మంచి నడత, క్షమ, ధైర్యం, కృతజ్ఞత అనేవి సుగుణ రాశులు. ఇందులో కృతజ్ఞత విచిత్రమైంది. కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం... రెండూ పొరపాటే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. కానీ ఇంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత. మనం చేసేది సహాయం కాదు, సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది.
సుగుణాలను సాధన చేయాలి. సుగుణ భూషణుడనిపించుకునేందుకు తహతహలాడాలి. దుర్గుణాలు మనిషిని నీచస్థితికి దిగజారుస్తాయి. కామం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషంలాంటి భయానక స్థితి మరొకటి లేదు. మూర్ఖత్వం లాంటి బంధం ఇంకొకటి లేదు. దురాశ లోతు తెలియని వరద లాంటిది. అందుకే వీటికి దూరంగా ఉంటూ సుగుణాలన్నింటినీ పట్టుదలతో సాధన చేయాలి. కోపం, అసహనం... మన పైనే మనం ప్రయోగించుకోవాలని బుద్ధుడు చెబుతాడు. ఎందుకంటే అవి గొప్ప సుగుణాలే అవుతాయి. సుగుణభూషణుడు తాను పొందిన కష్టాలను నీటిపై రాసుకోవాలి. తాను పొందిన కరుణను రాయిపై రాసుకొంటాడు. దైవం మనకు ప్రసాదించిన వాటిపట్ల మనం కృతజ్ఞత చూపితే దైవం మనకు మరింతగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే సుగుణభూషణుల పట్ల అంతర్యామి సదా అనురాగ హృదయుడై ఉంటాడు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి