్భవతి౹౹*

                                     *****

*భా:- "ధనమూల మిదం జగత్" ; "సర్వే గుణాః కాంచన మాశ్రయంతి" అని ఆర్యోక్తులు వింటుంటాము. విత్తానికి అంతటి మహత్తర ప్రతిపత్తి ఉన్నది. అంతటి ప్రధానమైన విత్తానికి మూడంటే మూడు గతులు ఉన్నాయి. 1"భోగము" :- ధనం పుష్కలంగా ఉన్నవాడు  భార్యాబిడ్డల సకల అవసరాల నిమిత్తం తృప్తిగా ఖర్చుపెట్టాలి.స్థలాలు,పొలాలు,నగ- నట్రా, విద్య- ఉపాధి,పెండ్లి-పేరంటం, విందు-వినోదం కోసం వెచ్చించి విలాసవంతంగా జీవించాలి. 2. "దానము" :- మానవుడు పైన తెలిపిన విధంగా తృప్తిగా జీవిస్తూ, ఉదారగుణంతో పరోపకారం కోసం కొంత దాన ధర్మాలు చేయాలి. పేద  సాదలను, అంగవికలురను, అనాథలను,నిరాశ్రయులను ఇతోధిక సాయంతో ఆదు కుంటూ, దైవకార్యాలకు, ధార్మికకర్మలకు వియోగించవచ్చును. ఆ పుణ్యఫలం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. 3."నాశము":- పైన చెప్పిన విధంగా తాను అనుభవించక, పరులకు పిసరంత దానం చేయక పిసినారితనంతో, స్వార్థంతో కూడబెట్టిన సొమ్ముకు మూడవగతే పడుతుంది. అదే నాశము. చివరికి అలాంటి సొమ్ము దొరలపాలో, దొంగలపాలో అవుతుంది.  అకృత్యాలకు, ఆరాచకాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. "దురాశ దుఃఖమునకు చేటు" అని అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లవుతుంది. కాన మనం కడుపు నిండా తినాలి. పరులకు ఇంత  పెట్టాలి. సమాజ ఋణం తీర్చుకోవాలి. "మానవసేవయే మాధవసేవ" అని, "జనసేవయే జనార్దనసేవ" అని, "నరుని సేవయే నారాయణ సేవ" అనే నిరంతర స్ఫురణలో పురోగమించాలని సారాంశము*.

                               *****

                *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: